సాగర తీరంలో ఇసుక దోపిడీ
ABN , Publish Date - Dec 24 , 2025 | 01:03 AM
మండలంలోని కొత్తపట్నం సమీపంలో సముద్రతీరం వెంబడి ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. రాత్రి పది గంటల తరువాత ఎక్స్‌కవేటర్లను ఏర్పాటు చేసిన ఇసుకను తవ్వి లారీలు, ట్రాక్టర్లలో తరలించుకుపోతున్నారు.
కొత్తపట్నం వద్దయథేచ్ఛగా తవ్వకాలు
ట్రాక్టర్ ఇసుక రూ.3-5 వేలకు విక్రయం
పట్టించుకోని అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు
రాంబిల్లి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్తపట్నం సమీపంలో సముద్రతీరం వెంబడి ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. రాత్రి పది గంటల తరువాత ఎక్స్‌కవేటర్లను ఏర్పాటు చేసిన ఇసుకను తవ్వి లారీలు, ట్రాక్టర్లలో తరలించుకుపోతున్నారు. రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల పరిధిలోని ప్రత్యేక ఆర్థిక మండలిలో పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించిన భూముల్లో ‘ల్యాండ్ ఫిల్లింగ్’ కోసం సముద్ర ఇసుకను వినియోగిస్తున్నారు. నదుల్లోని ఇసుక కంటే సముద్ర తీరంలోని ఇసుక తక్కువ ధరకు లభిస్తుండడం, ప్రత్యేక ఆర్థిక మండలికి చేరువలో వుండడంతో అక్రమార్కులకు బాగా కలిసొచ్చింది. పరిశ్రమలతోపాటు రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇతర ఖాళీ స్థలాలను ఎత్తు చేయడానికి కూడా సముద్ర ఇసుకను వినియోగిస్తున్నారు. ఈ ప్రాంతం అటవీ శాఖ పరిధిలో వుండడం, స్థానికంగా పర్యవేక్షణ లేకపోవడం, రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండడంతో సముద్ర తీరంలో ఇసుక తవ్వకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. మండలంలో కొత్తపట్నంతోపాటు మరికొన్ని గ్రామాల్లో కూడా సముద్ర తీరంలో ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. దూరాన్ని బట్టి ట్రాక్టర్ ఇసుక రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నట్టు తెలిసింది. అధికారులు వెంటనే స్పందించి, ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట వేయకపోతే తుఫాన్ల సమయంలో సముద్రం నీరు గ్రామాల్లోకి వచ్చే ప్రమాదం వుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.