అధ్వానంగా రుషికొండ బీచ్
ABN , Publish Date - May 27 , 2025 | 01:42 AM
రుషికొండ బీచ్‌ను బ్లూ ఫ్లాగ్ సంస్థ సూచించిన మేరకు పర్యాటక శాఖ పరిశుభ్రంగా ఉంచడం లేదు.
పేరుకుపోయిన చెత్తాచెదారం
ఇటీవల ఒకసారి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు...
రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో పునరుద్ధరణ
మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి
కరవైన అధికారుల పర్యవేక్షణ
విశాఖపట్నం, మే 26 (ఆంధ్రజ్యోతి):
రుషికొండ బీచ్‌ను బ్లూ ఫ్లాగ్ సంస్థ సూచించిన మేరకు పర్యాటక శాఖ పరిశుభ్రంగా ఉంచడం లేదు. ఈ కారణంగానే రెండు నెలల క్రితం బ్లూ ఫ్లాగ్ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకున్నాక పునరుద్ధరించారు. బీచ్ నిర్వహణ బాధ్యతను పర్యాటక అభివృద్ధి సంస్థతో పాటు జీవీఎంసీకి కూడా అప్పగించారు. పర్యాటకులు సంచరించే ప్రాంతంలో సముద్రం పరిశుభ్రంగా ఉంచాలనేది ప్రధాన నిబంధన. దానిని ఇక్కడ అసలు పాటించడం లేదు. నెల రోజుల కిందట పర్యాటకుల బోటు షికారు ప్రాంతంలో చెత్తాచెదారం పేరుకుపోతున్నదని ‘ఆంధ్రజ్యోతి’ సచిత్ర కథనం ప్రచురిస్తే అప్పటికప్పుడు శుభ్రం చేశారు. ఆ తరువాత మళ్లీ మామూలే. అమావాస్యకో, పౌర్ణమికో అన్నట్టుగా బీచ్‌ను శుభ్రం చేస్తున్నారు. రోజూ శుభ్రం చేయాలనే విషయాన్ని పర్యవేక్షకులు విస్మరిస్తున్నారు. వారాంతపు రోజులైన శని, ఆదివారాల్లో ఎక్కువ మంది పర్యాటకులు వస్తారు. ఈ ఆదివారం పెద్ద సంఖ్యలో బోటు షికారుకు వచ్చారు. ఆ ప్రాంతమంతా చెత్తతో నిండిపోయి ఉంది. నిర్వాహకులు పార్కింగ్ ఫీజుల వసూలు, బోటు షికారు టికెట్ల విక్రయంపై చూపే శ్రద్ధ బీచ్ నిర్వహణపై చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. జీవీఎంసీ రహదారులను మాత్రమే రోజూ శుభ్రం చేస్తే బీచ్ పరిసరాలు తమ బాధ్యత కాదన్నట్టుగా వ్యవహరిస్తోంది. జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్ ఇద్దరూ ఒక్కరే కాబట్టి దీనిపై తగిన ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది.