Share News

శబరిమల రైళ్లు ఫుల్‌

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:48 AM

అయ్యప్ప మాలధారుల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఎర్నాకులం, కొల్లాం ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో జనవరి వరకూ బెర్తులు లభించని పరిస్థితి నెలకొంది.

శబరిమల రైళ్లు ఫుల్‌

టాటా-ఎర్నాకులం, బొకారో ఎక్స్‌ప్రెస్‌లలో జనవరి 15 వరకూ బెర్తులు రిజర్వు

కొల్లాం ఎక్స్‌ప్రెస్‌కూ అదే పరిస్థితి

విశాఖ-కొల్లాం ప్రత్యేక రైలులో డిసెంబరు నెలాఖరు నుంచి ఖాళీలు

విశాఖపట్నం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి):

అయ్యప్ప మాలధారుల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఎర్నాకులం, కొల్లాం ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో జనవరి వరకూ బెర్తులు లభించని పరిస్థితి నెలకొంది. బొకారో ఎక్స్‌ప్రెస్‌ (13351), టాటా-ఎర్నాకులం (18189) వంటి రెగ్యులర్‌ రైళ్లతోపాటు ప్రతి గురువారం విశాఖ నుంచి బయలుదేరే కొల్లాం ఎక్స్‌ప్రెస్‌ (18567)లో జనవరి 15 వరకూ బెర్తులు ఖాళీ లేవు. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ప్రతి మంగళవారం విశాఖలో బయలుదేరి బుధవారం కొల్లాం చేరేలా వాల్తేరు రైల్వే అధికారులు ప్రవేశపెట్టిన ప్రత్యేక రైలుకు మిశ్రమ డిమాండ్‌ ఏర్పడింది. ప్రత్యేక రైలు (08539)లో డిసెంబరు 9, 16, 23, 30, జనవరి 6 తేదీల్లో ఏసీ కోచ్‌లలో, డిసెంబరు 30, జనవరి 6న స్లీపర్‌లో ఖాళీలు ఉన్నాయి.

కొల్లాం ఎక్స్‌ప్రెస్‌కు జనవరి 15 వరకూ బెర్తులు ఫుల్‌

విశాఖ-కొల్లాం ఎక్స్‌ప్రెస్‌ (18567)కు జనవరి 15 వరకు బెర్తులు నిండిపోయాయి. అత్యధిక శాతం అయ్యప్ప భక్తులు ఈ రైలునే ఆశ్రయిస్తారు. అయితే విశాఖ నుంచి కొల్లాంకు ఒకే ఒక ఒరిజినేటింగ్‌ రైలు (వారాంతపు) అందుబాటులో ఉన్న నేపథ్యంలో అయ్యప్ప భక్తుల అవసరాలు తీరడం లేదు. గతంలో నాలుగు నెలల ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయం ఉన్నప్పుడు మాలధారణకు ముందే యాత్ర తేదీలకు అనుగుణంగా రిజర్వేషన్‌ పొందేవారు. ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయాన్ని రెండు నెలలకు కుదించడంతో అయ్యప్ప భక్తులకు ఆశించిన స్థాయిలో బెర్తులు లభించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో విశాఖ మీదుగా ఎర్నాకులం చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే రైళ్లను ఆశ్రయిస్తున్నారు.

కొల్లాం ఎక్స్‌ప్రెస్‌ ఫ్రీక్వెన్సీ పెంపుపై వినతి

విశాఖ-కొల్లాం ఎక్స్‌ప్రెస్‌ (18567) రైళ్ల సర్వీసుల ఫ్రీక్వెన్సీ పెంచాలని ప్రయాణికుల నుంచి డిమాండ్‌ ఉన్నా రైల్వే అధికారులు దృష్టి సారించడం లేదు. కొల్లాం ఎక్స్‌ప్రెస్‌కు కేవలం శబరిమలై యాత్ర సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ ఆక్యుపెన్సీ ఎక్కువగానే ఉంటోంది. రేణిగుంట, గూడూరు మీదుగా వెళ్లే కొల్లాం ఎక్స్‌ప్రెస్‌కు తిరుపతి ప్రయాణికుల డిమాండ్‌ ఉంది. దరిమిలా వారానికి రెండు రోజులు (బైవీక్లీ) అందుబాటులో ఉండేలా ఫ్రీక్వెన్సీ పెంచితే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

బొకారో ఎక్స్‌ప్రెస్‌ జనవరి 17 వరకు ఫుల్‌

విశాఖ మీదుగా నడిచే ధన్‌బాద్‌-అలెప్పీ బొకారో ఎక్స్‌ప్రెస్‌ (13351)లో జనవరి 17వ తేదీ వరకూ అన్ని తరగతుల బెర్తులు నిండిపోయాయి. అలాగే బొకారో ఎక్స్‌ప్రెస్‌తో కనెక్టవిటీ నడిచే టాటా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌ (18189)కు కూడా అంతే డిమాండ్‌ నెలకొంది. వీటితోపాటు రోజూ నడిచే డిబ్రుగర్‌-నాగర్‌కోయిల్‌ వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ (22504)లో జనవరి 16 వరకు బెర్తులు ఫుల్‌ అయిపోయాయి.

వారాంతపు రైళ్లకు డిమాండ్‌

వివిధ ప్రాంతాల నుంచి విశాఖ మీదుగా ఎర్నాకులం చేరే వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో జనవరి 16 వరకు బెర్తులు లభించే పరిస్థితి లేకుండా పోయింది. ప్రతి గురువారం నడిచే షాలిమార్‌-నాగర్‌కోయిల్‌ గురుదేవ్‌ ఎక్స్‌ప్రెస్‌ (12660) జనవరి 15 వరకు, ప్రతి సోమ, బుధవారం అందుబాటులో ఉండే షాలిమార్‌-త్రివేండ్ర ఎక్స్‌ప్రెస్‌ (22642) జనవరి 14 వరకు, ప్రతి శుక్ర, శనివారం నడిచే పాట్నా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌ (22644) జనవరి 9 వరకు, ప్రతి శనివారం అందుబాటులో ఉండే సిల్చార్‌-త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్‌కు (12508) జనవరి 3 వరకు, ప్రతి మంగళవారం నడిచే హటియా-ఎర్నాకులం ధాత్రి అబ్బా ఎక్స్‌ప్రెస్‌ (22837)లో జనవరి 6 వరకూ బెర్తులు నిండిపోయి నిరీక్షణ జాబితా ఉంది.

శ్రీకాకుళం, కొల్లాం ప్రత్యేక రైలుపై వినతి

అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం వాల్తేరు రైల్వే అధికారులు 2023లో శ్రీకాకుళం-కొల్లాం మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడిపారు. ఈ ఏడాది అయ్యప్ప మాలధారుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో గతంలో మాదిరిగా శ్రీకాకుళం రోడ్డు, కొల్లాం మధ్య ప్రవేశపెట్టాలని అయ్యప్ప భక్తులు కోరుతున్నారు.

Updated Date - Nov 19 , 2025 | 12:48 AM