Share News

పంచాయతీ భవనాలకు మోక్షం

ABN , Publish Date - Jul 29 , 2025 | 11:58 PM

వైసీపీ ఐదేళ్ల పాలనలో నిర్వీర్యమైన గ్రామ పంచాయతీలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా పంచాయతీలకు భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. తాజాగా జిల్లాలోని 32 పంచాయతీలకు భవనాల నిర్మాణానికి రూ.10 కోట్ల 24 లక్షలు మంజూరు చేసింది. ఒక్కో పంచాయతీ భవనానికి రూ.32 లక్షలు వెచ్చించనుంది. ఈ మేరకు తాజాగా కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

పంచాయతీ భవనాలకు మోక్షం
పాడేరు మండలం మోదాపల్లిలో కాఫీ గోదాములో కొనసాగుతున్న పంచాయతీ కార్యాలయం

- జిల్లాలో 32 భవనాల నిర్మాణానికి రూ.10.24 కోట్లు మంజూరు

- అనేక పంచాయతీల్లో సచివాలయ భవనాలు అందుబాటులోకి రాక అవస్థలు

- జిల్లాలో మొత్తం 430 గ్రామ పంచాయతీల్లో సగానికి పైగా వసతి లేని దుస్థితి

- డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చొరవతో నిర్మాణాలకు ముందడుగు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

వైసీపీ ఐదేళ్ల పాలనలో నిర్వీర్యమైన గ్రామ పంచాయతీలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా పంచాయతీలకు భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. తాజాగా జిల్లాలోని 32 పంచాయతీలకు భవనాల నిర్మాణానికి రూ.10 కోట్ల 24 లక్షలు మంజూరు చేసింది. ఒక్కో పంచాయతీ భవనానికి రూ.32 లక్షలు వెచ్చించనుంది. ఈ మేరకు తాజాగా కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లాలోని మొత్తం 22 మండలాల్లో 430 గ్రామ పంచాయతీలున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పంచాయతీలను పక్కన పెట్టి గ్రామ సచివాలయాలను తెరపైకి తీసుకువచ్చింది. దీంతో 22 మండలాల్లో 352 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసింది. అలాగే వాటికి భవన నిర్మాణాలకు చర్యలు చేపట్టినప్పటికీ నిధుల సమస్యతో సుమారుగా 200 పైబడి సచివాలయాల భవనాలు పూర్తి కాని పరిస్థితి నెలకొంది. దీంతో ఉన్న వసతిలోనే సచివాలయాలను సిబ్బంది నిర్వహిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పంచాయతీలకు వసతి సమకూర్చాలని నిర్ణయించింది.

32 పంచాయతీలకు రూ.10.24 కోట్లు

జిల్లాలో ఎంపిక చేసిన 32 పంచాయతీలకు భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.10 కోట్ల 24 లక్షలు మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.32 లక్షలు చొప్పున వెచ్చించనున్నది. జిల్లాలోని అనంతగిరి మండలంలో 1, జి.మాడుగులో 2, హుకుంపేటలో 7, కొయ్యూరులో 4, ముంచంగిపుట్టులో 2, పాడేరులో 3, పెదబయలులో 2, అడ్డతీగలలో 2, గంగవరంలో 2, మారేడుమిల్లిలో 2, రాజవొమ్మంగిలో 1, రంపచోడవరంలో 1, చింతూరులో 3 పంచాయతీల భవనాలను నిర్మించనున్నది.

53 పంచాయతీల భవనాలకు ప్రతిపాదనలు

జిల్లాలోని 430 పంచాయతీలకు గాను పూర్తిగా కనీస భవనాలు లేని 53 పంచాయతీలకు భవనాలను నిర్మించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో అడ్డతీగల మండలంలో 4, అనంతగిరిలో 2, చింతూరులో 3, దేవీపట్నంలో 3, డుంబ్రిగుడలో 4, జీకేవీధిలో 1, జి.మాడుగులలో 2, గంగవరంలో 3, హుకుంపేటలో 7, కొయ్యూరులో 5, మారేడుమిల్లిలో 1, కూనవరంలో 1, ముంచంగిపుట్టులో 3, పాడేరులో 7, రాజవొమ్మంగిలో 1, రంపచోడవరంలో 1, ఎటపాకలో 1, పెదబయలులో 3 పంచాయతీలకు భవనాలు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. అయితే వాస్తవానికి జిల్లాలో 200 పైబడి పంచాయతీలకు సరైన వసతి లేని పరిస్థితి. అనేక పంచాయతీలకు రెండున్నర దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాలు నేడు శిథిలావస్థకు చేరాయి. అలాగే మరికొన్ని ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాల భవనాలు పూర్తిగా అందుబాటులోకి రానప్పటికీ, అక్కడ పంచాయతీలకు భవనాలున్నట్టుగానే అధికారులు భావిస్తున్నారు. ఈ కారణంగా పలు పంచాయతీలకు సంబంధించి వసతి సమస్య తప్పడం లేదు.

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక శ్రద్ధతో మోక్షం

గిరిజన ప్రాంతంలో పంచాయతీ భవనాల నిర్మాణాలపై డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండడంతో అసంపూర్తిగా ఉన్న అవి పూర్తవుతాయనే ఆశాభావం మన్యం వాసుల్లో కలుగుతున్నది. వాస్తవానికి కేంద్రం విడుదల చేసిన నిధులను సక్రమంగా వినియోగిస్తే ఈపాటికే ఏజెన్సీ వ్యాప్తంగా అన్ని పంచాయతీలకు భవనాలు రెండేళ్ల కిత్రమే పూర్తయ్యేవి. ఈ సమస్యను గుర్తించిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ తన తొలి సంతకాన్ని సైతం గిరిజన ప్రాంతంలో పంచాయతీ భవన నిర్మాణాలకు సంబంధించిన ఫైలుపైనే చేశారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి పవన్‌ కల్యాణ్‌ చూపుతున్న చొరవకు ఏజెన్సీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 29 , 2025 | 11:58 PM