Share News

నదుల్లో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు

ABN , Publish Date - Mar 16 , 2025 | 01:25 AM

అనకాపల్లి జిల్లాలోని నదుల్లో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, దీనివల్ల ఆయా నదుల్లో ఉన్న రక్షిత మంచినీటి పథకాలు ప్రమాదంలో పడ్డాయని పలువురు జడ్పీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన శనివారం జడ్పీ సమావేశ మందిరంలో ఒకటి నుంచి ఏడు వరకు స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోటవురట్ల జడ్పీటీసీ సభ్యురాలు సిద్దాబత్తుల ఉమాదేవి మాట్లాడుతూ, తమ మండలంలోని నదుల్లో ఇసుక తవ్వకాల వల్ల నీటి ప్రవాహాల దిశ మారుతున్నదని, దీంతో రక్షణ గట్లకు ముప్పు వాటిల్లుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. నదుల్లో నీటి పథకాల పంప్‌ హౌస్‌లకు అతి సమీపంలో ఇసుక తవ్వడంతో భారీ గోతులు ఏర్పడుతున్నాయని, దీంతో ఆయా నీటి పథకాలు కూలిపోయే ప్రమాదం వుందని అన్నారు. దీంతో గనుల శాఖ అధికారులు స్పందిస్తూ.. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకుంటామని చెప్పారు.

నదుల్లో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర. పక్కన సీఈవో నారాయణమూర్తి

భారీ గోతులతో నీటి పథకాలకు ముప్పు

జడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో సభ్యులు ఆందోళన

అనకాపల్లిలో ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి

మునగపాక సభ్యుడు పెంటకోట సత్యనారాయణ

ఏజెన్సీలో 108 అంబులెన్స్‌ సేవల్లో తీవ్రజాప్యం

అరకులోయ సభ్యురాలు రోష్ని

కేజీహెచ్‌ మార్చురీలో పోర్టుమార్టంలో జాప్యం

జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర

అంగన్‌వాడీల్లో డ్రాపౌట్స్‌ పెరుగుతున్నాయి

కె.కోటపాడు సభ్యురాలు అనూరాధ

అర్హులకు పింఛన్లు, పక్కా ఇళ్లు మంజూరు చేయాలని పలువురు సభ్యుల వినతి

విశాఖపట్నం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లాలోని నదుల్లో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, దీనివల్ల ఆయా నదుల్లో ఉన్న రక్షిత మంచినీటి పథకాలు ప్రమాదంలో పడ్డాయని పలువురు జడ్పీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన శనివారం జడ్పీ సమావేశ మందిరంలో ఒకటి నుంచి ఏడు వరకు స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోటవురట్ల జడ్పీటీసీ సభ్యురాలు సిద్దాబత్తుల ఉమాదేవి మాట్లాడుతూ, తమ మండలంలోని నదుల్లో ఇసుక తవ్వకాల వల్ల నీటి ప్రవాహాల దిశ మారుతున్నదని, దీంతో రక్షణ గట్లకు ముప్పు వాటిల్లుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. నదుల్లో నీటి పథకాల పంప్‌ హౌస్‌లకు అతి సమీపంలో ఇసుక తవ్వడంతో భారీ గోతులు ఏర్పడుతున్నాయని, దీంతో ఆయా నీటి పథకాలు కూలిపోయే ప్రమాదం వుందని అన్నారు. దీంతో గనుల శాఖ అధికారులు స్పందిస్తూ.. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకుంటామని చెప్పారు.

మునగపాక జడ్పీటీసీ సభ్యుడు పెంటకోట సత్యనారాయణ మాట్లాడుతూ, జిల్లాలో పాయకరావుపేట నుంచి సబ్బవరం వరకు జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, క్షతగాత్రులను కేజీహెచ్‌కు తీసుకెళ్లేలోగా చనిపోతున్నారని అన్నారు. విలువైన ప్రాణాలు కాపాడడానికి అనకాపల్లిలో ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని కోరారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు బదులిస్తూ.. ప్రస్తుతం అనకాపల్లిలో ట్రామా కేర్‌ సెంటర్‌ ఉందని, అయితే అన్ని సదుపాయాలతో నిర్మిస్తున్న విశాలమైన భవనంలోకి త్వరలో మార్చుతామని, 24 గంటలూ వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అరకులోయ జడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోష్ని మాట్లాడుతూ, తన మండలంలోని మాడగడ పీహెచ్‌సీలో వైద్య సేవలు అధ్వానంగా వున్నాయని, ఏజెన్సీలో 108 అంబులెన్స్‌లు సకాలంలో స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో పనిచేయడం ఇష్టంలేని అధికారులు, సిబ్బంది బదిలీ చేయించుకుని వెళ్లిపోవాలని అన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర స్పందిస్తూ, పాడేరు పరిసరాల్లో 108 సేవల్లో జాప్యం జరుగుతున్నదని, తాను ఫోన్‌చేస్తే మూడున్నర గంటల తరువాత అంబులెన్స్‌ వచ్చిందని చెప్పారు. 108 సేవలు త్వరితగతిన అందించాలని సంబంధిత అఽధికారులను ఆదేశించారు. కేజీహెచ్‌ మార్చురీలో మృతదేహాలకు పోస్టుమార్టంలో జాప్యం అవుతున్నదని చైర్‌పర్సన్‌ అనగా.. సూపరింటెండెంట్‌ శివానంద స్పందిస్తూ.. పోలీసులు శవపంచనామా చేసిన తరువాతే పోస్టుమార్టం చేయాలని, అందువల్ల ఆలస్యం అవుతున్నదని చెప్పారు. అయినప్పటికీ జాప్యం లేకుండా పోస్టుమార్టం పూర్తికి చర్యలు తీసుకుంటామన్నారు. కేజీహెచ్‌లో వైద్యం కోసం వచ్చే గిరిజనులకు విశ్రాంతి హాలు నిర్మించి అన్ని సదుపాయాలు కల్పించామని, గిరిజనులు దీనిని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

సామాజిక పింఛన్ల మంజూరులో జాప్యంపై పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. వితంతులకు కొత్తగా పింఛన్లు ఎందుకు మంజూరు చేయడం లేదన్న సభ్యుల ప్రశ్నకు డీఆర్‌డీఏ అఽధికారులు వివరణ ఇస్తూ.. ఉమ్మడి జిల్లాలో కొత్త పింఛన్లకు అర్హులతో జాబితాను తయారుచేసి ప్రభుత్వానికి పంపామన్నారు. ప్రభుత్వం మంజూరుచేసిన వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. పక్కా ఇళ్ల కోసం పలువురు పేదలు ఎదురుచూస్తున్నారని కొందరు సభ్యులు చెప్పగా.. ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్వే పూర్తయిన తరువాత కొత్తగా లబ్ధిదారులను గుర్తిస్తామని గృహనిర్మాణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లు డబ్బులను వెంటనే విడుదల చేయాలని చైర్‌పర్సన్‌ కోరారు. కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రాల్లో డ్రాపౌట్స్‌ పెరుగుతున్నందున సంబంధిత శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశాల్లో జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా శనివారం ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం ఉండడంతో పలు శాఖల అధికారులకు బదులు సిబ్బంది, ద్వితీయశ్రేణి అధికారులు సమావేశాలకు హాజరయ్యారు.

Updated Date - Mar 16 , 2025 | 01:25 AM