మంచులో సంత సోయగం!
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:38 PM
పాడేరులో ప్రతి ఏడాది శీతాకాలంలో తెల్లవారు సంత జరుగుతుంది. అయితే ఈ శుక్రవారం ఉదయం పొగమంచు కురుస్తుండగా సంత జరిగింది.
సందడిగా పాడేరు తెల్లవారు సంత
పూలు, కూరగాయలు, దుంపలు విక్రయం
పాడేరు, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): పాడేరులో ప్రతి ఏడాది శీతాకాలంలో తెల్లవారు సంత జరుగుతుంది. అయితే ఈ శుక్రవారం ఉదయం పొగమంచు కురుస్తుండగా సంత జరిగింది. రైతులు, వర్తకుల క్రయ, విక్రయాలతో సందడి నెలకొంది. గిరిజన రైతులు మార్కెట్‌కు వ్యవసాయ, అటవీ ఉత్పత్తులను తీసుకువచ్చి వర్తకులకు విక్రయిస్తుంటారు. ప్రధానంగా పూలు, దుంపలు, కూరగాయలు విక్రయిస్తుంటారు. అయితే తెల్లవారుజామున మంచు కురుస్తున్న వేళ జరిగే ఈ సంత మన్యానికి విచ్చేసే సందర్శకులను ఆకట్టుకుంటుంది.
తగ్గుతున్న ఉష్ణోగ్రతలు....
మన్యంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఉదయం వేళల్లో తొమ్మిది గంటల వరకు పొగమంచు దట్టంగా కురవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. ఏజెన్సీలో శుక్రవారం జి.మాడుగులలో 15.1 డిగ్రీల సెల్సియస్ నమోదుకాగా హుకుంపేటలో 15.4, అరకులోయ, డుంబ్రిగుడలో 15.6, ముంచంగిపుట్టులో 15.8, పాడేరులో 15.9, చింతపల్లిలో 16.5, పెదబయలులో 17.1, కొయ్యూరులో 20.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.