‘ఆశ’ ఉద్యోగాల పేరిట దందా
ABN , Publish Date - Aug 22 , 2025 | 10:55 PM
జిల్లాలో ఆశా కార్యకర్తల ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారులు రంగంలోకి దిగారు. అభ్యర్థులను వలలో వేసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దరఖాస్తుదారులకు ఫోన్లు చేసి బేరసారాలు చేస్తున్నారు. అయితే అధికారులు ఇటువంటి వాటిని నమ్మవద్దని, నియామకాలు పారదర్శకంగా జరుగుతాయని ప్రకటించారు.
అభ్యర్థులను వలలో వేసుకునేందుకు దళారుల యత్నాలు
దరఖాస్తుదారులకు ఫోన్లు
రిజర్వు చేసుకోవాలంటూ వత్తిడి
ఆపై బేరసారాలు
అటువంటి వాటిని నమ్మవద్దు : డీఎంహెచ్‌వో
(పాడేరు-ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని ఖాళీగా ఉన్న 124 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ గత నెలలో దరఖాస్తులు ఆహ్వానించారు. రెండు వారాల క్రితం ప్రాథమిక అర్హతల జాబితాను విడుదల చేశారు. ఇదే అదనుగా తమకు ఆశా కార్యకర్తల పోస్టులు వేయిస్తామంటూ పలువురు అక్రమార్కులు గ్రామాల్లో దందా మొదలు పెట్టారు. గ్రామ స్థాయిలో ఆశా కార్యకర్త పోస్టుల ఖాళీలు, వాటికి దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల వివరాలను తెలుసుకున్న అక్రమార్కులు వారికి ఫోన్లు చేసి ఉద్యోగం ఇప్పిస్తామంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్న వైనాలు వెలుగులోకి వస్తున్నాయి.
అక్రమార్కులు దందాకు యత్నిస్తున్న తీరిదీ..
ఎక్కడైనా ఉద్యోగాలిప్పిస్తామని ప్రజాప్రతిఽనిధులు లేదా అధికారులు దందాలు చేయడం చూస్తుంటాం. కాని ప్రస్తుతం ఆశా కార్యకర్తల పోస్టులకు సంబంధించిన దందా అందుకు భిన్నంగా గ్రామాల్లోనే మొదలు కావడం విశేషం. ప్రస్తుతం గ్రామాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు చెందిన నేతలతో అక్కడున్న వారికి పరిచయలుండడం సహజం. ఇదే అదనుగా తమ ప్రాంతాల్లోని ఆశా కార్యకర్తల పోస్టులకు దరఖాస్తులు చేసిన అభ్యర్థులకు ఫోన్లు చేసి, తమకు ఆ నేత తెలుసునని అభ్యర్థులను నమ్మబలుకుతూ అడ్డాన్స్‌గా డబ్బులిస్తే ఆయా పోస్టులను రిజర్వు చేసుకోవచ్చని చెబుతున్నారు. ఆలస్యమైతే ఇతరులకు ఈ అవకాశం ఇస్తామని అభ్యర్థులను భయపెడుతున్నారు. ఈక్రమంలో ఏం చేయాలో తెలియని పలువురు అభ్యర్థులు తమకు అవకాశం ఉన్న వ్యక్తులతో ఈ విషయాన్ని ప్రస్తావించి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే అభ్యర్థులు దానిపై ఆలోచించే అవకాశం సైతం ఇవ్వకుండా పోస్టు ఇప్పిస్తామని, వీలైతే సొమ్ము మొత్తం లేదా అడ్వాన్సుగానైనా కొంత సొమ్ము ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. అవకాశం మేరకు రూ.20వేలు నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారులు దృష్టి పెట్టకుంటే ముప్పే..
వైద్యారోగ్యశాఖలో ఆశా కార్యకర్తల పోస్టులను ఇప్పిస్తామని పలువురు చాపకింద నీరులా సాగిస్తున్న దందాకు ఆదిలోనే అట్టుకట్ట వేయకుంటే అభ్యర్థులు నష్టపోయే ప్రమాదముంది. ఆశా పోస్టులపై గుట్టుగా సాగుతున్న దందాపై జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్, ఎస్‌పీ అమిత్‌బర్దార్ ప్రత్యేక దృష్టి సారించాలి. అభ్యర్థులను సైతం చైతన్యం చేయకుంటే, ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదముంది. ఉద్యోగాల భర్తీకి చేపట్టే ప్రక్రియ, అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించాలి. అంతేకాకుండా దందాకు యత్నిస్తున్న వ్యక్తులను పట్టుకుని చట్టపరంగా శిక్షించే అవకాశాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మోసపూరిత మాటలు నమ్మవద్దు..
డీఎంహెచ్‌వో టి.విశ్వేశ్వరనాయుడు
ఆశా కార్యకర్తల పోస్టులు ఇప్పిస్తామని పలువురు అభ్యర్థులకు కొందరు ఫోన్లు చేస్తున్నారు. అటువంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనే నమ్మవద్దు. తమకు డబ్బులిస్తే ఆశా కార్యకర్తల పోస్టులు ఇప్పిస్తామని పలువురు దందా చేస్తున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. దానిని జాయింట్ కలెక్టర్ అభిషేక్‌గౌడ దృష్టికి తీసుకువెళ్లాను. అలాగే ఆశా పోస్టులను ప్రతిభ ఆధారంగా మాత్రమే భర్తీ చేస్తాం. ఎవరి పైరవీలతో ఆ పోస్టులు దక్కవని అభ్యర్థులు గుర్తించాలి. నిబంధనల ప్రకారం శతశాతం పారదర్శకతతో ఆయా పోస్టుల భర్తీకి చేస్తాం. అభ్యర్థులు అక్రమార్కుల మాటలను నమ్మి మోసపోవద్దు.