Share News

హుకుంపేటలో ఇసుక దందా

ABN , Publish Date - Oct 11 , 2025 | 11:29 PM

మండలంలో ఇసుక వ్యాపారం దర్జాగా సాగుతోంది. ప్రతి రోజూ వందకుపైగా లారీలు, ట్రాక్టర్లతో ఇసుక అక్రమంగా తరలిపోతోంది. చివరకు వర్షాలు కురుస్తున్నా అక్రమ రవాణా ఆగడం లేదు.

హుకుంపేటలో ఇసుక దందా
హుకుంపేట మండలంలోని భారీగా ఇసుక

దర్జాగా ఇసుక తవ్వకాలు, రవాణా

రోజుకు వంద వాహనాల్లో తరలింపు

ట్రాక్టర్‌ ఇసుక రూ. నాలుగు వేలు, లారీ ఇసుక రూ. ఏడు వేలు

తీగలవలస గెడ్డ పొంగుతున్నా ఆగని తవ్వకాలు

పట్టించుకోని రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం

స్థానికులకు దొరకని ఇసుక

జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని

గిరిజనులు వేడుకోలు

హుకుంపేట అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తీగలవలస పంచాయతీలోని గెడ్డ నుంచి ఇసుక తవ్వకాలు అక్రమంగా సాగుతున్నాయి. ఇక్కడ తవ్విన ఇసుకను లారీలు, ట్రాక్టర్లు, వ్యాన్లలో రవాణా చేస్తున్నారు. ఇక్కడ నుంచి తరలిస్తున్న ఇసుక హుకుంపేటలో ట్రాక్టరు లోడు నాలుగు వేలు రూపాయలు, లారీ ఏడు వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇంకా దూర ప్రాంతాలకు అయితే రూ.పది వేల నుంచి రూ.12 వేలకు విక్రయిస్తున్నారు. ప్రతి రోజూ తీగలవలస నుంచి మంగబంద వరకు ఇసుక తరలించే వాహనాలు బారులు తీరి ఉంటాయి. రోజూ వందకు పైగా లారీ, ట్రాక్టర్లు, వ్యాన్లలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నదని ఆ ప్రాంత గిరిజనులు చెబుతున్నారు. వర్షాల సమయంలో గెడ్డ పొంగినా కూలీలతో ఇసుకను తీయించి ఒడ్డున వేయిస్తున్నారు. దసరా పండుగనాడు కూడా ఇసుక తవ్వకాలు జరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తమ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైతే ఇసుక దొరడం లేదని గిరిజనులు వాపోతున్నారు. ఇసుక వ్యాపారులు ఇష్టానుసారంగా తవ్వకాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. అధికంగా ఇసుక తీయడంతో గెడ్డ లోతు పెరుగుతున్నదని, దీనివల్ల గెడ్డలు దాటే సమయంలో మునిగి కొంతమంది మృత్యువాత పడుతున్నారని వారంటున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని వారంటున్నారు. రోజూ 100 మంది కూలీలతో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని వారంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాపై పోలీస్‌, రెవెన్యూ యంత్రాంగాలు దృష్టి సారించే విధంగా చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Oct 11 , 2025 | 11:30 PM