బడి భవనాలకు మోక్షం!
ABN , Publish Date - Aug 01 , 2025 | 10:23 PM
విద్యారంగంలో వినూత్న మార్పులతో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం జిల్లాలోని ప్రతి పాఠశాలకు వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు నిధులు మంజూరు చేసింది. ఆదివాసీ దినోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారికంగా ప్రకటన చేయనున్నారు.
రూ.46.24 కోట్లతో 373 స్కూల్ భవనాలు
నిర్మాణానికి కూటమి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
ఆదివాసీ దినోత్సవాల్లో అధికారికంగా
ప్రకటించనున్న సీఎం చంద్రబాబునాయుడు
జిల్లాలో ప్రతి పాఠశాలకు వసతి
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి
నారా లోకేశ్ ప్రత్యేక చొరవపై గిరిజనం హర్షం
‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్...
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 373 పాఠశాలల్లో వసతి లేమితో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ‘గూడు లేని బడి’ శీర్షికన ప్రచురించిన ప్రత్యేక కథనానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దీంతో జిల్లాలో భవనాలు లేని 373 పాఠశాలలకు భవనాలను సమకూర్చేందుకు రూ.46.24 కోట్లు మంజూరుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిధుల మంజూరుపై ఈనెల తొమ్మిదిన నిర్వహించే ‘ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల్లో’ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారికంగా ప్రకటించనున్నారు.
ఎట్టకేలకు కూటమి మంత్రుల హామీల అమలు
గిరిజన ప్రాంతంలోని వసతి లేని ప్రాథమిక పాఠశాలలకు భవనాలను నిర్మిస్తామని గతేడాది జూలైలోనే రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. ముంచంగిపుట్టు మండలం కెందుగూడ గ్రామంలోని గిరిజనులు శ్రమదానంతో పాఠశాలకు షెడ్ నిర్మాణం చేసుకున్న వైనం మంత్రి నారా లోకేశ్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించి ఆ పాఠశాల భవన నిర్మాణానికి గతేడాదే రూ.15 లక్షలు మంజూరు చేశారు. అలాగే తొలి విడతగా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతంలో భవనాలు లేని 408 పాఠశాలలకు భవనాలను నిర్మించేందుకు రూ.56 కోట్లు మంజూరు చేస్తున్నట్టు అప్పట్లో ప్రకటించారు. ఇందులో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాఠశాలల భవనాల నిర్మాణానికి రూ.46.24 కోట్లు మంజూరు చేయడం విశేషం. ఇటీవల కాలంలో తమ పాఠశాలలకు భవనాలు మంజూరు చేయాలని పలు ప్రాంతాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు శాశఽ్వత పరిష్కారం చూపాలని భావించిన కూటమి ప్రభుత్వం ప్రతి పాఠశాలలకు వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టడడంపై గిరిజనం హర్షం వ్యక్తం చేస్తోంది.
వైసీపీ పాలనలో భవనాల వైపే చూడని దుస్థితి
వైసీపీ ప్రభుత్వం గడచిన ఐదేళ్లలో పాఠశాలల భవనాలపై కనీస దృష్టిపెట్టిన దాఖలాలు లేవు. దీంతో జిల్లాలోని ఒక్క పాఠశాలకు భవన నిర్మాణం జరగలేదు. నాడు-నేడు కార్యక్రమంలో సైతం కేవలం 20 శాతం పాఠశాలలను మాత్రమే ఎంపిక చేసుకుని, వాటికే కోట్లాది రూపాయాలు వ్యయం చేసి అనవసర హంగులు చేయడం మినహా క్షేత్ర స్థాయిలో గూడు లేని బడుల గురించి పట్టించుకోలేదు. దీంతో వైసీపీ ఐదేళ్ల పాలనలో పాఠశాలలకు భవనాలు సమకూరని దుస్థితి నెలకొంది. దీంతో కొన్నిచోట్ల తమకున్న అవకాశం మేరకు శ్రమదానంలో విద్యార్థుల తల్లిదండ్రులే వసతి ఏర్పాటు చేసుకున్నారు. ఉదాహరణకు ముంచంగిపుట్టు మండలం సారధి గ్రామంలోను, పెదబయలు మండలం కొరవంగి పంచాయతీ పరిధిలో బొడ్డగొంది గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలకు భవనాలు లేకపోవడంతో తల్లిదండ్రులు సిమెంట్ రేకులతో షెడ్‌లను నిర్మించారు. జిల్లాలో చింతపల్లి మండలంలో అత్యధికంగా 46 పాఠశాలలకు భవనాలు లేవు. అలాగే ముంచంగిపుట్టులో 43, పెదబయలులో 37, హుకుంపేటలో 26, వై.రామవరం, జి.మాడుగులలో 25, జీకేవీధిలో 22, చింతూరులో 20 పాఠశాలలకు భవనాలు అలాగే మిగిలిన మండలాల్లో 20 లోపు పాఠశాలలకు భవనాలు లేని పరిస్థితి ఉంది.