ఖాళీగా కూర్చోబెట్టి జీతాలు!
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:55 AM
స్టీల్ ప్లాంటు యాజమాన్యం కొందరిపై ప్రత్యేక ప్రేమ చూపిస్తోంది.
స్టీల్‌ప్లాంటులో విడ్డూరం
పనులు లేకుండా కొనసాగుతున్న ‘ప్రాజెక్ట్సు’ విభాగం
నాలుగు సెక్షన్లు...40 మంది అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
స్టీల్ ప్లాంటు యాజమాన్యం కొందరిపై ప్రత్యేక ప్రేమ చూపిస్తోంది. వ్యయ నియంత్రణ పేరిట ఇటీవల వేలాది మందిని బయటకు పంపించిన యాజమాన్యం ప్లాంటులో ఎటువంటి పనులు లేని ప్రాజెక్ట్సు విభాగాన్ని ఎందుకు కొనసాగిస్తోందని మిగిలిన విభాగాల ఎగ్జిక్యూటివ్‌లు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఇటీవల జరిగిన సమావేశంలో నేరుగా యాజమాన్య ప్రతినిధులనే నిలదీశారు.
స్టీల్ ప్లాంటు విస్తరణ ఎప్పుడో పూర్తయ్యింది. ప్రస్తుతం ఎటువంటి కొత్త ప్రాజెక్టులు లేవు. అటువంటప్పుడు ఆ విభాగానికి ప్రత్యేక కార్యాలయం, దానికి ఒక డైరెక్టర్, అందులో మరో నాలుగు సెక్షన్లు, వాటిలో 44 మంది అధికారులు దేనికనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కార్పొరేట్, కనస్ట్రక్షన్, ప్రాజెక్ట్స్, పర్యవేక్షణ విభాగాలు ఉన్నాయి. వాటికి జనరల్ మేనేజర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు, మేనేజర్లు ఇలా వివిధ హోదాలతో పనిచేస్తున్నారు.
రాయబరేలిలో రైళ్లకు అవసరమైన చక్రాలను తయారుచేసే పరిశ్రమను ఏర్పాటుచేశారు. అక్కడకు కొంత మందిని డిప్యూటేషన్‌పై పంపించారు. ఆ సంస్థను రైల్వేకి ఇచ్చేయడంతో స్టీల్ అధికారులను తిరిగి వెనక్కి తీసుకువచ్చారు. వారిలో నలుగురు ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన వారు ఉన్నారు. ప్రస్తుత యాజమాన్యం వారికి ఎటువంటి పనులు అప్పగించకుండా ఖాళీగా కూర్చోబెట్టి జీతాలు చెల్లిస్తోంది. వారు మాత్రం యాజమాన్యం తమను అవమానిస్తోందని, బాధ్యతలు ఇవ్వకుండా ఖాళీగా ఉంచడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పుడైనా ప్రాజెక్ట్స్ వింగ్ ఎంతవరకు అవసరమో పునఃపరిశీలన చేసి, అవసరం లేని వారిని వేరే విభాగాలకు సర్దుబాటు చేయాలని, అందరికీ బాధ్యతలు అప్పగించేలా చూడాలని ఉక్కు ఎగ్జిక్యూటివ్‌లు డిమాండ్ చేస్తున్నారు.