ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ, ఏఈఈ సస్పెన్షన్
ABN , Publish Date - Nov 14 , 2025 | 01:05 AM
మండలంలోని పెట్టుగోళ్లపల్లిలో నాణ్యతా లోపంతో నిర్మించిన వాటర్ ట్యాంకు... ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల మెడకు చుట్టుకుంది. నక్కపల్లి డీఈఈ వై.ఆనంద్, ఎస్.రాయవరం ఏఈఈ ఎం.మనోజ్ కల్యాణ్‌లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ విజయకృష్ణన్ ఉత్తర్వులు జారీచేశారు.
వాటర్ ట్యాంకు నిర్మాణంలో నాణ్యతా లోపం
హోం మంత్రి అనిత ఫిర్యాదుతో కలెక్టర్ చర్యలు
బ్లాక్ లిస్టులోకి కాంట్రాక్టర్
వాటర్ ట్యాంకును తనిఖీ చేసిన ఉన్నతాధికారులు
ఎస్.రాయవరం, నంవబరు 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెట్టుగోళ్లపల్లిలో నాణ్యతా లోపంతో నిర్మించిన వాటర్ ట్యాంకు... ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల మెడకు చుట్టుకుంది. నక్కపల్లి డీఈఈ వై.ఆనంద్, ఎస్.రాయవరం ఏఈఈ ఎం.మనోజ్ కల్యాణ్‌లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ విజయకృష్ణన్ ఉత్తర్వులు జారీచేశారు. పెట్టుగోళ్లపల్లిలో జల్‌జీవన్ మిషన్ పథకం కింద నిర్మించిన వాటర్ ట్యాంకును బుధవారం ప్రారంభించడానికి వెళ్లిన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత.. ట్యాంకు లీక్ అవుతుండడాన్ని గమనించారు. నిర్మాణంలో నాణ్యతా లోపంపై అక్కడే ఉన్న సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంకును ప్రారంభించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతేకాక ట్యాంకు నిర్మాణంలో నాణ్యతాలోపాలకు బాధ్యులైన అఽధికారులు, కాంట్రాక్టర్‌పై చర్యలు చేపట్టాని కలెక్టర్‌కు, సంబంధిత శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ వెంటనే స్పందిస్తూ ఆర్‌డబ్లూఎస్ డీఈఈ ఆనంద్, ఏఈఈ మనోజ్‌కల్యాణ్‌లను సస్పెండ్ చేశారు. కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టారు.
వాటర్ ట్యాంకు నాణ్యతపై తనిఖీలు
పెట్టుగోళ్లపల్లిలో నాణ్యతాలోపంతో నిర్మించిన వాటర్ ట్యాంకును గురువారం ఆర్‌డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజనీర్ ఇషాన్ బాషా, ఎస్‌ఈ రామస్వామి, ఈఈ అనిల్‌కుమార్‌తోపాటు క్వాలిటీ కంట్రోల్ అధికారులైన డీఈ ప్రభాత్, ఏఈలు రమ్య అనూష, కార్తీక్ ఇక్కడకు వచ్చిన పరిశీలించారు. కట్టడానికి సంబంధించి కొన్నిచోట్ల శాంపిల్స్ సేకరించారు. రైతు సేవా కేంద్రం వద్ద నిర్మిస్తున్న వాటర్ ట్యాంకును కూడా పరిశీలించారు. జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన పనుల వివరాలను తెలుసుకుని, వాటికి సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ ఇషాన్ బాషా మాట్లాడుతూ, జల్ జీవన్ మిషన్ కింద ఇక్కడ జరిగిన పనులను పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తరువాత నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు.