భయపెడుతున్న బడి
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:07 PM
జిల్లాలోని పలు మండలాల్లో కొన్ని పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితిలో ఉన్నాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ తరగతి గదుల్లో కాలం వెల్లదీస్తున్నారు.
శిథిలావస్థలో యర్రవరం పాఠశాల
బీటలువారిన గోడలు
ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
నూతన భవనం నిర్మించాలని వేడుకోలు
చింతపల్లి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో కొన్ని పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితిలో ఉన్నాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ తరగతి గదుల్లో కాలం వెల్లదీస్తున్నారు.
చింతపల్లి మండలంలోని గొందిపాకలు పంచాయతీ యర్రవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. గ్రామంలో విద్యాబోధనకు ప్రత్యామ్నాయ భవనం అందుబాటులో లేక శిథిలావస్థకు చేరిన భవనంలోనే తరగతులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. యర్రవరం గ్రామంలో సుమారు 25 ఏళ్ల క్రితం రేకులతో పాఠశాల భవనం నిర్మించారు. పాఠశాల భవనంలో ఒక గది, బయట వరండా ఉంటుంది. పాఠశాలలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 32 మంది ఉన్నారు. ప్రస్తుతం పాఠశాల భవనం పైకప్పు పూర్తిగా కారిపోతున్నది. గోడలు పగుళ్లు ఇచ్చాయి. దీంతో ఏక్షణంలో గోడలు పడిపోతాయోనని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి శిథిలావస్థకు చేరిన పాఠశాలకు మరమ్మతులుగాని, నూతన భవనంగాని నిర్మించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.