Share News

శారదా నదిలో ఇసుక పంట!

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:53 AM

మొంథా తుఫాన్‌ సమయంలో కురిసిన భారీ వర్షాలతో మండలంలోని పలుచోట్ల శారదా నదిలో భారీ మొత్తంలో ఇసుక మేటలు వేసింది. ఇదే అదనుగా భావించిన గ్రామస్థాయి నాయకులు.. పార్టీలకు అతీతంగా ఇసుక తవ్వకాల కోసం వేలం పాటలు నిర్వహిస్తున్నారు.

శారదా నదిలో ఇసుక పంట!
శారదా నదిలో ఇసుక మేటలు

మొంథా తుఫాన్‌ వరదలతో భారీగా మేటలు

ఇసుక తవ్వకాలు, విక్రయాల కోసం గ్రామాల్లో అనధికారికంగా వేలం పాటలు

అధికార, ప్రతిపక్ష నేతలు కుమ్మక్కు

దేవరాపల్లి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ సమయంలో కురిసిన భారీ వర్షాలతో మండలంలోని పలుచోట్ల శారదా నదిలో భారీ మొత్తంలో ఇసుక మేటలు వేసింది. ఇదే అదనుగా భావించిన గ్రామస్థాయి నాయకులు.. పార్టీలకు అతీతంగా ఇసుక తవ్వకాల కోసం వేలం పాటలు నిర్వహిస్తున్నారు.

మండలంలో తామరబ్బ, సమ్మెద, చింతలపూడి, దేవరాపల్లి, తెనుగుపూడి, వెంకటరాజపురం, తిమిరాం, మామిడిపల్లి, వేచలం, కలిగొట్ల, బి.కింతాడ గ్రామాల పరిధిలో శారదా నదిలో పలుచోట్ల ఇసుక మేటలు వేసింది. కానీ మండలంలో ఎక్కడా అధికారికంగా ఇసుక రీచ్‌లు లేదు. అయితే స్థానికంగా ఇళ్లు, ఇతర నిర్మాణాల నిమిత్తం ముందస్తు అనుమతితో నదుల్లో నుంచి నిర్ణీత పరిమాణంలో ఇసుక తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీనిని గ్రామాల్లో కొంతమంది నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుని దర్జాగా ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. ఇందుకోసం శారదా నదిలో వున్న ఇసుక నిల్వలు, రవాణా సదుపాయం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని వేలం పాటలు నిర్వహిస్తున్నారు. తెనుగుపూడి వద్ద నదిలో ఏడాదిపాటు ఇసుక తవ్వకాల కోసం రూ.30 లక్షలకు వేలం పాట పాడినట్టు తెలిసింది. రాజకీయంగా ప్రత్యర్థులుగా వున్న నేతలు.. ఇసుక విషయానికి వచ్చేసరికి ఒక్కటవుతున్నారు. శారదా నదిలో చింతలపూడి, తామరబ్బ గ్రామాల పరిధిలో ఇసుక తవ్వి, విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలంలోని గ్రామాలకు రవాణా చేస్తున్నారు. తెనుగుపూడి నుంచి ఇదే జిల్లా వేపాడ, ఎల్‌.కోట, కొత్తవలస మండలాలకు సరఫరా చేస్తున్నారు. ఇక రైవాడ రిజర్వాయర్‌కు ఎగువున వున్న అనంతగిరి మండల పరిధిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. నది నుంచి ఉన్న దూరాన్నిబట్టి ట్రాక్టర్‌ ఇసుక రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు విక్రయిస్తున్నారు.

Updated Date - Nov 19 , 2025 | 12:53 AM