Share News

ఇసుక మాఫియా

ABN , Publish Date - May 24 , 2025 | 01:09 AM

జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. పెద్దేరు, బొడ్డేరు, శారదా, సర్పా, వరహా, తాండవ నదుల్లో పలుచోట్ల యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. సొంత అవసరాలకు స్థానికంగా వున్న నదులు, గెడ్డల్లో నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును కొంతమంది అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుని దర్జాగా వ్యాపారం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా యంత్రాల్లో ఇసుక తవ్వి, టిప్పర్లు, లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలించి భారీగా ఆర్జిస్తున్నారు. అక్రమార్కులకు కూటమి పార్టీలకుచెందిన కొంతమంది నేతలు తెరవెనుక నుంచి అండదండలు అందిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ఇసుక అక్రమ తవ్వకందారులపై చర్యలకు అధికారులు వెనుకడుగు వేస్తున్నట్టు తెలిసింది.

ఇసుక మాఫియా
మాడుగుల మండలం సాగరం వద్ద పెద్దేరు నదిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు

ప్రభుత్వం మారినా.. ఆగని దందా

ప్రధాన నదుల్లో యథేచ్ఛగా తవ్వకాలు

యంత్రాలు సైతం వినియోగం

టిప్పర్లు, లారీల్లో పట్టణాలకు ఇసుక రవాణా

భారీగా సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు

తెరవెనుక కూటమి నేతల అండదండలు

అడ్డుకోవడానికి వెనుకంజ వేస్తున్న అధికారులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. పెద్దేరు, బొడ్డేరు, శారదా, సర్పా, వరహా, తాండవ నదుల్లో పలుచోట్ల యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. సొంత అవసరాలకు స్థానికంగా వున్న నదులు, గెడ్డల్లో నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును కొంతమంది అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుని దర్జాగా వ్యాపారం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా యంత్రాల్లో ఇసుక తవ్వి, టిప్పర్లు, లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలించి భారీగా ఆర్జిస్తున్నారు. అక్రమార్కులకు కూటమి పార్టీలకుచెందిన కొంతమంది నేతలు తెరవెనుక నుంచి అండదండలు అందిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ఇసుక అక్రమ తవ్వకందారులపై చర్యలకు అధికారులు వెనుకడుగు వేస్తున్నట్టు తెలిసింది.

గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. నదులు, గెడ్డల్లో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వుకుని అమ్ముకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక మాఫియా ఆగడాలకు చెక్‌ పడుతుందని ప్రజలు భావించారు. కానీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడంలేదు. సొంత అవసరాలకు సమీపంలోని నదులు, గెడ్డల్లో నుంచి అనుమతి మేరకు ఇసుక తీసుకెళ్లవచ్చన్న ప్రభుత్వ వెసులుబాటుకు తూట్లుపొడుస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్‌, పర్యావరణ, జలవనరుల శాఖల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా యంత్రాలతో రేయింబవళ్లు ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వి, వాహనాల్లో తరలిస్తున్నారు. కొత్త ఇళ్ల నిర్మాణం, పాత ఇళ్లకు మరమ్మతు పనులకు అవసరమైన ఇసుకను నదుల్లో నుంచి తీసుకెళ్లాలంటే ముందుగా గ్రామ సచివాలయాల్లో అనుమతి తీసుకోవాలి. సిబ్బంది జారీ చేసే వే బిల్లు ఆధారంగా నిర్ణీత మొత్తంలో ఇసుకను 24 గంటల్లో మనుషులతో తవ్వుకుని ఎడ్ల బండి లేదా ట్రాక్టర్‌ ద్వారా తీసుకెళ్లాలి. ఇసుక తవ్వకాలకు ఎక్కడా యంత్రాలను వినియోగించకూడదు. కానీ అక్రమార్కులు ఈ నిబంధనలను తుంగలో తొక్కారు. ఎక్కడ ఇసుక వుంటే అక్కడ తవ్వేస్తున్నారు. నదుల గట్లను ఆనుకుని సైతం ఇసుక కోసం తవ్వకాలు జరుపుతున్నారు. వీరికి స్థానిక నేతలు ‘సహకారం’ అందిస్తున్నారు. నదుల్లో ఇసుక నిక్షేపాలు అధికంగా వున్నచోట అధికారంలో వున్న పార్టీలకు చెందిన స్థానిక నేతలు వేలం పాటలు నిర్వహించి అక్రమ తవ్వకాలకు అనధికారికంగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. దీంతో రెవెన్యూ, మైనింగ్‌ శాఖల అధికారులు దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేయడానికి సాహసించడంలేదు.

ఇసుక తవ్వకాలు ఎక్కడంటే..

శారదా నదిలో అనకాపల్లి మండలం తగరంపూడి, వెంకుపాలెం, సీతానగరం, దిబ్బపాలెం, మూలపేట, కె.కోటపాడు మండలం చౌడువాడు, చోడవరం మండలం గవరవరం, లక్కవరం, దేవరాపల్లి మండలం తామరబ్బ, తెనుగుపూడి, వేచలం, కలిగొట్ల, బోయిలకింతాడ, మునగపాక మండలం ఉమ్మలాడ వద్ద, వరహా నదిలో ఎలమంచిలి మండలం ఏటికొప్పాక, దార్లపూడి వద్ద ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. పెద్దేరు నదిలో మాడుగుల మండలం సాగరం, సత్యవరం, చోడవరం మండలం జుత్తాడ, గజపతినగరం, గౌరీపట్నం, బొడ్డేరు నదిలో చీడికాడ మండలం సిరిజాం, మంచాల గ్రామాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి.

ప్రభుత్వ ఇసుక డిపోలు వెలవెల

అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట, ఎలమంచలి నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఇసుక డిపోలను ఏర్పాటు చేసింది. రాజమమహేంద్రవరం, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి ఈ డిపోలకు ఇసుక సరఫరా అవుంతుంది. ప్రభుత్వం టన్ను రూ.900కు విక్రయిస్తున్నది. అయితే నదుల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్న వారు ఇందులో సగం ధరకే ఇసుక అమ్ముతుండడంతో భవన నిర్మాణదారులు వీరి వద్దనే కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ డిపోలు వెలవెలబోతున్నాయి. గతంలో విక్రయించిన ఇసుకలో ఇప్పుడు సగం కూడా అమ్ముడు పోవడంలేదని తెలిసింది.

Updated Date - May 24 , 2025 | 01:09 AM