Share News

ఇసుక దందాకు అడ్డేలేదు

ABN , Publish Date - May 24 , 2025 | 11:04 PM

మండలంలోని శేమునాపల్లి పంచాయతీ పరిధిలో ఇసుక దందా దర్జాగా కొనసాగుతోంది. శుక్రవారం జనసేన నాయకుల పర్యటన కారణంగా ఒక్క రోజు తవ్వకాలు నిలిపివేసిన అక్రమార్కుడు.. తిరిగి శనివారం నుంచి యథావిధిగా ఇసుక దందా కొనసాగిస్తుండడం విశేషం.

ఇసుక దందాకు అడ్డేలేదు
శేమునాపల్లి ప్రాంతంలో శనివారం తిరిగి ప్రారంభమైన ఇసుక రవాణా

శేమునాపల్లిలో కొనసాగుతున్న తవ్వకాలు

ఒక రోజు విరామం ఇచ్చి.. మళ్లీ మొదలు

శారదా నదికి తూట్లు.. ఒడ్డున ఎడతెగని విధ్వంసం

ఎక్స్‌కవేటర్లతో తవ్వి విశాఖకు తరలింపు

అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు

చోడవరం, మే 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని శేమునాపల్లి పంచాయతీ పరిధిలో ఇసుక దందా దర్జాగా కొనసాగుతోంది. శుక్రవారం జనసేన నాయకుల పర్యటన కారణంగా ఒక్క రోజు తవ్వకాలు నిలిపివేసిన అక్రమార్కుడు.. తిరిగి శనివారం నుంచి యథావిధిగా ఇసుక దందా కొనసాగిస్తుండడం విశేషం.

చోడవరం మండల శివారు. కె.కోటపాడు మండల సరిహద్దులో చౌడువాడకు సమీపంలో ఉన్న శేమునాపల్లి వద్ద అనకాపల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి శారదా నది ఒడ్డున కొద్ది రోజులుగా ఇసుక దందా కొనసాగిస్తున్నారు. యంత్రాలతో నది ఒడ్డున భూములను విచ్చలవిడిగా తవ్వి లారీలు, ట్రాక్టర్లలో తరలించుకుపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఇటు రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌ అధికారులు పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. దీంతో శేమునాపల్లిలో ఇసుక దోపిడీ మూడు లారీలు, ఆరు ట్రాక్టర్లుగా చలామణి అవుతోంది. రెండు మండలాల పరిధిలో ఇటు లక్కవరం, శేమునాపల్లి, రాయపురాజుపేట, అటు కె.కోటపాడు మండలం శివారు గ్రామాలైన మల్లంపాలెం, కొల్లువీధి పరిసరాల మీదుగా శారదా నది వెంబడి సాగుతున్న ఈ విధ్వంసంతో శారదా నది రూపురేఖలే మారిపోతున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. శేమునాపల్లిలో అనకాపల్లికి చెందిన వ్యాపారి నది ఒడ్డున ఇసుక దిబ్బలు కొనుగోలు చేసి, పనిలో పనిగా నది గట్లను కూడా ఎక్స్‌కవేటర్లతో తొలగిస్తున్న తీరుతో శారదా నది ప్రవాహం కూడా మారిపోయే ప్రమాదం నెలకొంది. ఈ విచ్చలవిడిగా ఇసుక దోపిడీతో నదిలో ఉన్న సాగునీటి కాలువలు కూడా ధ్వంసం కావడంతో నది వెంబడి భూములకు సాగునీరు దొరకని పరిస్థితి నెలకొంది. వాగులను, నది గట్లను ధ్వంసం చేసి మరీ ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారు. నది వెంబడి ఉన్న పెద ్ద పెద్ద గట్లను, అందులోని చెట్లను కూడా కూలగొట్టి ట్రాక్టర్లతో రాత్రీ పగలూ తేడా లేకుండా విశాఖకు ఇసుక తరలించుకుపోతున్నా, ఈ విషయం తమకేమీ తెలియదన్నట్టుగానే ఇటు చోడవరం, అటు కె.కోటపాడు మండల అధికారులు వ్యవహరిస్తుండడం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది.

ఒక రోజు బ్రేక్‌.. మళ్లీ యథావిధిగా తవ్వకాలు

శేమునాపల్లిలో సాగుతున్న ఇసుక దందాను పరిశీలించేందుకు శుక్రవారం జనసేన నాయకులు వస్తున్నారని సమాచారం తెలియడంతో వాహనాలు అక్కడ నుంచి పంపించేసి, ఇసుక దందాకు ఒక రోజు విరామం ఇచ్చారు. తిరిగి శనివారం ఉదయం నుంచి యఽథావిధిగా కొనసాగిస్తున్నారు. అధికార యంత్రాంగం ఇప్పటికైనా అడ్డగోలుగా సాగుతున్న ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళతా..

శేమునాపల్లి, గవరవరం, లక్కవరం తదితర ప్రాంతాల్లో సాగుతున్న ఇసుక దోపిడీపై సోమవారం కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు జనసేన ఇంచార్జి పీవీఎస్‌ఎన్‌ రాజు తెలిపారు. శేమునాపల్లిలో ఇసుక దోపిడీ ఏమాత్రం ఆగకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - May 24 , 2025 | 11:04 PM