దారుణంగా గ్రామీణ దారులు
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:36 PM
మన్యంలోని గ్రామీణ ప్రాంతాల రోడ్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయి. ఈ ఏడాది అధికంగా కురిసిన వర్షాలకు మరింత దారుణంగా తయారయ్యాయి. ఏజెన్సీలో ఏ మండలంలోని గ్రామాలకు వెళ్లినా పాడైన రహదారులే దర్శనమిస్తున్నాయి. అనేక గ్రామాలకు రోడ్డు సదుపాయాలు లేకపోగా, ఉన్న రోడ్లకు కనీస మరమ్మతులు చేయకపోవడంతో వాహన చోదకులను భయపెడుతున్నాయి.
గొండెలి-కె.కోడాపల్లి రహదారి గోతులమయం
పాడైన డముకు- నిమ్మలపాడు రోడ్డు
పశువులబంద-చౌడుపల్లి రహదారి గుంతలమయం
మూలకు చేరిన మాల మాకవరం రోడ్డు
రాకపోకలకు అవస్థలు పడుతున్న పల్లె వాసులు
వర్షాలకు మరింత ఘోరం
పల్లె రోడ్ల మరమ్మతులపై దృష్టిపెట్టని సర్కారు
(ఆంధ్రజ్యోతి-పాడేరు/అనంతగిరి/చింతపల్లి/
అరకులోయ/ కొయ్యూరు )
జిల్లా కేంద్రం పాడేరు మండలం గొండెలి-కె.కోడాపల్లి రోడ్డుతో పాటు దేవాపురం, సలుగు, కక్కి ప్రాంతాలకు వెళ్లే రోడ్లు గతుకులమయమయ్యాయి. పాడేరు నుంచి పెదబయలు వెళ్లే మెయిన్‌రోడ్డులో సైతం బంగారుమెట్ట, పన్నెడ ప్రాంతాల్లో రోడ్డు అధ్వానంగా తయారైంది. అరకులోయ మండలంలోని చినలబుడు పంచాయతీ కేంద్రానికి చేరుకునే అరకులోయ-చొంపి రోడ్డు చూడ్డానికి సైతం ఇష్టపడని విధంగా ఉంది. ముంచంగిపుట్టు మండలంలో గుమ్మసిరగంపుట్టు నుంచి లక్ష్మీపురం వెళ్లే మార్గం, రూడకోట నుంచి బూసిపుట్టు వెళ్లే మార్గంలోని అనేక చోట్ల గతుకులున్నాయి. హుకుంపేట మండల కేంద్రం నుంచి కామయ్యపేటకు వెళ్లే మార్గంతో పాటు పెదగరువు కూడలి నుంచి ఉప్ప, రాప వెళ్లే రోడ్డు దుస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఏజెన్సీలోని అన్ని మండలాల్లోని అనేక మారుమూల గ్రామీణా ప్రాంతాల్లో రోడ్ల దుస్థితి గత కొన్నాళ్లుగా ఇలానే ఉంది.
దారుణంగా రోడ్లు
అనంతగిరి మండలంలో పలు రహదారులు ఘోరంగా తయారయ్యాయి. ముఖ్యంగా హుకుంపేట, పాడేరు రోడ్లకు అనుసంధానంగా ఉన్న డముకు-నిమ్మలపాడు రోడ్డు దారుణంగా తయారైంది. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని పెదబిడ్డ, లంగుపర్తి, వాలసీ, గుమ్మ పంచాయతీల గిరిజనులు ఈ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగిస్తుంటారు. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ రహదారికి మరమ్మతులు చేసినా నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో కొద్ది రోజులకే గోతులు పడ్డాయి. డముకు నుంచి చెరుకుమడత జంక్షన్ వరకు గోతులు ఏర్పడ్డాయి. జెండాగరువు-బొడ్డపాడు మధ్యలోని రంగినిగెడ్డ ఉధృతి కారణంగా రోడ్డుతో పాటు రక్షణగోడ కొట్టుకుపోయింది. మేడపర్తి వంతెన వద్ద ఇసుక మేటలు కుప్పలుగా పేరుకుపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి.
అడుగడున భారీ గోతులు
చింతపల్లి మండలంలోని పశువులబంద-చౌడుపల్లి ప్రధాన రహదారి అత్యంత అధ్వానంగా తయారైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారిపై ఏర్పడిన గోతులను పూడ్చేందుకు కనీస చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం రహదారిపై అడుగడుగున భారీ గోతులు ఉన్నాయి. రెండు మండలాల ప్రజలను కలిపే ఈ ప్రధాన రహదారి దారుణంగా తయారైంది. ఈ మార్గంలో ఆర్టీసీ బస్సు సర్వీసుని నర్సీపట్నం డిపో అధికారులు రద్దు చేశారు. దీంతో చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాలకు చెందిన 50 గ్రామాల ఆదివాసీలకు రవాణ కష్టాలు తప్పడం లేదు.
