Share News

భయపెడుతున్న స్క్రబ్‌ టైఫస్‌

ABN , Publish Date - Dec 01 , 2025 | 12:06 AM

జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది.

భయపెడుతున్న స్క్రబ్‌ టైఫస్‌

  • నల్లిని పోలిన కీటకం కుట్టడంతో వ్యాధి

  • జ్వరం, వాంతులు, అలసట, దగ్గు వంటి లక్షణాలు

  • జిల్లాలో ఇప్పటివరకు 133 కేసులు నమోదు

  • జ్వరం తగ్గకపోతే పరీక్షలు చేసుకోవాలి: వైద్యులు

విశాఖపట్నం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. 133 కేసులతో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో ఉంది. దీంతో నగరంలో వ్యాధి పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ప్రాథమిక దశలో గుర్తిస్తే వారం పదిరోజుల్లో బయటపడవచ్చు, నిర్లక్ష్యం కూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి 133 మందికి స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి సోకింది. నల్లిని పోలిన చిన్న కీటకం కుట్టడంతో వ్యాధి సోకుతోంది. ‘రికెట్సియా కుటుంబానికి చెందిన ‘ఓరియంటియా సుట్సుగముషీ’ అనే బాక్టీరియా వల్ల స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి సోకుతుంది. కీటకం కుడితే శరీరంపై నల్లని దద్దుర్లు వస్తాయి. సాధారణంగా ఇళ్లల్లో మంచాలు, దివాన్లపై ఏళ్లుగా వాడే దిండ్లలో ఇటువంటి కీటకాలు చేరుతాయి. నల్లి కుట్టినట్టుగా భావిస్తుంటాం. కానీ వారం లేదా రెండు వారాల తరువాత జ్వరం వస్తుంది. పేరాసిట్‌మాల్‌ వేసుకుంటే తగ్గదు. మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌ పరీక్షలు చేసినా నెగిటివ్‌ వస్తుంది. కానీ పది రోజులైనా జ్వరం తగ్గకపోవడం, శరీరంలో వ్యాధి లక్షణాలు తీవ్రం కావడంతో అకస్మాత్తుగా 100 నుంచి 104 డిగ్రీల జ్వరం, తలనొప్పి, వాంతులు, వళ్లు నొప్పులు, అలసట, దద్దుర్లు ఉంటాయి. కొంతమందిలో కడుపునొప్పి, దద్దుర్లు గోకితే నల్లని మచ్చలు ఏర్పడతాయి. ఆలస్యం చేస్తే వ్యాధితీవ్రత పెరిగి కిడ్నీలు,శ్వాస సంబంధ సస్యలు, మెదడు, వెన్నెముక సమస్యలు తలెత్తుతాయి.

అంటువ్యాధి కాదు

ఇది అంటు వ్యాధి కాదు. కీటకం కుట్టిన వారికే పరిమితమవుతుంది. మిగిలిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తోటలు, పొలాల్లో పనిచేసేవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇళ్లలో పాతబడిన బొంతలు, దుప్పట్లు, పరుపులు శుభ్రపరుచకోవాలి. ఎప్పటికప్పుడు ఎండలో పెట్టాలి. జ్వరం తగ్గకపోయినా, శరీరంపై నల్లని మచ్చలు వచ్చినా స్క్రబ్‌ టైఫస్‌ ఎలీషా పరీక్ష చేయించుకోవాలి. వ్యాధి సోకిన వారికి యాంటీ బయోటిక్స్‌ ఇస్తారు. చికిత్స ప్రారంభించిన ఐదు నుంచి వారం రోజుల్లో తగ్గుతుంది. మాత్రలు ఇచ్చిన రెండురోజుల్లోనే తీవ్రత తగ్గుతుంది. మొత్తం కోర్సును తీసుకోవాల్సి ఉంటుంది.

అప్రమత్తత అవసరం

స్క్రబ్‌ టైఫస్‌ ప్రాణాంతకంకాదు. నిర్లక్ష్యం చేయకూడదు. జ్వరం తగ్గకపోయినా, ఒక్కోసారి 104 డిగ్రీల జ్వరం, ఒంటిపై నల్లని మచ్చలు, అలసట వస్తే వెంటనే స్క్రబ్‌ టైఫస్‌ ఎలీషా పరీక్ష నిర్వహించాలి. వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి. అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యంచేస్తే శ్వాసకోశ వ్యాధి, కిడ్నీ ఫెయిల్‌ కావడం, లివర్‌ ఫంక్షన్‌, కొన్ని అవయవాలు దెబ్బతింటాయి. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకుని, చికిత్స తీసుకోవాలి.

- డాక్టర్‌ కె.రాంబాబు, డైరెక్టర్‌, విమ్స్‌

Updated Date - Dec 01 , 2025 | 12:06 AM