Share News

అర్ధరాత్రి హాహాకారాలు

ABN , Publish Date - Dec 30 , 2025 | 01:27 AM

ఝార్ఖండ్‌లోని టాటా నగర్‌ నుంచి కేరళలోని ఎర్నాకుళం వెళుతున్న హంసఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆదివారం అర్ధరాత్రి ఎలమంచిలి స్టేషన్‌కు మరికొద్దిసేపట్లో చేరుకోనుండగా గాఢ నిద్రలో వున్న ప్రయాణికుల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది.

అర్ధరాత్రి హాహాకారాలు

టాటానగర్‌- ఎర్నాకుళం రైలు బోగీలో తొలుత పొగలు.. క్షణాల్లోనే మంటలు

ఏం జరిగిందో తెలియక ప్రయాణికుల్లో అలజడి

ప్రాణభయంతో అరుపులు, కేకలు

చైనులాగి రైలును ఆపడానికి యత్నం

మంటలు మరింత పెరగడంతో గందరగోళం

కొద్దిసేపట్లో ఎలమంచిలి స్టేషన్‌లో రైలును ఆపిన లోకోపైలట్లు

లగేజీని వదిలేసి.. అద్దాలు పగలగొట్టుకొని బయటకు వచ్చేసిన ప్రయాణికులు

పక్కనే ఉన్న మరో బోగీకి అంటుకుంటున్న మంటలు

అగ్నిమాపక శకటాలు వచ్చేలోపే పూర్తిగా దగ్ధం

ప్రమాదం కారణంగా ఆలస్యంగా నడిచిన పలు రైళ్లు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

ఝార్ఖండ్‌లోని టాటా నగర్‌ నుంచి కేరళలోని ఎర్నాకుళం వెళుతున్న హంసఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆదివారం అర్ధరాత్రి ఎలమంచిలి స్టేషన్‌కు మరికొద్దిసేపట్లో చేరుకోనుండగా గాఢ నిద్రలో వున్న ప్రయాణికుల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. తొలుత బీ1 బోగీ ముందు భాగంలో పొగలు రావడంతో కలకలం రేగింది. కొద్దిసేపటికే మంటలు రావడంతో ప్రయాణికుల్లో హాహాకారాలు మొదలయ్యాయి. అర్ధరాత్రి కావడంతో ఏం జరిగిందో తెలియక బోగీలో అటు.. ఇటు పరుగులు తీశారు. కొంతమంది రైలును ఆపడానికి చైన్లు లాగారు. ఈలోగా ఎలమంచిలి స్టేషన్‌కు చేరుకోవడంతో లోకోపైలట్లు రైలును అత్యవసరంగా నిలుపుదల చేశారు. బీ1 బోగీతోపాటు ఇతర బోగీల్లో వున్న ప్రయాణికులు ఎక్కడి సామగ్రిని అక్కడే వదిలేసి, బతుకుజీవుడా అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు రావడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో మంటలు పక్కనే వున్న ఎం-2 బోగీకి కూడా వ్యాపించాయి. దీంతో లోకోపైలట్‌లు, టీటీఈలు, బోగీల్లో వుండే సహాయక సిబ్బంది, ఇతర బోగీల్లో నుంచి దిగిన ప్రయాణికుల్లో కొంతమంది పరుగు పరుగున మంటలు వ్యాపించిన బోగీల వద్దకు వచ్చి ‘ఎమర్జెన్సీ’ కిటికీల అద్దాలను పగలగొట్టి, వాటిల్లోని ప్రయాణికులు త్వరగా బయటకు వచ్చేలా సహకరించారు. ఈలోగా ఎలమంచిలి రైల్వే స్టేషన్‌ సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి, పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. కొద్దిసేపట్లోనే ఎలమంచిలి నుంచి అగ్నిమాపక శకటం వచ్చింది. అప్పటికే రెండు బోగీల నుంచి మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మరికొద్దిసేపటికి అనకాపల్లి నుంచి మరో అగ్నిమాపక శకటం కూడా చేరుకుంది. సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపుచేశారు. బీ1, ఎం2 బోగీలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ రెండు బోగీల్లో ప్రయాణిస్తున్న (బీ1 బోగీలో 76 మంది, ఎం-2 బోగీలో 82 మంది) వారంతా సురక్షితంగా బయటపడ్డారని అంతా భావించారు. ఈలోగా విశాఖపట్నం నుంచి ఒక మహిళ రైల్వే అధికారులకు, పోలీసులకు ఫోన్‌ చేసి, విశాఖ నుంచి విజయవాడ వెళ్లడానికి తన తండ్రి ఇదే రైలులో ప్రయాణిస్తున్నారని, ఆయనకు ఫోన్‌ చేస్తే స్పందించడంలేదని చెప్పారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కలిసి బోగీల్లోకి వెళ్లి పరిశీలించారు. బీ1 బోగీలో ఒక వ్యక్తి తీవ్రంగా కాలిపోయి మృతిచెందినట్టు గుర్తించి బయటకు తీసుకువచ్చారు. ఇతను విజయవాడకు చెందిన చంద్రశేఖర్‌ సుందర్‌ (70)గా గుర్తించారు. రెండు బోగీల్లో ప్రయాణికుల సామగ్రి పూర్తిగా కాలిపోయింది. రైలు నర్సింగబిల్లి స్టేషన్‌ దాటిన తరువాత బీ1 బోగీ బ్రేకులు పట్టేయడంతో తొలుత పొగ వచ్చిందని, కొద్దిసేపటికే మంటలు ఎగిశాయని ఈ బోగీల్లో వున్న వారికి కొంతమంది ప్రయాణికులు చెబుతున్నారు. రైల్వే అధికారులు వచ్చి రెండు బోగీలను క్షుణ్ణంగా పరిశీలించారు. వాస్తవంగా ఈ రైలు రాత్రి 8.58 గంటలకు అనకాపల్లి చేరుకొని, 9.00 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. అయితే ఆదివారం సుమారు నాలుగు గంటల ఆలస్యంగా అనకాపల్లి వచ్చినట్టు రైల్వే అధికారులు తెలిపారు.

ఆలస్యంగా నడిచిన పలు రైళ్లు..

అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): టాటానగర్‌- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించి, ఎలమంచిలి స్టేషన్‌లో నిలుపుదల చేయడంతో ఆ ప్రభావం పలు రైళ్ల రాకపోకలపై పడింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. హౌరా-సికింద్రాబాద్‌ ఈస్టుకోస్టు ఎక్స్‌ప్రెస్‌ అనకాపల్లికి తెల్లవారుజామున 4.45 గంటలకు రావాల్సి ఉండగా ఉదయం 8.10 గంటలకు వచ్చింది. ఉదయం ఏడు గంటలకు రావాల్సిన విశాఖ-సికింద్రాబాద్‌కు జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ 9.01 గంటలకు; 7.55 గంటలకు రావాల్సిన విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ గంటపైగా ఆలస్యంగా వచ్చాయి. ధన్‌బాద్‌అలెప్పీ ఎక్స్‌ప్రెస్‌ 9.24 గంటలకు రావాల్సి వుండగా ఐదు గంటలు ఆలస్యంగా వచ్చింది. తెల్లవారుజామున 4.20 గంటలకు రావాల్సిన పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ ఉదయం ఎనిమిది గంటలకు వచ్చింది. అనకాపల్లిలో హాల్ట్‌ లేని ఫలక్‌నుమా, కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లు రెండు గంటలు ఆలస్యంగా నడిచాయి.

Updated Date - Dec 30 , 2025 | 01:27 AM