రుషికొండ బీచ్‌కు కలకాలం బ్లూ ఫ్లాగ్ గుర్తింపు
ABN , Publish Date - Jul 04 , 2025 | 01:19 AM
నగరంలోని రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కలకాలం కొనసాగేలా చర్యలు చేపడుతూనే...రాష్ట్రంలో మరిన్ని బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు తీసుకువచ్చి విదేశీ పర్యాటకుల సంఖ్య పెంచుతామని పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు.
సుందరీకరణకు రూ.24 లక్షలు కేటాయింపు
పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా డబుల్ డెక్కర్ బస్సులు
మంత్రి కందుల దుర్గేశ్
విశాఖపట్నం, జూలై 3 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కలకాలం కొనసాగేలా చర్యలు చేపడుతూనే...రాష్ట్రంలో మరిన్ని బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు తీసుకువచ్చి విదేశీ పర్యాటకుల సంఖ్య పెంచుతామని పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. ఆయన గురువారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా అధికారులతో కలిసి రుషికొండ బీచ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీచ్‌లో అనవసరమైన కట్టడాలను తొలగించి, అవసరమైనవి నిర్మిస్తామన్నారు. పర్యాటక శాఖ తరపున బీచ్ సుందరీకరణకు రూ.24 లక్షలు కేటాయించామన్నారు. విశాఖ నుంచి భీమిలి వరకు బీచ్ రోడ్డులో నడపనున్న డబుల్ డెక్కర్ ఎలక్ర్టిక్ బస్సును ఈ సందర్భంగా పరిశీలించారు. ఇవి పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. విశాఖపట్నం వచ్చే పర్యాటకులు కేవలం బీచ్‌ల సందర్శనకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలను సందర్శించేలా టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటుచేస్తామన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పంచకర్ల సందీప్, తదితరులు పాల్గొన్నారు.
కేకే లైన్‌లో కొనసాగుతున్న రైళ్ల రద్దు
నేడు కిరండూల్ రైళ్లు అరకు, కోరాపుట్ వరకే
కొండచరియలు విరిగిపడిన ప్రదేశంలో కొనసాగుతున్న ట్రాక్ పునరుద్ధరణ పనులు
విశాఖపట్నం, జూలై 3 (ఆంధ్రజ్యోతి):
కొత్తవలస-కిరండూల్ (కేకే) రైలు మార్గంలో ఒడిశాలోని మల్లిగూడ, జరాటి స్టేషన్ల మధ్య బుధవారం కొండ చరియలు, మట్టి పడిన ప్రదేశంలో వాల్తేరు డివిజన్ డీఆర్‌ఎం లలిత్ బొహ్రా, రాయగడ డివిజన్ డీఆర్‌ఎం అమితాబ్ సింఘాల్ పర్యవేక్షణలో ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ మార్గంలో గురువారం కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటి గమ్యాలను కుదించారు. జగదల్‌పూర్-రూర్కెల ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (18108), జగదల్‌పూర్-భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18448) రైళ్లను శుక్రవారం (4న) కూడా రద్దు చేశారు.
నేడు కిరండూల్ రైలు అరకు వరకే...
విశాఖ-కిరండూల్ పాసింజర్ (58501) శుక్రవారం విశాఖలో బయలుదేరి అరకులోయ వరకూ వెళుతుంది. తిరుగు ప్రయాణంలో కిరండూల్-విశాఖ పాసింజర్ (58502) రైలు అరకులోయలో బయలుదేరి విశాఖ చేరుతుంది. అరకులోయ, కిరండూల్ మధ్య రాకపోకలు రద్దు చేశారు. అలాగే కిరండూల్-విశాఖ నైట్ ఎక్స్‌ప్రెస్ (18516) శుక్రవారం కోరాపుట్ నుంచి బయలుదేరి విశాఖ చేరుతుంది. ఇక హౌరా-జగదల్‌పూర్-హౌరా మధ్య రాకపోకలు సాగించే సమలేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను (18005/18006) ఈనెల 4, 5 తేదీల్లో హౌరా-కోరాపుట్ మధ్య నడిచే విధంగా చర్యలు చేపట్టారు. కోరాపుట్-జగదల్‌పూర్ మధ్య రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేశారు.
