Share News

సచివాలయ వ్యవస్థ గాడిన పడేనా?

ABN , Publish Date - Nov 13 , 2025 | 01:23 AM

ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు సిబ్బంది కొరత కారణంగా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో గ్రామ, వార్డు సచి

సచివాలయ వ్యవస్థ గాడిన పడేనా?
పాడేరు- 1 గుడివాడ గ్రామ సచివాలయంలో సిబ్బంది లేక ఖాళీగా ఉన్న కుర్చీలు

- వేధిస్తున్న సిబ్బంది కొరత

- పని విభజనలో లోటుపాట్లు

- డిజిటల్‌ , వెల్ఫేర్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు అధిక పని భారం

- మహిళా పోలీస్‌, వ్యవసాయ/ఉద్యానవన , వెటర్నరీ అసిస్టెంట్‌లకు వెసులుబాటు

- ఇతర విభాగాల సిబ్బందికి ఒక మోస్తరు పని

- అనేక మంది సిబ్బంది డిప్యూటేషన్లపై ఇతర కార్యాలయాల్లో విధులు

- జిల్లాలో 352 సచివాలయాలు.. 2,150 మంది సిబ్బంది

పాడేరు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు సిబ్బంది కొరత కారణంగా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలు అనేక చోట్ల సిబ్బంది కొరతతో వెలవెలబోతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సచివాలయాలను ’విజన్‌ సెంటర్లు’గా నామకరణ చేసి, జిల్లాలో ప్రస్తుతం సచివాలయాల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టింది. మొన్నటి సాధారణ బదిలీలకు ముందు ఇప్పటికే సచివాలయాల రీ గ్రూపింగ్‌ జరపడం ద్వారా సచివాలయ పరిధిలో 2,500 మంది జనాభా ఉంటే ఆరుగురు సిబ్బంది, 3,500 మంది జనాభాకు ఏడుగురు, 3,500 దాటి ఉంటే 8 మంది సిబ్బంది ఉండేలా అధికారులు ప్రక్షాళన చర్యలు చేపట్టింది. అయితే వివిధ క్యాడర్ల పోస్టులు ఖాళీగా ఉండడంతో రీగ్రూపింగ్‌ ద్వారా క్లస్టర్లుగా విభజించినా సిబ్బంది కొరత సమస్య వెంటాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు, ప్రస్తుతం కార్యాలయాల్లో నెలకొన్న పరిస్థితులపై ’ఆంధ్రజ్యోతి’ న్యూస్‌ నెట్‌వర్క్‌ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వాస్తవానికి ఒక సచివాలయంలో మొత్తం సిబ్బందిలో డిజిటల్‌ అసిస్టెంట్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌లకు తీవ్రమైన పని ఒత్తిడి ఉండగా, ఏఎన్‌ఎం, వీఆర్‌వో, పంచాయతీ కార్యదర్శికి ఒక మోస్తరుగా, మహిళా పోలీస్‌, వ్యవసాయ/ఉద్యానవన, వెటర్నరీ అసిస్టెంట్‌లకు మరీ తక్కువగా పనులు ఉంటున్నాయి. అలాగే సర్వేయర్లు, వీఆర్‌వోలను మండల, డివిజన్‌ కార్యాలయాలకు డిప్యూటేషన్లు వేసి అక్కడ పనులు చేయించుకుంటున్నారు. జిల్లా కేంద్రం పాడేరులోని ఉన్న మూడు సచివాలయాలకు చెందిన సర్వేయర్లు, వీఆర్‌వోలను ఇతర కార్యాలయాలకు డిప్యూటేషన్‌లు వేశారు. దీంతో వాళ్లంతా సచివాలయాల్లో లేని పరిస్థితి నెలకొంది. అలాగే మహిళా పోలీసులు సచివాలయాల్లో ఉంటుండగా, వ్యవసాయ/ఉద్యానవన అసిస్టెంట్‌లు ఫీల్డ్‌ వర్క్‌ పేరిట బయటే ఉంటున్నారు. దీంతో ఎప్పుడు సచివాలయానికి వెళ్లినా డిజిటల్‌ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, మహిళా పోలీసులే కనిపిస్తున్నారు. మిగిలిన సిబ్బంది డిప్యూటేషన్లు, ఫీల్డ్‌ విజిట్‌లలోనే ఉంటున్నారు. అయితే సచివాలయాల సిబ్బంది క్రమబద్ధీకరణ తరువాత ఖాళీగా ఉండే పరిస్థితి లేదు. గతంలో ప్రతి సచివాలయానికి 11 మంది చొప్పున సిబ్బంది ఉండే వారు. కాగా కూటమి ప్రభుత్వం జనాభా ఆధారంగా సచివాలయ పరిధిలో సిబ్బందిని సర్దుబాటు చేసింది.

జిల్లాలో 352 సచివాలయాలు... 2,150 మంది సిబ్బంది

జిల్లాలో పాడేరు, రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో మొత్తం 22 మండలాల్లోని 430 గ్రామ పంచాయతీల పరిఽధిలో 353 గ్రామ సచివాలయాలున్నాయి. వాటి పరిధిలో ప్రస్తుతం 2,150 మంది సిబ్బంది ఉన్నారు. వాస్తవానికి గతంలో ప్రతి సచివాలయం పరిధిలో 11 మంది చొప్పున కేటాయించినప్పుడు 2,813 మంది సిబ్బంది ఉండేవారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. జిల్లాలోని మొత్తం 352 గ్రామ సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించి సిబ్బందిని కేటాయించింది. 2,500 మంది లోపు జనాభాఽ ఉన్న సచివాలయంలో ఆరుగురు, 2,500 నుంచి 3,500 మంది జనాభాకు ఏడుగురు, 3,500 పైబడి జనాభా ఉంటే 8 మంది అవసరాన్ని బట్టి 10 మంది సిబ్బందిని ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలోని మొత్తం 352 సచివాలయాల్లో కేవలం 19 చోట్ల మాత్రమే 2,500 పైబడి జనాభా ఉండగా, మిగిలిన 333 సచివాలయాల్లో 2,500 మంది లోపు జనాభా ఉన్నారు. దీంతో అధిక సంఖ్యలో సచివాలయాల్లో ఆరుగురు సిబ్బందిని నియమించగా, ఇతర వాటిల్లో 8 మంది, ప్రత్యేక పరిస్థితుల్లో 10 మంది సిబ్బందిని నియమించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 2,150 మంది సిబ్బంది ఉన్నారు. సిబ్బంది క్రమబద్ధీకరణతో గతంలో పని భారంతో సతమతమవుతున్న సిబ్బందికి ఊరట కలగడంతో పాటు ప్రజలకు సకాలంలో పౌర సేవలు అందే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే అదే స్థాయిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ సైతం కొనసాగితే ప్రజలకు మరింత ప్రయోజనకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Nov 13 , 2025 | 01:23 AM