Share News

జడ్పీ బిల్లులకు మోక్షం

ABN , Publish Date - Jul 25 , 2025 | 01:02 AM

జిల్లా ప్రజా పరిషత్‌ సాధారణ నిధులతో చేపట్టిన పనులకు ఎట్టకేలకు బిల్లులు మంజూరుచేశారు.

జడ్పీ బిల్లులకు మోక్షం

  • గత ఆర్థిక సంవత్సరం ఉమ్మడి జిల్లాలో 400 పనులు మంజూరు

  • రూ.20 కోట్లు అంచనా

  • పూర్తయిన పనులకు బిల్లులు

  • చెల్లించకపోవడంతో సభ్యుల ఆందోళన

  • ఎట్టకేలకు సుమారు 300 పనులకు సంబంధించి రూ.11.75 కోట్లు కాంట్రాక్టర్ల ఖాతాల్లో జమ

విశాఖపట్నం, జూలై 24 (ఆంధ్రజ్యోతి):

జిల్లా ప్రజా పరిషత్‌ సాధారణ నిధులతో చేపట్టిన పనులకు ఎట్టకేలకు బిల్లులు మంజూరుచేశారు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి చేసిన పనులకు సంబంధించి సుమారు రూ.11.75 కోట్లు కాంట్రాక్టర్ల ఖాతాలకు జమ అయ్యాయి. సాధారణ నిధులతో చేపట్టిన పనులకు బిల్లులు కావడం లేదంటూ జడ్పీ సర్వసభ్య సమావేశం, స్టాండింగ్‌ కమిటీ సమావేశాల్లో సభ్యులు ఆందోళన వ్యక్తంచేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెల వరకూ అప్‌లోడ్‌ చేసిన పనులకు సంబంధించి బిల్లులు మంజూరుకావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

గత వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌, జడ్పీ నిధుల వినియోగంపై అనేక ఆంక్షలు విధించింది. చివరకు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులను ఇతర అవసరాలకు మళ్లించింది. దీంతో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకురాలేదు. గత ఏడాది ఏప్రిల్‌ అంటే ఎన్నికల సమయం నుంచి పనులను ప్రజా ప్రతినిధులు ప్రతిపాదించగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాంట్రాక్టర్లు ముందుకువచ్చారు. జడ్పీటీసీ సభ్యులు తమ మండల పరిధిలో రోడ్లు, మరమ్మతులు, మురుగుకాల్వల నిర్మాణానికి సాధారణ నిధులు కేటాయిస్తుంటారు. గత ఆర్థిక సంవత్సరం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సుమారు రూ.20 కోట్ల సాధారణ నిధులతో 400 పనులు మంజూరుచేశారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌కు అప్‌లోడ్‌ చేసినా మంజూరుకాలేదు. దీంతో జడ్పీ సమావేశాలు, స్టాండింగ్‌ కమిటీ సమావేశాల్లో పదేపదే సభ్యులు ప్రస్తావిస్తూ వస్తున్నారు. బిల్లులు మంజూరుకాకపోవడంతో కొందరు కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో మొత్తం 300 పనులకు సంబంధించి రూ.11.75 కోట్లు కాంట్రాక్టర్ల ఖాతాకు జమ చేశారు. గత నెలాఖరు వరకూ చేసిన పనులకు బిల్లులు మంజూరయ్యాయని జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో మంజూరుచేసిన మిగిలిన పనులను కూడా వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదనలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో జడ్పీ సాధారణ నిధులతో చేపట్టబోయే పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. గత ఏడాది బిల్లులు మంజూరుకావడంతో 2025-26 సంవత్సరానికి సంబంధించిన పనులపై ఈనెల 26వ తేదీన జరగనున్న స్టాండింగ్‌ కమిటీ సమావేశాల్లో ప్రస్తావించాలని సభ్యులు భావిస్తున్నారు.

Updated Date - Jul 25 , 2025 | 01:02 AM