Share News

పాఠశాల క్రీడా స్థలం కబ్జా

ABN , Publish Date - Aug 01 , 2025 | 12:45 AM

అనకాపల్లి మండలం మామిడిపాలెంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన ఆట స్థలం ఆక్రమణలకు గురవుతున్నది. కొంతమంది అక్రమార్కులు పాఠశాల క్రీడా మైదానాన్ని కబ్జా చేసి, దర్జాగా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పాఠశాల క్రీడా స్థలం కబ్జా
మామిడిపాలెంలో జడ్పీ ఉన్నత పాఠశాల ఆట స్థలానికి కేటాయించిన భూమి

మామిడిపాలెంలో దర్జాగా పక్కా ఇళ్ల నిర్మాణం

స్థానికులు ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు

తుమ్మపాల, జూలై 31 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి మండలం మామిడిపాలెంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన ఆట స్థలం ఆక్రమణలకు గురవుతున్నది. కొంతమంది అక్రమార్కులు పాఠశాల క్రీడా మైదానాన్ని కబ్జా చేసి, దర్జాగా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మామిడిపాలెం రెవెన్యూ పరిధి సర్వే నంబరు 145లో సుమారు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు ఆట స్థలం కోసం 20 ఏళ్ల క్రితం అధికారులు కేటాయించారు. అయితే విద్యా శాఖకుగానీ, జిల్లా పరిషత్‌కుగానీ డాక్యుమెంటేషన్‌ రూపంలో బదలాయింపు జరగలేదు. విద్యా శాఖ అధికారులు సైతం ఈ స్థలాన్ని క్రీడా మైదానంగా అభివృద్ధి చేయడానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో వున్నప్పుడు 2018లోమహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల ఏర్పాటు కోసం ఈ స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ మేరకు అప్పటి ఉమ్మడి విశాక జిల్లా కలెక్టర్‌ ఆమోద ముద్ర వేశారు. నిధులు మంజూరైతే భవన నిర్మాణాలు చేపట్టాలని అధికారులు భావించారు. ఈలోగా ప్రభుత్వం మారిపోయి, వైసీపీ అధికారంలోకి వచ్చింది. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల భవన నిర్మాణం అటకెక్కింది. తరువాత 2022లో ఈ భూమిని పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలని ప్రభుత్వం భావించగా, కొంతమంది స్థానికులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టేఆర్డర్‌ తీసుకువచ్చారు. అప్పటి నుంచి యథాతథస్థితి కొనసాగుతున్నది.

అయితే తాజాగా కొంతమంది అక్రమార్కుల కన్ను ఈ స్థలంపై పడింది. యంత్రాలతో స్థలాన్ని చదును చేసి ఆక్రమించుకుంటున్నారు. ముగ్గురు వ్యక్తులు ఐదేసి సెంట్ల చొప్పున ఆక్రమించి పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మరో ముగ్గురు వ్యక్తులు సుమారు 15 సెంట్లు ఆక్రమించారు. స్థానికులు ఎవరైనా ప్రశ్నిస్తే.. తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన స్థలం అంటూ ఏవో కాగితాలు చూపిస్తున్నారు. దీంతో మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు స్పందనలేదు. రెవెన్యూ సిబ్బంది ఇటువైపు కన్నెత్తి అయినా చూడడం లేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి, మామిడిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలకు కేటాయించిన భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

ఫిర్యాదులు చేసినా స్పందించ లేదు

పూడి పరదేశినాయుడు, సర్పంచ్‌, మామిడిపాలెం

జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు క్రీడా మైదానం కోసం సుమారు రెండు దశాబ్దాల క్రితం ప్రభుత్వం ఐదు ఎకరాలు కేటాయించింది. ఇటీవల కొంతమంది ఈ స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మిస్తున్నారు. దీనిపై మండల, డివిజన్‌, జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదు చేశాం. కానీ ఒక్కరు కూడా స్పందించలేదు.

Updated Date - Aug 01 , 2025 | 12:45 AM