నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం
ABN , Publish Date - Jun 11 , 2025 | 11:49 PM
వేసవి సెలవులు ముగియడంతో గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. గతానికి భిన్నంగా విద్యాశాఖను ప్రక్షాళన చేయడంతో విద్యార్థులకు గుణాత్మక బోధనతో పాటు నాణ్యమైన పోషకాహారం అందుతుందనే ఆశాభావాన్ని తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు.
ఒకటి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు విద్యామిత్రా కిట్ల అందజేతకు చర్యలు
సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనానికి ఏర్పాట్లు
జిల్లా వ్యాప్తంగా 2,894 విద్యాలయాలు
లక్షా 85 వేల మంది విద్యార్థులు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
వేసవి సెలవులు ముగియడంతో గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. గతానికి భిన్నంగా విద్యాశాఖను ప్రక్షాళన చేయడంతో విద్యార్థులకు గుణాత్మక బోధనతో పాటు నాణ్యమైన పోషకాహారం అందుతుందనే ఆశాభావాన్ని తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని 22 మండలాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు మొత్తం 2,894 ఉన్నాయి. వాటిలో లక్షా 85 వేల మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఏడాది నుంచి ఒకటో తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులందరికీ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరిట విద్యామిత్రా కిట్లను అందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. వాటిని పాఠశాలల పునఃప్రారంభం నుంచి విద్యార్థులకు అందజేసేలా చర్యలు చేపట్టారు. ఆయా విద్యామిత్రా కిట్‌లలో నోటు పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్, యూనిఫారం దుస్తులు, బూట్లు, నిఘంటువు, బెల్ట్ ఉంటాయి.
సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం
ప్రభుత్వ విద్యాలయాల్లో డొక్కా సీతమ్మ పేరిట మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించడంలో భాగంగా పటిష్ట చర్యలు చే పట్టాలని విద్యాశాఖ భావిస్తున్నది. అలాగే విద్యా హక్కు చట్టం ప్రకారం ఐదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ పాఠశాలల్లో ఉండేలా, డ్రాపవుట్స్ కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యాశాఖాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఐదేళ్లు నిండిన బాలలను పాఠశాలల్లో చేర్పించేందుకు బడిబాట వంటి కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతానికి భిన్నంగా విద్యాలయాల్లో మార్పులను తీసుకువచ్చి చక్కని వసతులు కల్పిస్తూ గుణాత్మక విద్యతోపాటు నాణ్యమైన పోషకారాన్ని అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
జిల్లాలోని వివిధ యాజమాన్యాల కింద ఉన్న విద్యాలయాలు
- ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు: 100
- ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు: 35
- ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు : 12
- మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు: 1,417
- మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు: 75
- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు: 31
- కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు: 19
- గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాలలు: 971
- గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమికోన్నత ఆశ్రమ పాఠశాలలు: 25
- గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమోన్నత పాఠశాలలు: 172
- గిరిజన సంక్షేమ గురుకుల ప్రాథమికోన్నత పాఠశాలలు: 4
- గిరిజన సంక్షేమ గురుకుల ఉన్నత పాఠశాలలు: 33
- జిల్లాలో మొత్తం విద్యాలయాలు: 2,894... లక్షా 85 వేల మంది విద్యార్థులు