Share News

అసంపూర్తి భవనాలకు మోక్షం

ABN , Publish Date - Dec 17 , 2025 | 01:04 AM

గత ప్రభుత్వం ‘మన బడి నాడు-నేడు’ కార్యక్రమంగా పాఠశాలల్లో అసంపూర్తిగా వదిలేసిన భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ పాఠశాలల్లో మధ్యలో ఆగిపోయిన అదనపు తరగతి గదుల పనులను సీఎస్‌ఆర్‌ నిధులతో చేపడతామని డీఆర్‌సీ సమావేశంలో కలెక్టర్‌ తెలిపారు. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసి వచ్చే విద్యా సంవత్సరం ఆరంభంనాటికి అదనపు భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.

అసంపూర్తి భవనాలకు మోక్షం
అనకాపల్లి మండలం రామాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో అసంపూర్తిగా వున్న అదనపు తరగతి గదుల భవన నిర్మాణం

పాఠశాలల్లో ఆగిన పనులను పూర్తి చేయాలని డీఆర్‌సీ సమావేశంలో తీర్మానం

సీఎస్‌ఆర్‌ నిధులు కేటాయిస్తామన్న కలెక్టర్‌

అసంపూర్తి పనులపై నివేదిక ఇవ్వాలని సమగ్ర శిక్ష ఇంజనీర్లకు ఆదేశాలు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

గత ప్రభుత్వం ‘మన బడి నాడు-నేడు’ కార్యక్రమంగా పాఠశాలల్లో అసంపూర్తిగా వదిలేసిన భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ పాఠశాలల్లో మధ్యలో ఆగిపోయిన అదనపు తరగతి గదుల పనులను సీఎస్‌ఆర్‌ నిధులతో చేపడతామని డీఆర్‌సీ సమావేశంలో కలెక్టర్‌ తెలిపారు. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసి వచ్చే విద్యా సంవత్సరం ఆరంభంనాటికి అదనపు భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.

గత వైసీపీ ప్రభుత్వం ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమం కింద 2023-24లో జిల్లాలో 604 పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, ఇతర పనుల కోసం రూ.250 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అదనపు గదులు, ప్రహరీ గోడలు, మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్‌, తాగునీటి సదుపాయం వంటి988 పనులు మంజూరు చేసింది. మొత్తం మీద గత ఏడాది సాధారణ ఎన్నికల ముందునాటికి రూ.132 కోట్లు ఖర్చు చేసి 60 శాతం మేర పనులు పూర్తిచేశారు. అయితే ఆయా పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో మంజూరుకాకపోవడంతో పనులు మందగించాయి. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి పనులు ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. వసతి కొరత, ఇతర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కొన్ని పాఠశాలల్లో వరండాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్న పనులపై దృష్టి సారించలేదు. వైసీపీ హయాంలో చేపట్టిన పనులు, బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో దాదాపు ఏడాదిపాటు వాటి గురించి పట్టించుకోలేదు. కనీసం రెండో ఏడాది అయినా అసంపూర్తి పనులు మోక్షం లభిస్తుందని భావించగా నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్‌సీ) సమావేశంలో జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రనిధులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన పాఠశాలల భవనాలు, ఇతర పనులను పూర్తి చేయించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్రకు విజ్ఞప్తి చేశారు.

కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధులను కేటాయించి పనులు పూర్తి చేయాలని కోరుతూ ఈ మేరకు తీర్మానం చేశారు. అనంతరం కలెక్టర్‌ విజయకృష్ణన్‌ మాట్లాడుతూ, పాఠశాలల్లో అసంపూర్తిగా వున్న భవనాలను సీఎస్‌ఆర్‌ నిధులతో పూర్తి చేస్తామని ప్రకటించారు. ఆయా భవనాల స్థితిగతులపై వివరాలు సేకరించి నివేదికను రూపొందించాలని సమగ్ర శిక్ష ఇంజనీర్లను ఆదేశించారు. దీంతో ఈ శాఖ సిబ్బంది ఆయా పాఠశాలలను సందర్శించి, అసంపూర్తిగా వున్న భవనాలు, ఇతర పనుల వివరాలను నమోదు చేసుకుంటారు. ఆయా పనులు పూర్తిచేయడానికి ఎంత మేర నిధులు అవసరమో అంచనాలు రూపొందిస్తారు.

Updated Date - Dec 17 , 2025 | 01:04 AM