పాఠశాలల్లో ‘ముస్తాబు’
ABN , Publish Date - Dec 21 , 2025 | 01:36 AM
ప్రభుత్వ పాఠశాలల్లో ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు.
విశాఖపట్నం, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ పాఠశాలల్లో ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. తరగతి గది వద్ద విద్యార్థుల కోసం అద్దం, దువ్వెన, పౌడర్, వాష్ బేసిన్ వద్ద సబ్బు, నేప్‌కిన్స్ ఏర్పాటుచేశారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉదయం ప్రార్థనకు ముందు/తరువాత ముస్తాబు అమలును పర్యవేక్షించారు. రెండు, మూడు రోజుల్లో ప్రతి తరగతి గది ముందు అద్దం, దువ్వెన ఏర్పాటుచేయాలని ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమకుమార్ సూచించారు. శనివారం ఆయన గాజువాక ఉన్నత పాఠశాల, ఆనందపురం మండలం వెల్లంకి జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల్లో పరిశుభ్రత, ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగితే చదువుపై ఆసక్తి చూపుతారని ఆయన అన్నారు.
నగరంలో వండర్‌లా థీమ్ పార్క్
50 ఎకరాల్లో ఏర్పాటుకు నిర్ణయం
విశాఖపట్నం, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నంలో మరో అతి పెద్ద పర్యాటక ప్రాజెక్టు రానుంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో మాదిరిగా విశాఖలో థీమ్ పార్క్ ఏర్పాటుకు ‘వండర్‌లా’ గ్రూపు ముందుకువచ్చింది. ఈ విషయాన్ని ఇటీవల విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో పర్యాటక శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ వెల్లడించారు. ఇందుకోసం విశాఖలో 50 ఎకరాలు కేటాయించనున్నట్టు తెలిపారు. వండర్‌లా దేశ వ్యాప్తంగా థీమ్ పార్కులు నిర్వహిస్తున్నది. ఆ పార్కుల్లో అన్నీ నిబంధనల ప్రకారమే జరుగుతాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అంతా ఆడి పాడి ఆనందించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. జాయ్ రైడ్స్, వాటర్ గేమ్స్ వంటివి ఉంటాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పర్యాటక ప్రాజెక్టులను త్వరితంగా గ్రౌండింగ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
హాట్ మెటల్ ఉత్పత్తిలో స్టీల్‌ప్లాంటు మరో రికార్డు
24 గంటల వ్యవధిలో 21,531 టన్నుల ఉత్పత్తి
ఉక్కుటౌన్‌షిప్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి):
స్టీల్‌ప్లాంటులోని బ్లాస్ట్‌ఫర్నేస్ విభాగంలో మరోసారి రికార్డు స్థాయిలో హాట్ మెటల్ ఉత్పత్తి జరిగింది. గడిచిన ఆదివారం 21,205 టన్నుల ఉత్పత్తి జరగ్గా, తాజాగా శుక్రవారం ఉదయం ఆరు నుంచి శనివారం ఉదయం ఆరు గంటల వరకు ఏ,బీ,సీ మూడు షిఫ్ట్‌లలో కలిపి 21,531 టన్నుల ఉత్పత్తి సాఽధించడంతో కొత్త రికార్డు నమోదయ్యింది. బ్లాస్ట్ ఫర్నేస్-1లో 6,328 టన్నులు, బ్లాస్ట్ ఫర్నేస్-2లో 6,825 టన్నులు, బ్లాస్ట్ ఫర్నేస్-3లో 8,378 టన్నులు కలిపి మొత్తం 21531 టన్నుల ఉత్పత్తి జరిగింది. బ్లాస్ట్‌ఫర్నేస్ విభాగంలో ఉత్పత్తి అధిక మొత్తంలో సాధించడంతో స్టీల్ మెల్ట్‌షాప్ (ఎస్‌ఎంఎస్)-1 విభాగంలో 66 హీట్లు (భారీ సైజు కలిసిన ఇనుప దిమ్మలు), ఎస్‌ఎంఎస్-2 విభాగంలో 67 హీట్లు...మొత్తం 133 హీట్ల ఉత్పత్తి జరిగింది.
‘స్పోర్ట్స్ ఎరీనా’ నిర్వాహకులపై జీవీఎంసీ కమిషనర్ సీరియస్
నెలాఖరులోగా 80 శాతం అద్దె బకాయిలు చెల్లించాలని ఆదేశం
లేనిపక్షంలో స్టేడియం లీజును రద్దు చేస్తామని హెచ్చరిక
విశాఖపట్నం, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి):
ఎంవీపీ కాలనీలోని ‘స్పోర్ట్స్ ఎరీనా’ నిర్వాహకులపై జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.25 కోట్లతో జీవీఎంసీ స్పోర్ట్స్ ఎరీనా కాంప్లెక్స్‌ను నిర్మించింది. దీనిని ఒక ప్రైవేటు సంస్థకు అద్దెకు (మూడు నెలలకు రూ.28 లక్షలు) ఇచ్చింది. అయితే స్పోర్ట్స్ ఎరీనాను దక్కించుకున్న సంస్థ జీవీఎంసీకి సక్రమంగా అద్దె చెల్లించకపోవడంతో ప్రస్తుతం బకాయి రూ.1.2 కోట్ల మేర పేరుకుపోయింది. ఈ విషయమై ‘గ్రేటర్‌తో గేమ్స్’ శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కమిషనర్ కేతన్‌గార్గ్ స్పోర్ట్స్ ఎరీనా నిర్వాహకుడిని కిర్లంపూడి లేఅవుట్‌లోని స్మార్ట్ సిటీకార్యాలయానికి పిలిపించినట్టు తెలిసింది. అద్దె సక్రమంగా చెల్లించకపోవడంపై ప్రశ్నించినట్టు సమాచారం. స్టేడియానికి వచ్చే క్రీడాకారులు, పిల్లల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తూ, అద్దెను సక్రమంగా చెల్లించకపోవడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నెలాఖరులోగా 80 శాతం అద్దె బకాయి చెల్లించాలని, లేనిపక్షంలో లీజు రద్దు చేస్తానని హెచ్చరించినట్టు సమాచారం. అలాగే స్పోర్ట్స్ ఎరీనా పేరుతో ఎస్ర్కో ఖాతాను తెరిచి, ఫీజుగా వచ్చిన మొత్తంలో మూడు నెలల అద్దె ఆటోమేటిక్‌గా జీవీఎంసీకి చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. అద్దె బకాయి చెల్లించలేదని తన దృష్టికి వస్తే మరో అవకాశం కూడా ఇవ్వకుండా స్పోర్ట్స్ ఎరీనాను స్వాధీనం చేసుకుంటామని కమిషనర్ స్పష్టంచేసినట్టు జీవీఎంసీ అధికారి ఒకరు తెలిపారు.