వేపగుంట-పినగాడి రహదారికి మోక్షం
ABN , Publish Date - Jul 05 , 2025 | 12:37 AM
వేపగుంట-పినగాడి మార్గానికి ఎట్టకేలకు మోక్షం లభించనున్నది. ఈ రోడ్డు పనులు చేపట్టడానికి వీఎంఆర్‌డీఏ ముందుకువచ్చింది.
తొలి విడత 60 అడుగుల మేర విస్తరణ
రూ.14.8 కోట్లతో 4 కి.మీ. రహదారి నిర్మాణానికి ముందుకువచ్చిన వీఎంఆర్‌డీఏ
జీవీఎంసీ నిధులతో మరో 3 కి.మీ....
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
వేపగుంట-పినగాడి మార్గానికి ఎట్టకేలకు మోక్షం లభించనున్నది. ఈ రోడ్డు పనులు చేపట్టడానికి వీఎంఆర్‌డీఏ ముందుకువచ్చింది. సుమారుగా రూ.14.8 కోట్ల వ్యయంతో 4 కి.మీ. రహదారి నిర్మించాలని శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానం చేసింది. దీంతో ఏళ్ల తరబడి ప్రయాణికులు ఎదుర్కొంటున్న కష్టాలకు మోక్షం లభించనుంది.
విశాఖపట్నం నుంచి అనకాపల్లి మీదుగా తుని, అన్నవరం, కాకినాడ, రాజమహేంద్రవరం రోడ్డు మార్గాన వెళ్లే వారిలో 90 శాతం మంది వేపగుంట నుంచి పినగాడి మీదుగా కొత్తగా నిర్మించిన జాతీయ రహదారిపైకి వెళతారు. అయితే ఈ మార్గం మొత్తం పాడైపోయింది. గోతులు పడి ప్రయాణానికి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఈ రూటులో రెండు నెలలు తిరిగితే ఏ కారు అయినా, ద్విచక్ర వాహనమైనా కచ్చితంగా మరమ్మతుల కోసం షెడ్‌కు వెళ్లాల్సిందే. అంత దారుణంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ కష్టాలు తీరిపోతాయని భావించారు. అన్ని రహదారులు బాగు చేసినా, దీనిని మాత్రం ముట్టుకోలేదు. ఆ మధ్య వీఎంఆర్‌డీఏ దానిని మాస్టర్ ప్లాన్‌లో భాగంగా అభివృద్ధి చేస్తామని ముందుకువచ్చింది. 150 అడుగుల వెడల్పుతో పనులు చేపట్టాలని ప్రతిపాదించింది. అయితే ఇది రోడ్లు భవనాల శాఖకు చెందిన మార్గం కావడంతో వారికే విడిచిపెట్టింది. ఆ శాఖలో నిధులు లేనందున పనులు ప్రారంభం కాలేదు. ఆ ప్రాంతానికి చెందిన రైతులు కూడా 150 అడుగులు విస్తరిస్తే తమ భూములు పోతాయని, విస్తరణ వద్దని అభ్యంతరం తెలిపారు. అయితే ప్రయాణికులకు కష్టాలు, ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరగడంతో ఈ రోడ్డు పనులు చేపట్టాలని ప్రజాప్రతినిధులు కోరడంతో వీఎంఆర్‌డీఏ బోర్డు సమావేశంలో శుక్రవారం చర్చించారు. ఈ మార్గంలో 4 కి.మీ. మార్గం తొలి దశలో 60 అడుగుల వెడల్పున అభివృద్ధి చేయాలని తీర్మానించారు. దీనికి అయ్యే మొత్తం రూ.14.8 కోట్లు ఇవ్వడానికి అంగీకరించారు. మిగిలిన మూడు కి.మీ. మార్గాన్ని జీవీఎంసీ నిధులతో పూర్తిచేయనున్నారు. వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు.