Share News

తల్లికి వందనం

ABN , Publish Date - Jun 13 , 2025 | 01:28 AM

ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నది.

తల్లికి వందనం

  • జిల్లాలో 1,90,433 మంది విద్యార్థులు అర్హులు

  • 1,30,706 మంది తల్లులకు రూ.247 కోట్లు

  • సచివాలయాలకు జాబితాలు

  • ఒకటి, ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరువాత అందజేత

విశాఖపట్నం, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి):

ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘తల్లికి వందనం’ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు, ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో అర్హుల జాబితాలను అధికారులు ఇప్పటికే రూపొందించారు. ఒకటో తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థుల జాబితాలను తయారుచేయాల్సి ఉంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో చదువుతున్న సుమారు 1,90,000 మంది విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకం వర్తించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

కుటుంబంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి ఏటా రూ.15 వేల చొప్పున ‘తల్లికి వందనం’ పథకం కింద అందజేస్తామని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు గురువారం మార్గదర్శకాలు జారీచేసింది. విశాఖ జిల్లాలో 1,90,433 మంది విద్యార్థులు తల్లికి వందనం పథకానికి అర్హులుగా అధికారులు గుర్తించారు. వీరికి సంబంధించి 1,30,706 మంది తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు వంతున రూ.247.62 కోట్లు జమ చేస్తారు. ఇవి శుక్రవారం సాయంత్రంలోగా జమ అవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. కాగా గురువారం నుంచి పాఠశాలలు ప్రారంభించారు. అంటే ఒకటో తరగతిలో విద్యార్థులు ప్రవేశాలు పొందుతారు. ఇంకా ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఒకటో తరగతి, ఇంటర్‌ ప్రథమ ఏడాదిలో ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన తరువాత ఆయా విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద రూ.13 వేలు వంతున జమచేయనున్నారు. ఇదిలావుండగా తల్లికి వందనం పథకం అర్హులు, అనర్హుల జాబితాలు గ్రామ/వార్డు సచివాలయాలకు చేరాయి. అనర్హుల జాబితాలో పొరపాటున అర్హులు ఉంటే తమ అర్హతకు సంబంధించిన వివరాలు సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే దరఖాస్తుదారు కుటుంబ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి లోబడి ఉండాలి. ఇతర వివరాలకు సచివాలయాల్లో సంప్రతించాలని అధికారులు కోరుతున్నారు.

నేటి నుంచి అబుదాబీకి విమాన సర్వీస్‌

విశాఖపట్నం-భువనేశ్వర్‌ మధ్య కొత్త విమానం ప్రారంభం

విశాఖపట్నం, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం నుంచి అబుదాబీకి అంతర్జాతీయ విమాన సర్వీసు శుక్రవారం ప్రారంభం కానుందని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం తెలిపింది. అలాగే గురువారం నుంచి విశాఖపట్నం-భువనేశ్వర్‌ మధ్య కొత్త విమానం ప్రారంభమైందని పేర్కొంది. ఈ విమానం భువనేశ్వర్‌లో మధ్యాహ్నం 12.35 గంటలకు బయలుదేరి 1.55 గంటలకు విశాఖపట్నం వస్తుంది. ఇక్కడి నుంచి మధ్యాహ్నం 2.25 గంటలకు బయలుదేరి 3.45 గంటలకు భువనేశ్వర్‌ చేరుతుంది.

ఏవియేషన్‌ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనపై హర్షం

విశాఖపట్నంలో ఏవియేషన్‌ యూనివర్సిటీ ఏర్పాటుచేయాలని ఈ ఏడాది ఏప్రిల్‌ 14వ తేదీన సీఎం చంద్రబాబునాయుడుకు, కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్‌ నాయుడుకు వినతిపత్రం ఇచ్చామని, దానికి వారు స్పందించి విశాఖపట్నంలో ఆ యూనివర్సిటీకి ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు బుధవారం ప్రకటించారని అపాటా ప్రతినిధులు కుమార్‌ రాజా, నరేశ్‌కుమార్‌, డీఎస్‌ వర్మలు హర్షం వ్యక్తంచేశారు. భోగాపురం సమీపాన ఈ యూనివర్సిటీ వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.

Updated Date - Jun 13 , 2025 | 01:28 AM