బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు ససేమిరా
ABN , Publish Date - Sep 30 , 2025 | 01:14 AM
బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటును వ్యతిరేకిస్తూ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో సోమవారం హోం మంత్రి వంగలపూడి అనితను మత్స్యకారులు అడ్డుకున్నారు.
హోం మంత్రి అనిత కాన్వాయ్‌ను అడ్డుకున్న మత్స్యకారులు
రాజయ్యపేటలో ఉద్రిక్తత
స్థానికులు కమిటీగా ఏర్పాటైతే సీఎం, డిప్యూటీ సీఎంల వద్దకు తీసుకువెళతానన్న మంత్రి
అప్పటివరకూ పనులు ఆపిస్తామని హామీ
కాన్వాయ్‌కు అడ్డుతొలగిన ఆందోళనకారులు
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా), సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి):
బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటును వ్యతిరేకిస్తూ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో సోమవారం హోం మంత్రి వంగలపూడి అనితను మత్స్యకారులు అడ్డుకున్నారు. ఆమె వాహనం ఎదుట రహదారిపై బైఠాయించారు. దీంతో ఈ వ్యవహారంపై స్థానికులతో ఏర్పాటయ్యే కమిటీని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళతానని, అప్పటివరకూ పనులు నిలుపుచేయిస్తానని ఆమె హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వివరాలిలా ఉన్నాయి.
బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా రాజయ్యపేటలో కొద్దిరోజులుగా మత్స్యకారులు ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని కలిసేందుకు సోమవారం సాయంత్రం మంత్రి అనిత గ్రామానికి వెళ్లారు. నిరసన శిబిరం వద్ద బల్క్ డ్రగ్ పార్కు వల్ల కలిగే నష్టాలను ఆమెకు పలువురు మత్స్యకార నాయకులు వివరించారు. ఇప్పటికే హెటెరో కాలుష్యంతో పరిసర గ్రామాల్లో పిల్లలు, పెద్దలంతా క్యాన్సర్ తదితర ప్రమాదకర వ్యాధుల బారినపడుతున్నారన్నారు. మంత్రిగా చొరవ తీసుకుని బల్క్ డ్రగ్ పార్కును ఆపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాలన్నీ ఎన్నికల్లో తనకు అండగా నిలిచాయని, తాను కూడా వారికి అండగా నిలుస్తానని ప్రకటించారు. రాజయ్యపేట అంటే తనకు పుట్టినిల్లులాంటిదని, మీ ఇంటి ఆడపడుచునని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాజకీయాలకతీతంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటే, త్వరలోనే సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల వద్దకు తీసుకువెళతానని హామీ ఇచ్చారు. అయితే కొందరు మత్స్యకార నాయకులు మాట్లాడుతూ తమకు ఇప్పుడే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశం తన పరిధిలో లేదని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని, కమిటీని తీసుకువెళ్లిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటానని చెప్పారు. అనంతరం ఆమె తిరుగు ప్రయాణం కాగా కాన్వాయ్‌ను వందల సంఖ్యలో మత్స్యకారులు, మహిళలు అడ్డగించారు. తమకు న్యాయం చేయాలని మత్స్యకారులు పట్టుబట్టారు. ఈ హఠాత్పరిణామానికి పోలీసులు, కూటమి నాయకులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. హోం మంత్రి అనిత కారు డోర్ తీసి మత్స్యకారులు అమాయకులని, వారిపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. కమిటీ ఏర్పాటై సీఎం, డిప్యూటీ సీఎం వద్దకు తీసుకువెళ్లేంత వరకూ పనులు ఆపిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులంతా అడ్డుతొలగారు.
మత్స్యకారులు అమాయకులు...వారిని కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారు
రాజయ్యపేట సహా మత్స్యకార గ్రామాలన్నీ ఎన్నికల సమయంలో టీడీపీకి అండగా నిలిచాయని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. మత్స్యకారులంతా అమాయకులని, అటువంటి వారిని కావాలని కొందరు బయట వ్యక్తులు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మత్స్యకారులను ఇబ్బంది పెట్టాలనేది తమ లక్ష్యం కాదన్నారు. సోమవారం రాత్రి స్థానికంగా ఉన్న క్యాంపు కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. బల్క్ డ్రగ్ పార్కు అనేది వైసీపీ ప్రభుత్వ పాలనలో మంజూరైతే వారంతా పాలాభిషేకం చేశారన్నారు. ప్రస్తుతం అన్ని పార్టీల నుంచి ఒక కమిటీ ఏర్పాటుచేయాలని సూచించానని, దసరా తరువాత సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. మత్స్యకారుల సోదరుల కడుపుకొట్టి, వారిని ఇబ్బంది పెట్టేలా బయట ప్రాంతాలకు చెందిన వ్యక్తులు రాజకీయాలు చేయకూడదని సూచించారు. మత్స్యకారుల వేట నిషేధ భృతి రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.