పీహెచ్‌సీల్లో అరకొర వైద్యం
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:14 PM
తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు సమ్మెబాట పట్టడడంతో రోగులకు అరకొర వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి.
వైద్యులు సమ్మెలో ఉండడంతో పూర్తిగా అందని సేవలు
రోగులకు వైద్య సేవలందిస్తున్న స్టాఫ్ నర్సులు, సిబ్బంది
సరైన పర్యవేక్షణ లేక విధులకు డుమ్మాకొడుతున్న పలువురు సిబ్బంది
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు సమ్మెబాట పట్టడడంతో రోగులకు అరకొర వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. వాస్తవానికి పీహెచ్‌సీల్లోని వైద్యులు సమ్మె చేస్తున్న తరుణంలో రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా ఆశించిన స్థాయిలో అది జరగలేదని తెలుస్తున్నది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులకు జీవో: 99ను రద్దు చేసి ఇన్సూరెన్స్ కోటాను 30 శాతం, క్లినికల్ 50 శాతం, నాన్ క్లినికల్ డిపార్ట్‌మెంట్‌లో సీట్లు కల్పించాలని, గిరిజన ప్రాంత పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులకు 30 శాతం బేసిక్ పే ట్రైబల్ అలవెన్స్ కల్పించాలని, టైమ్ బాండ్ పదోన్నతులు, నోషనల్ ఇంక్రిమెంట్, చంద్రన్న సంచార చికిత్స అలవెన్స్ రూ.4 వేలు ఇవ్వాలనే డిమాండ్లపై గత సెప్టెంబరు 30 నుంచి వైద్యులు సమ్మె చేస్తున్నారు.
ఫలితమివ్వని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
పీహెచ్‌సీల్లోని వైద్యులు సమ్మెలో పాల్గొనడంతో ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఆశించిన స్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయకపోవడంతో పీహెచ్‌సీలో అరకొర వైద్య సేవలు అందుతున్నాయని తెలుస్తున్నది. మెడికల్ కాలేజీలోని, ఆయుష్ విభాగం, పలు ఆస్పత్రుల నుంచి పలువురు వైద్యులు, సిబ్బందిని పీహెచ్‌సీలకు డిప్యూటేషన్ పద్ధతిలో నియమించారు. అయినప్పటికీ వాళ్లు సైతం ఆశించిన స్థాయిలో పీహెచ్‌సీల్లో విధులకు హాజరుకాకపోవడంతో, కింది స్థాయి సిబ్బంది సైతం విధులకు డుమ్మాకొడుతున్నారని పలువురు అంటున్నారు. గురువారం పెదబయలు పీహెచ్‌సీని తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో శ్రీపూజ పలువురు ఉద్యోగుల నిర్లక్ష్య ధోరణిని స్వయంగా గుర్తించారు. అలాగే డుంబ్రిగుడ పీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్యఖాధికారి కృష్ణమూర్తి పలువురు సిబ్బంది విధులకు హాజరుకాకపోవడాన్ని గుర్తించి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
అనంతగిరిలో..
అనంతగిరి: మండలంలోని అనంతగిరి, లుంగుపర్తి, పినకోట, భీమవరం పీహెచ్‌సీల వైద్యులు సమ్మెబాట పట్టడంపై రోగులు అవస్థలు పడుతున్నారు. ఆయా పీహెచ్‌సీల స్టాఫ్ నర్సులే వైద్య సేవలు అందించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క పీహెచ్‌సీలో ఇద్దరు చొప్పున వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే సమ్మె కారణంగా వైద్యులు అందుబాటులో లేరు. ప్రస్తుతం సీజనల్ వ్యాఽధులు వ్యాప్తి చెందుతుండడంతో 24 పంచాయతీలకు చెందిన గిరిజనులు ఆయా పీహెచ్‌సీ పరిధిలోని ఆస్పత్రికి వస్తుంటారు. అయితే ఈ నెల మొదటివారం నుంచి వైద్యులు సమ్మె చేపడుతుండడంతో ఆస్పత్రుల్లో స్టాఫ్‌నర్సులే రోగులను పరీక్షిస్తూ వైద్య సేవలను అందిస్తున్నారు. రోజుకు ఓపీ వందపైనే ఉంటుంది. పీహెచ్‌సీల నుంచి ఎమర్జెన్సీ కేసులను ఏరియా ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. కొందరు రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
కొయ్యూరులో..
కొయ్యూరు: మండలంలోని డౌనూరు, కంఠారం, యు.చీడిపాలెం పీహెచ్‌సీల వైద్యాధికారులు సమ్మెలో ఉండడంతో రోగులకు అరకొరగా వైద్య సేవలు అందుతున్నాయి. ఈ పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు స్టాఫ్ నర్సులే వైద్య సేవలు అందిస్తున్నారు. అత్యవసర కేసులను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు. గత్యంతరం లేక కొందరు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.