పెదకోట-జాలడ రోడ్డుకు మోక్షం
ABN , Publish Date - Sep 26 , 2025 | 10:31 PM
మండలంలోని పెదకోట-జాలడ రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం కలగనుంది. ఈ రోడ్డపై గుంతలతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ గోతుల్లో పడి కొంతమది వాహనదారులు గాయపడగా.. మరికొంతమంది మృతువాత పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రమాదాలకు ప్రధాన కారణమని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రోడ్లు లేని గ్రామాలకు నూతనంగా తారురోడ్లు వేసింది. అలాగే గతంలో ఉన్న గుంతల రోడ్లకు మరమ్మతులకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది.
11 కిల్లోమీటర్లకు రూ.9.55 కోట్లతో తారురోడ్డు
గిరిజన సంక్షేమ శాఖ నిధులు మంజూరు
త్వరలో పనులు ప్రారంభించనున్న అధికారులు
అనంతగిరి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి):మండలంలో జీనబాడు, పినకోట, పెదకోట, కివర్ల పంచాయతీల్లో వందకుపైగా గిరిజన గ్రామాలున్నాయి. దేవరాపల్లి నుంచి జీనబాడు మీదుగా పినకోట వరకు 18 కిలోమీటర్ల తారురోడ్డు ఆర్‌అండ్‌బీ పరిధిలోకి వస్తోంది. ఈ రోడ్డును మూడేళ్ల క్రితం రూ.2 కోట్లతో ఆర్‌అండ్‌బీ శాఖ మరమ్మతులు చేసింది. అయితే పెదకోట నుంచి జాలడ రోడ్డు మాత్రం ఆర్‌అండ్‌బీ పరిధిలోకి రాలేదు. ఈ రోడ్డు 13 ఏళ్ల క్రితం తారురోడ్డును నిర్మించారు. నిర్వహణ లేకపోవడంతో రోడ్డంతా పూర్తిగా కొట్టుకుపోయింది. చాలాచోట్ల భారీ గుంతలు ఏర్పడి, ప్రమాదభరితంగా మారింది. దీంతో నాలుగు పంచాయతీల గిరిజనులు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
పెదకోట-జాలడ తారురోడ్డుకు రూ.9.55 కోట్లు మంజూరు
పెదకోట నుంచి జాలడ వరకు 11 కిలోమీటర్ల తారురోడ్డు నిర్మాణానికి గిరిజన సంక్షేమ శాఖ రూ.9.55 కోట్లను ఇటీవల మంజూరు చేసింది. రోడ్డు పనులు త్వరలో ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే అల్లూరి జిల్లా కేంద్రానికి జీనబాడు, పినకోట, పెదకోట, కివర్ల పంచాయతీలకు చెందిన గిరిజనులు జాలడ మీదుగా వేలమామిడి నుంచి హుకుంపేట మండలానికి సులభంగా చేరుకోవచ్చు.
పెదకోట-కుడియా మధ్య వంతెన నిర్మించాలి
వర్షకాలంలో పెదకోట-కుడియా మధ్యలో ఉన్న గెడ్డ ఉధృతంగా పారుతోంది. అక్కడ ఉన్న కాజ్‌వే స్థానే వంతెన నిర్మించాలని పెదకోట, కివర్ల, పినకోట, జీనబాడు పంచాయతీలకు పరిధిలో గల పలు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. పెదకోట నుంచి జాలడ వరకు తారురోడ్డు నిర్మాణం జరిగినా కాజ్‌వే స్థానంలో వంతెన లేకపోవడం మళ్లీ సమస్య మొదటికే వస్తుందని గిరిజనులు చెబుతున్నారు. కాజ్‌వే వద్ద వంతెన నిర్మాణం జరిగితేనే.. నాలుగు పంచాయతీలకు మేలు జరుగుతుందని, వర్షకాలంలోని అత్యవసర పరిస్థితిల్లో జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు కూడా ఆస్కారం ఉంటుందని గిరిజనులు అంటున్నారు. కూటమి ప్రభుత్వం వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తారని ఆశతో గిరిజనులు ఎదురుచూస్తున్నారు.