సాయి శ్రేయాస్‌కు మళ్లీ అనుమతులు!
ABN , Publish Date - Nov 01 , 2025 | 01:28 AM
ఇద్దరు ఉద్యోగుల ప్రాణాలు బలిగొన్న పరవాడ ఫార్మా సిటీలోని సాయి శ్రేయాస్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మళ్లీ ఉత్పత్తి మొదలైంది.
ఫార్మా కంపెనీలో ఇరవై రోజుల క్రితం ఉత్పత్తి పునఃప్రారంభం
జూన్ 11న విష వాయువులు పీల్చి ఇద్దరు ఉద్యోగులు మృతి
ప్రమాదం జరిగిన 75 రోజులకు కమిటీ నియామకం
వ్యవస్థాగత లోపాలపై కానరాని అధ్యయనం
నివేదికపై హెచ్‌ఆర్‌ఎఫ్ అభ్యంతరాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఇద్దరు ఉద్యోగుల ప్రాణాలు బలిగొన్న పరవాడ ఫార్మా సిటీలోని సాయి శ్రేయాస్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మళ్లీ ఉత్పత్తి మొదలైంది. ఆ కంపెనీలో ఈ ఏడాది జూన్ 11వ తేదీ రాత్రి విషవాయువులు పీల్చి విధుల్లో ఉన్న ఇద్దరు ఉద్యోగులు మరణించిన సంగతి తెలిసిందే. విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిపోయిన వారిని తిరిగి వెనక్కి రప్పించి వారి ప్రాణాలు పోవడానికి యాజమాన్యం కారణమైందని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు కంపెనీలో ఏవీ నిబంధనల ప్రకారం జరగడం లేదని, ఉత్పత్తులకు సంబంధించి సరైన రికార్డులు నిర్వహించడం లేదని గుర్తించి అదే విషయం ప్రభుత్వానికి నివేదించారు. దాంతో కంపెనీని మూసివేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం నియమించిన జాయింట్ ఇన్‌స్పెక్షన్ కమిటీ ప్రమాద మూలాల జోలికి పోకుండా నివేదిక ఇవ్వడంతో మళ్లీ మందుల తయారీకి అనుమతులు ఇచ్చారు. ఇరవై రోజుల క్రితం అక్కడ ఉత్పత్తి ప్రారంభమైంది. దీనిపై మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ప్రమాదం జరిగిన 75 రోజుల తరువాత కమిటీ ఏర్పాటు
ఏదైనా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగితే దానికి కారణాలు తెలుసుకోవడానికి వెంటనే కమిటీలు వేస్తారు. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి. కానీ సాయి శ్రేయాస్ విషయంలో కావాలనే జాప్యం చేశారు. జూన్ 11న ప్రమాదం జరిగితే 75 రోజులు దాటిన తరువాత (అప్పటికే అన్ని ఆనవాళ్లు నాశనమైపోయాయి) తీరుబడిగా ఆగస్టు 27న జాయింట్ ఇన్‌స్పెక్షన్ కమిటీని వేశారు. అధికారుల హోదాలకు అనుగుణంగా కమిటీలో స్థానం కల్పించారు. కానీ ఆ రంగంలో నైపుణ్యం కలిగినవారే కారణాలు గుర్తించగలరనే విషయం విస్మరించారు. దీనినే మానవ హక్కుల వేదిక తప్పుబట్టింది. నలుగురు సభ్యులు కలిగిన ఇన్‌స్పెక్షన్ కమిటీ సెప్టెంబరు ఒకటో తేదీన కంపెనీ ప్రాంగణాన్ని సందర్శించి అన్నీ పరిశీలించింది. ఆ మరుసటిరోజు నివేదిక తయారుచేసి అందించింది.
విషవాయువులు పీల్చడం వల్లనే మరణాలు
- ఎఫులియెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంటులో వ్యర్థాలను న్యూట్రలైజేషన్ చేస్తుండగా పరిశీలనకు వెళ్లిన ఇద్దరు భద్రతా విభాగం ఉద్యోగులు ట్యాంకు మ్యాన్‌హోల్ నుంచి వచ్చిన విషవాయువులు (సల్ఫ్యూరిక్ యాసిడ్, అమోనియా, ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్) పీల్చడం వల్లనే మరణించారని ఇన్‌స్పెక్షన్ అభిప్రాయపడింది.
ఈ సందర్భంగా కంపెనీకి కొన్ని సూచనలు చేసింది.
- కంపెనీలో ఇంకా 80 కిలోలీటర్ల ఎఫులియెంట్ స్టోరేజ్ ట్యాంకులో ఉంది. దానిని వెంటనే బయటకు తరలించాలి.
- ఎఫులియెంట్ స్టోరేజీ ట్యాంక్ ప్రాంతంలో వాయువులను గుర్తించే పరికరాలు ఏర్పాటుచేయాలి.
- ప్రామాణిక ఆపరేషన్ విధానాలు (ఎస్‌ఓపీ) పాటించాలి.
- న్యూట్రలైజేషన్ ప్రక్రియను జనరల్ షిఫ్ట్‌లోనే నిర్వహించాలి.
- ఎఫులియెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంటుకు అనుసంధానం చేసిన స్క్రబ్బర్‌కు ప్రత్యేకంగా విద్యుత్ మీటర్ ఏర్పాటుచేసి, వాటి రీడింగ్ ప్రతి నెలా కాలుష్య నియంత్రణ మండలికి పంపాలి.
- ప్రమాదకరమైన వ్యర్థాలను ఎప్పటికప్పుడు సీఈటీపీకి పంపించాలి. నిల్వ ఉంచకూడదు.
హెచ్‌ఆర్ ఎఫ్ అభ్యంతరాలు
జాయింట్ ఇన్‌స్పెక్షన్ కమిటీ లోపాలను బహిర్గతం చేయలేదని హెచ్‌ఆర్‌ఎఫ్ ఆరోపించింది. కంపెనీలో అంతర్గత భద్రత వైఫల్యాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని, దానిని నిర్ధారించలేదని పేర్కొంది. కంపెనీలో స్క్రబ్బింగ్ విధానం లోపభూయిష్టంగా ఉన్నా దానిని తప్పుపట్టలేదని కూడా విశ్లేషించింది. ఈ నివేదిక అశాస్ర్తీయంగా, బాధ్యతారాహిత్యంగా ఉందని ఆరోపించింది. నిర్వహణ లోపాలు, భద్రతా వైఫల్యాలు, నియంత్రణ అంశాలను విస్మరించిందని పేర్కొంది. ఇకపై ఏదైనా ప్రమాదం జరిగితే 48 గంటల్లో కమిటీని వేయాలని డిమాండ్ చేసింది. ఈ ప్రమాదాన్ని గుణపాఠంగా తీసుకుని రాష్ట్రంలో యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ ట్రైనింగ్ ప్రవేశపెట్టాలని సూచించింది.