సాగునీటి కాలువలకు మోక్షం
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:42 AM
మండలంలోని సాగునీటి కాలువలకు ఎన్నో ఏళ్ల తరువాత మోక్షం కలిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వీటికి మహర్దశ పట్టింది. శిథిలమై కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న మదుములు, విరిగిపోయిన తలుపులను తాజాగా తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు.
- కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహర్దశ
- శిథిలమైన మదుములు, తలుపుల స్థానంలో కొత్తవి ఏర్పాటు
- కాలువల్లో పూడికతీత
- గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం
- ఒక్క ఏడాది కూడా నిధులు మంజూరు చేయని దుస్థితి
- తాజాగా పొలాలకు నీరందుతుండడంతో రైతుల ఆనందం
పాయకరావుపేట రూరల్, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని సాగునీటి కాలువలకు ఎన్నో ఏళ్ల తరువాత మోక్షం కలిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వీటికి మహర్దశ పట్టింది. శిథిలమై కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న మదుములు, విరిగిపోయిన తలుపులను తాజాగా తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు.
గత వైసీపీ ప్రభుత్వంలో శిథిలమైన మదుములను పునర్నిర్మించాలని, విరిగిపోయిన తలుపుల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని సాగునీటి శాఖాధికారులకు, నాయకులకు ఎన్నిసార్లు రైతులు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. కనీసం ఒక్క ఏడాది కూడా నిధులు మంజూరు చేయలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించడం, రాష్ట్ర హోం మంత్రి రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి మొదటి విడతగా సుమారు 36 లక్షల రూపాయలను మంజూరు చేయడంతో సాగునీటి కాలువలపై మదుములు నిర్మించారు. తరువాత సాగునీటి సంఘాలకు నిధులు విడుదల కావడంతో సాగునీటి కాలువల్లో దశాబ్దాల తరబడి పేరుకుపోయిన పూడికను ఎక్స్‌కవేటర్లతో తొలగించారు. సాగునీటి కాలువల ద్వారా ఎటువంటి ఆటంకం లేకుండా సాగునీరు పొలాలకు చేరుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని మంగవరం, గుంటపల్లి కాలువలలో మదుములు, తలుపులు పూర్తిగా శిథిలం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. మంగవరం వద్ద మెరక కాలువ, పల్లం కాలువ, కొముదుల కాలువ, చెరువు కాలువలుగా విడిపోయి సుమారు 500 ఎకరాలకు నీరు చేరుతుంది. చాలా సంవత్సరాలుగా ఈ నాలుగు కాలువల మదుములు, తలుపులు ధ్వంసం కావడంతో పొలాలకు నీరు పెట్టడానికి రైతులు నానా అవస్థలు పడేవారు. గత వైసీపీ ప్రభుత్వంలో వీటి గురించి కనీసం పట్టించుకోలేదు. అదే విధంగా గుంటపల్లి వద్ద గుంటపల్లి కాలువపై మదుము, తలుపులు శిథిలమయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మండల పరిషత్ నిధులు సుమారు 10 లక్షల రూపాయలతో గుంటపల్లి, మంగవరం వద్ద సాగునీటి కాలువలపై నూతనంగా మదుములు నిర్మించి మరో 5 లక్షల రూపాయలతో వాటికి తలుపులు అమర్చినట్టు మంగవరం కాలువ నీటి సంఘం అధ్యక్షుడు గూటూరు రామ గోవిందు తెలిపారు. సాగునీటి కాలువలకు మదుములు నిర్మించి తలుపులు ఏర్పాటు చేయడం, సాగునీటి కాలువలలో పూడికను తొలగించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.