Share News

భయపెడుతున్న బడి

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:25 AM

మండలంలోని బూదరాళ్ల పంచాయతీ శివారు చీడిపల్లి ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులను పంపాలంటేనే తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ఈ పాఠశాల భవనం రేకులతో షెడ్డులా ఉంటుంది. పైగా ఓ వైపు రేకులు ధ్వంసమై, గోడలు బీటలు వారి కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది.

భయపెడుతున్న బడి
పాఠశాల పైకప్పు ధ్వంసమైన దృశ్యం

- శిథిల స్థితిలో చీడిపల్లి పాఠశాల భవనం

- పైకప్పు కొంత మేర కూలిపోయినా అందులోనే తరగతుల నిర్వహణ

- భీతిల్లుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు

- పట్టించుకోని అధికారులు

కొయ్యూరు, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని బూదరాళ్ల పంచాయతీ శివారు చీడిపల్లి ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులను పంపాలంటేనే తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ఈ పాఠశాల భవనం రేకులతో షెడ్డులా ఉంటుంది. పైగా ఓ వైపు రేకులు ధ్వంసమై, గోడలు బీటలు వారి కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఒకే గది ఉన్న ఈ భవనంలోనే మరో వైపు విద్యార్థులను కూర్చోబెట్టి తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ భవనం ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులు కూడా ఆందోళన చెందుతున్నారు.

మండలంలోని బూదరాళ్ల పంచాయతీ శివారు చీడిపల్లి ప్రాథమిక పాఠశాల షెడ్డు శిథిల స్థితికి చేరింది. అయినా భవనం మరమ్మతులుగానీ, నూతన భవన నిర్మాణంగానీ అధికారులు చేపట్టలేదు. ఫలితంగా పాడైన షెడ్డులోనే చిన్నారుల చదువులు సాగుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ పాఠశాలలో 20 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులున్నారు. నాలుగేళ్ల క్రితం వీచిన ఈదురుగాలులకు పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. షెడ్డు గోడలు బీటలు వారాయి. గచ్చులు ఆనవాళ్లు లేకుండా పోయాయి. అయినప్పటికీ విద్యార్థులకు ఈ శిఽథిల షెడ్డులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దృష్టికి గ్రామస్థులు పలు పర్యాయాలు తీసుకువెళ్లినా మరమ్మతులు చేపట్టలేదు. పాఠశాల షెడ్డు దుస్థితిని విద్యాశాఖాధికారులు పలు దఫాలు ఉన్నతాధికారులకు నివేదించినా ఫలితం లేకపోయింది. నాడు-నేడు పథకంలో ఇక్కడ భవన నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. ఇటువంటి పాఠశాల షెడ్లు మండలంలో మారుమూల కొండలపై సుమారు 10 వరకు ఉన్నాయి. ఇవి కొండలపై ఉండడం వలనే నాడు-నేడు పథకం వర్తించలేదని అంటున్నారు. వర్షాకాలం రాకమునుపే వీటికి మరమ్మతులు చేయించేలా చర్యలు తీసుకుంటే విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఎంఈవో రాంబాబు వద్ద ప్రస్తావించగా.. చీడిపల్లి పాఠశాల భవనంపై నాడు-నేడులో చేర్చినా నిధులు మంజూరు కాలేదన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు షెడ్డు మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Apr 16 , 2025 | 12:25 AM