జిల్లాలోకి ఎస్.కోట?
ABN , Publish Date - Aug 14 , 2025 | 01:06 AM
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై మళ్లీ చర్చ జరుగుతోంది.
ఎస్.కోట, కొత్తవలస, లక్కవరపుకోట, వేపాడ, జామి మండలాలు విలీనం ప్రతిపాదన
పార్లమెంటు నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లాలో ఉండేలా చూడాలని యోచన
‘పెందుర్తి’పైనా చర్చ
విశాఖపట్నం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై మళ్లీ చర్చ జరుగుతోంది. విశాఖ జిల్లా స్వరూపం మారే సూచనలు కనిపిస్తున్నాయి. పార్లమెంటు నియోజకవర్గమంతా ఒక జిల్లా పరిధిలో ఉండాలనేది ఒక ప్రతిపాదన. ఆ విధంగా ఉన్నట్టయితే అన్నింటికీ వెసులుబాటుగా ఉంటుందని, ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజన జరిగితే కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. విశాఖ పార్లమెంటు పరిధిలో గల శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉంది. దానిని ఇప్పుడు విశాఖ జిల్లా పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదిస్తున్నారు. అలా చేసినట్టయితే ఆ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎస్.కోట, లక్కవరపుకోట, కొత్తవలస, వేపాడ, జామి మండలాలు విశాఖ జిల్లాలోకి వస్తాయి.
పెందుర్తిని మార్చాల్సి ఉంది
పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉంది. అయితే ఆ నియోజకవర్గంలోని పరవాడ, సబ్బవరం మండలాలు అనకాపల్లి జిల్లాలో ఉండగా, పెందుర్తి మండలం మాత్రం విశాఖ జిల్లాలో ఉంది.
డివిజన్ల ఏర్పాటు కూడా మార్చాలి
కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు రెవెన్యూ డివిజన్ల విభజన సక్రమంగా జరగలేదు. విశాఖపట్నం నగరం నడిబొడ్డునున్న అక్కయ్యపాలెం, సీతమ్మధార, మద్దిలపాలెం ప్రాంతాలు భీమిలి రెవెన్యూ డివిజన్‌లో ఉన్నాయి. ఆ డివిజన్‌లో చినగదిలి, సీతమ్మధార మండలాలను చేర్చారు. వాస్తవానికి అవి విశాఖ రెవెన్యూ డివిజన్‌లో ఉండాలి. ఇప్పుడైనా వీటిని మార్చాల్సి ఉంది.