నీటి సరఫరా టెండర్లలో రింగ్
ఒక్కో కాంట్రాక్టర్‌కు ఒక్కో వర్కు కేటాయింపు
ఎక్కువ లెస్‌కు బిడ్ వేయకుండా జాగ్రత్త
జీవీఎంసీ ఖజానాకు భారీగా గండి
పరోక్షంగా అధికారుల సహాయసహకారాలు
విశాఖపట్నం, జూలై 3 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ కాంట్రాక్టర్లు రింగ్ అయిపోతున్నారు. ఇంజనీరింగ్ విభాగం ద్వారా చేపట్టే వివిధ పనులకు టెండర్లు పిలిస్తే ఎక్కువమంది పోటీ పడకుండా, ఒకరిద్దరు మాత్రమే బిడ్లు వేసేలా అవగాహనకు వస్తున్నారు. పోటీ లేకపోవడంతో తక్కువ లెస్‌కు టెండర్ వేసి ఆయా పనులను దక్కించుకుంటున్నారు. దీనివల్ల కాంట్రాక్టర్లకు భారీగా లబ్ధి చేకూరుతుండగా, జీవీఎంసీ ఖజానాకు మాత్రం గండిపడుతోంది.
గిరిప్రదక్షిణ ఏర్పాట్లలో భాగంగా భక్తులకు తాగునీటి సదుపాయం కల్పించేందుకు జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో తొమ్మిది వర్కులు చేపట్టేందుకు సుమారు రూ.60 లక్షల అంచనా వ్యయంతో అధికారులు ఈనెల ఒకటిన షార్ట్ టెండర్ పిలిచారు. బిడ్ దాఖలుకు శుక్రవారం వరకూ అవకాశం కల్పించారు. అయితే కాంట్రాక్టర్ల సంఘంలోని ముగ్గురు నేతలు రంగంలోకి దిగారు. ఆయా వర్కులకు ఎవరూ టెండర్లు వేయొద్దని వాట్సాప్ గ్రూపులో ఆదేశాలు జారీచేశారు. టెండరు వేయాలని ఆసక్తికలిగినవారు తమకు ఫోన్ చేసి పేర్లు ఇవ్వాలని, వారిలో లాటరీ ద్వారా ఒక్కో వర్కును ఒక్కొక్కరికి కేటాయిస్తామని ప్రతిపాదించారు. దీనివల్ల నామమాత్రపు లెస్‌లతో వర్కులను దక్కించుకోవచ్చునని వాట్సాప్‌లో వివరించారు. దీనికి కొందరు కాంట్రాక్టర్లు విముఖత చూపగా, మరికొందరు స్వాగతించారు. యూనియన్‌లోని నేతలు తమ బినామీలకు, అనుచరులకు పనులు కట్టబెట్టేందుకే ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని కొందరు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. నీటి సరఫరా విభాగం ఆధ్వర్వంలో ఇటీవల 15 పనులకు ఒకసారి, మరో 15 పనులకు ఇంకొకసారి వేర్వేరుగా టెండర్లు పిలిచారు. 30 వర్కులను ఒక్కొక్క కాంట్రాక్టర్‌కు వాటాలుగా పంచుతామని, ఎవరూ తొందరపడి టెండర్లు వేయొద్దని యూనియన్‌లోని ఒక నాయకుడు ఆదేశించినట్టు తెలిసింది. ఎవరైనా తమను కాదని టెండర్ వేస్తే మాత్రం వారికి క్వాలిటీ కంట్రోల్‌వారితోనూ, ఎంబుక్ రికార్డింగ్ సమయంలోనూ ఇబ్బందులు తప్పవని హెచ్చరించినట్టు సమాచారం. టెండర్ వేయడానికి ఆసక్తి ఉన్నవారు తమకు పేర్లు ఇస్తే తామే వారికి ఏదో ఒక వర్కును కేటాయించి, ఆ వర్కుకు మరొకరు టెండరు వేయకుండా చూస్తామని భరోసా ఇస్తున్నారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. బాగా మిగిలే పనులను తాము ఉంచుకుని పెద్దగా గిట్టుబాటు కాని పనులు మాత్రం తమలాంటి వారికి కేటాయించేందుకు ఎత్తుగడ వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనివల్ల కాంట్రాక్టర్లకు లాభసాటిగానే ఉంటున్నప్పటికీ, జీవీఎంసీకి లెస్‌ల రూపంలో మిగలాల్సిన ఆదాయం కోల్పోతుందని అధికారులు చెబుతున్నారు. కాంట్రాక్టర్లు రింగ్ అయిపోవడంపై అధికారులు సీరియస్‌గా చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ వారితో అంతర్గతంగా అవగాహన కుదుర్చుకోవడంతో నోరెత్తకుండా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని జీవీఎంసీ కాంట్రాక్టర్ల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.రమేష్ వద్ద ప్రస్తావించగా, కాంట్రాక్టర్లకు ఏడాదికి పైగా బిల్లులు పెండింగ్‌లో ఉండిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. కాంట్రాక్టర్లకు మేలు జరిగేలా చూసేందుకే తక్కువ లెస్‌లకు వర్కులు చేసుకునేలా చూడడానికి అందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఒక్కోవర్కుని ఒకరు చొప్పున పంచుకునేలా చేస్తున్నామన్నారు.