Share News

యూరియాకు పరుగులు

ABN , Publish Date - Sep 16 , 2025 | 01:14 AM

పుష్కలంగా వర్షాలు పడడం, వరి పంటకు ఎరువులు వేయాల్సి రావడంతో రైతులంతా ఒకేసారి ఎగబడుతున్నారు.

యూరియాకు పరుగులు

ఆర్‌ఎస్‌కేలు, పీఏసీఎస్‌ల వద్ద బారులు తీరుతున్న రైతులు

అనవసర ప్రచారాలతో ఆందోళన

రానున్న రోజుల్లో అవసరాలకు ఇప్పుడే కొనుగోలు

ఇతర రైతులకు యూరియా అందని పరిస్థితి

చోడవరం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):

పుష్కలంగా వర్షాలు పడడం, వరి పంటకు ఎరువులు వేయాల్సి రావడంతో రైతులంతా ఒకేసారి ఎగబడుతున్నారు. దీంతో ఆర్‌ఎస్‌కేలు, పీఏసీఎస్‌లతోపాటు ప్రైవేటు దుకాణాల్లో ఎరువులు.. ముఖ్యంగా యూరియా శరవేగంగా అమ్ముతుపోతున్నది. రైతుల అవసరాలకు సరిపడ యూరియా రాకపోవడంతో ఆయా కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం మండలాలకు యూరియా నిల్వలు పంపిస్తున్నప్పటికీ, గ్రామాలకు చేరడంలో జాప్యం ఏర్పడుతుండడంతో రైతుల్లో అనవసర ఆందోళన పెరిగిపోతున్నది. సకాలంలో యూరియా వేయకపోతే పైరు సరిగా పెరగక, ధాన్యం దిగుబడి తగ్గిపోతుందేమోనని గుబులు చెందుతున్నారు. కొంతమంది రైతులు రెండు, మూడు దఫాల్లో వేయాల్సిన యూరియాను కూడా ఇప్పుడే కొనుగోలు చేస్తుండడంతో మిగిలిన రైతులకు అవసరమైన సమయంలో యూరియా అందని పరిస్థితి నెలకొంది. రైతులు మిగిలిన అన్ని పనులు పక్కనపెట్టి యూరియా కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.

చోడవరం సబ్‌ డివిజన్‌ పరిధిలో చాలావరకు రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్‌ల ద్వారా ఎరువుల సరఫరా చేపట్టారు. నరసాపురం పంచాయతీ పరిధిలోని రైతులకు రాయపురాజుపేట సహకార సంఘం ద్వారా ఎరువులు సరఫరా చేశారు. అయితే కొంతమందికి మాత్రమే యూరియా అందడంతో మిగిలిన రైతులు ఎదురుచూస్తున్నారు. మరింత యూరియాను రప్పించడానికి పీఏసీఎస్‌ అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. అయితే యూరియా రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండడంతో, నరసాపురం రైతులు ఇతర పంచాయతీల రైతు సేవా కేంద్రాలు, చోడవరంలోని ఎరువుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. దుడ్డుపాలెం, నరసయ్యపేట తదితర గ్రామాలకు ఇంతవరకు యూరియా సరఫరా కాలేదని రైతులు చెబుతున్నారు. ఈ పంచాయతీల్లో మంగళవారం నుంచి యూరియా సరఫరా చేస్తామని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. యూరియా సరఫరాపై రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, రైతులందరికీ నిర్ణీత సమయంలో అందుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్‌ఎస్‌కేలు, పీఏసీఎస్‌ల ద్వారా యూరియా సరఫరా చేశామని, ఇంకా ఎక్కడైనా అవసరమైతే అదనంగా ఇండెంట్‌ పెట్టి రప్పిస్తామని అధికారులు చెబుతున్నారు. వారం, పది రోజుల్లో పుష్కలంగా యూరియా సరఫరా అవుతుందని, అందువల్ల రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇస్తున్నారు.

Updated Date - Sep 16 , 2025 | 01:14 AM