త్వరలో వినియోగంలోకి రుషికొండ ప్యాలెస్
ABN , Publish Date - Oct 13 , 2025 | 12:47 AM
రుషికొండలో గత వైసీపీ ప్రభుత్వం రూ.450 కోట్లతో నిర్మించిన ప్యాలెస్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
అభిప్రాయాలు కోరిన ప్రభుత్వం
17న విజయవాడలో సమావేశం
విశాఖపట్నం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి):
రుషికొండలో గత వైసీపీ ప్రభుత్వం రూ.450 కోట్లతో నిర్మించిన ప్యాలెస్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేకమంది నాయకులు రుషికొండకు వచ్చి ప్యాలెస్‌ను పరిశీలించారు. ఇటీవల పంచాయతీరాజ్, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ సందర్శనలో కొన్నిచోట్ల పైకప్పు పెచ్చులు ఊడిపోయి, గోడలకు నీరు చిమ్మిన దృశ్యాలు బయటపడ్డాయి. విలువైన భవనాన్ని ఖాళీగా ఉంచకుండా పర్యాటక సీజన్ నాటికి ఏదో ఒక విధంగా ఉపయోగంలోకి తేవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మూడు నెలల తరువాత కమిటీ రెండు రోజుల క్రితం విజయవాడలో సమావేశమై ప్యాలెస్ వినియోగంపై చర్చింది. దీనిపై ప్రజలతో పాటు జాతీయ, అంతర్జాతీయ ఆతిథ్య సంస్థల నుంచి సూచనలు తీసుకోవాలని అభిప్రాయపడింది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక సంస్థ ఆదివారం ప్రకటన జారీ చేసింది. రుషికొండ ప్యాలెస్‌తో పాటు దానికి అనుబంధంగా ఉన్న తొమ్మిది ఎకరాల భూమిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో వారం రోజుల్లోగా అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. సూచనలను ఏపీ టూరిజం వెబ్‌సైట్‌కు పంపాలని సూచించింది. దాంతో పాటు ఈ నెల 17వ తేదీన విజయవాడ ఆటోనగర్‌లోని పర్యాటక శాఖ సీఈఓ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహిస్తామని, దానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరై సూచనలు ఇవ్వాలని కోరింది.