పాడైన గ్రామీణ రహదారులు
అరకులోయ మండలంలోని గ్రామీణ రోడ్లు నిర్వహణ లేక అత్యంత దారుణంగా తయారయ్యాయి. పీఎంజీఎస్‌వై రోడ్లు కూడా అధ్వానంగా మారాయి. ప్రధానంగా సుంకరమెట్ట పంచాయతీ పరిధిలోని గన్నెల జంక్షన్ నుంచి గన్నెల వరకు ఉన్న తారురోడ్డు, గన్నెల జంక్షన్ మొదలు జయంతివలస వరకు ఉన్న పీఎంజీఎస్‌వై రహదారి పూర్తిగా పాడైపోయింది. అదేవిధంగా కొత్త భల్లుగుడ నుంచి జనంగుడ వరకు ఉన్న రహదారి, సుంకరమెట్ట నుంచి చినగంగగుడి మీదుగా మవడగడ-చొంపి-వర్రా వరకు ఉన్న పీఎంజీఎస్‌వై రహదారి గోతులమయమైంది. అలాగే అరకులోయ నుంచి చొంపి జంక్షన్ మీదుగా కోడిపుంజువలస, సిరగాం వరకు ఉన్న రహదారి అధ్వానంగా తయారైంది. పద్మాపురం జంక్షన్ నుంచి వయా పద్మాపురం మీదుగా రణజిల్లడ వరకు ఉన్న రహదారి పూర్తిగా పాడైపోయింది.
మాల మాకవరం రోడ్డుకు మోక్షమేదీ?
కొయ్యూరు మండలంలోని మాల మాకవరానికి రహదారి కోసం ఏషియన్ ఇన్‌ప్రాస్ట్రక్చర్ ఇన్వెస్టుమెంట్ బ్యాంకు(ఏఐఐబీ) పథకంలో ఎం. మాకవరం నుంచి నడింపాలెం జాతీయ రహదారిని కలిపేలా సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.1.06 కోట్లు మంజూరయ్యాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పర్యవేక్షణలో పనులు ప్రారంభమయ్యాయి. రోలుగుంట మండలం ఎంకే పట్నంకు చెందిన కాంట్రాక్టరుకు ఈ నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. దీంతో రహదారి నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టరు కొండవాగుపై వంతెన నిర్మాణాలతో పాటు రహదారి నిర్మాణానికి వీలుగా మట్టి పనులు మెటల్, స్టోన్‌డస్తు మిశ్రమాన్ని రోడ్డుపై పరిచాడు. సీసీ రోడ్డు నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ సిద్ధం చేశాడు. అనంతరం చేసిన పనులకు బిల్లు పెట్టారు. అయితే వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్మాణాలకు ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడంతో కాంట్రాక్టరు పనులు చేయకుండా నిలిపివేశాడు.
గ్రామీణ రోడ్ల అభివృద్ధిపై దృష్టిపెట్టని ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం గత ఏడాది రోడ్ల గుంతల పూడ్చివేత ప్రక్రియను కేవలం మెయిన్‌రోడ్లకే పరిమితం చేసింది. గ్రామీణ ప్రాంత రోడ్ల మరమ్మతులు చేపట్టలేదు. చివరకు పాడేరు- జోలాపుట్టు మెయిన్‌రోడ్డులో ఉన్న పెదబయలు మండల కేంద్రానికి అటు మూడు కిలోమీటర్లు, ఇటు మూడు కిలోమీటర్ల రోడ్డు ఘోరంగా పాడైపోయింది. వాస్తవానికి ఆ రోడ్డు మరమ్మతులపై గత వైసీపీతో పాటు ప్రస్తుత కూటమి ప్రభుత్వం సైతం పట్టించుకోలేదు. దీంతో పాడేరు నుంచి పెదబయలు, ముంచంగిపుట్టు, జోలాపుట్టు ప్రాంతాలకు రాకపోకలు సాగించాలంటే భయపడుతున్నారు. ఏజెన్సీలో మండల కేంద్రాలకు అనుసంధానంగా ఉన్న గ్రామీణ రోడ్లు మరమ్మతులకు నోచుకోక అధ్వానంగా మారుతున్నాయి. ఇప్పటికైనా పాలకులు స్పందించి గ్రామీణ ప్రాంత రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.