వేతన బకాయిలు విడుదల చేయాలి
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:24 PM
మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, స్కూల్ శానిటేషన్ కార్మికుల బకాయి వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీఐటీయూ అనుబంధ మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు.
భోజన పథకం, పాఠశాలల శానిటేషన్ కార్మికుల డిమాండ్
అనకాపల్లి టౌన్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, స్కూల్ శానిటేషన్ కార్మికుల బకాయి వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీఐటీయూ అనుబంధ మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గూనూరు వరలక్ష్మి మాట్లాడుతూ, కార్మికులకు ప్రతి నెలా సకాలంలో వేతనాలు అందడం లేదని, దీనివల్ల ఆయా కార్మికులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అదే విధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు కూడా బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతున్నదని, కార్మికులు అప్పులు చేసి భోజనం వండి పెట్టాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి కార్మికులకు బకాయిలు విడుదల చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతన చట్టాలన్ని అమలు చేయాలని, వంట గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం డీఈవో కార్యాలయం అధికారికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, సుభద్ర, ఎస్‌కే బీబీ, జానకి, శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.