Share News

ఉక్కు ఉద్యోగులకు శిధిల క్వార్టర్లు!

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:48 AM

ఉక్కు కర్మాగారం యాజమాన్యం శిథిలమైన ఖాళీ క్వార్టర్లను ఉద్యోగులకు బలవంతంగా కట్టబెట్టాలని చూస్తోంది.

ఉక్కు ఉద్యోగులకు శిధిల క్వార్టర్లు!

  • మూడు నెలల్లో రిటైర్‌ కాబోతున్న వారికి కేటాయింపు

  • హెచ్‌ఆర్‌ఏకు కోత పెట్టేందుకే...

  • ఖాళీగా ఉన్న క్వార్టర్లకు డబ్బులు వసూలు చేసే కుట్ర

  • కోర్టును ఆశ్రయించిన స్టీల్‌ ఎగ్జిక్యూటివ్స్‌ అసోసియేషన్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఉక్కు కర్మాగారం యాజమాన్యం శిథిలమైన ఖాళీ క్వార్టర్లను ఉద్యోగులకు బలవంతంగా కట్టబెట్టాలని చూస్తోంది. తీసుకోని వారికి ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) నిలిపివేస్తామని చెబుతోంది. ఇంకో మూడు నెలల్లో పదవీ విరమణ చేసేవారికే ముందు క్వార్టర్లు కేటాయిస్తామని మెమోలు ఇచ్చింది. ఈ తీరును నిరసిస్తూ స్టీల్‌ ఎగ్జిక్యూటివ్స్‌ అసోసియేషన్‌ హైకోర్టు గుమ్మం ఎక్కింది.

ఉక్కు యాజమాన్యం 1980-90 మధ్యలో ఉద్యోగుల కోసం క్వార్టర్లు నిర్మించింది. అప్పటి పరిస్థితులను బట్టి సింగిల్‌ కామన్‌ వాష్‌రూమ్‌ను మాత్రమే నిర్మించారు. అయితే 24/7 విద్యుత్‌, తాగునీటి సదుపాయం, చుట్టూ పార్కులు, గ్రీనరీ, ప్లే గ్రౌండ్‌ వంటివి ఉండడంతో అప్పట్లో చాలా మంది మక్కువ చూపేవారు. వాటిని నిర్మించి 30 ఏళ్లు దాటిపోయింది. చాలావరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరమ్మతులు కూడా లేవు. మరోవైపు స్టీల్‌ ప్లాంటు పరిసరాలు బాగా అభివృద్ధి చెందడంతో ఉద్యోగులు కూర్మన్నపాలెం, తదితర ప్రాంతాల్లో ఇళ్లు, ఫ్లాట్లు కొనుక్కొని వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ క్వార్టర్ల కంటే బయట నివాసమే సౌకర్యవంతంగా ఉంది. విద్యుత్‌ బిల్లు కూడా శ్లాబుల ప్రకారం కట్టుకోవచ్చు. అదే ప్లాంటులో అయితే ప్రతి యూనిట్‌కు ఎనిమిది రూపాయలు కట్టాలి.

టౌన్‌షిప్‌లో సుమారు వేయి క్వార్టర్లు చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బాగా లేదని ఏడాది కాలంగా ఉద్యోగులకు ఇచ్చే హెచ్‌ఆర్‌ఏపై యాజమాన్యం ‘డిఫర్‌’ చేసింది. అంటే ఆర్థిక పరిస్థితి బాగుంటే ఇస్తామని, లేదంటే ఇవ్వబోమని అర్థం. ఇప్పుడు గత మూడు నెలల నుంచి నగదు లాభాలు చూపిస్తున్నారు. ఉద్యోగులకు బేసిక్‌లో 20 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలి. అది యాజమాన్యానికి ఇష్టం లేదు. అందుకని మూడు నెలల్లో రిటైరయ్యే వారికి క్వార్టర్లు కేటాయిస్తామని, అంతా వాటిలో ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకో మూడు నెలల్లో రిటైరయ్యేవారు ఇప్పుడు కుటుంబాన్ని క్వార్టర్‌లోకి మార్చే అవకాశం లేదు. పైగా అక్కడ సదుపాయాలు లేవు. యాజమాన్యం చెప్పినట్టు క్వార్టర్‌లో ఉండలేరు. బయట ఉంటే హెచ్‌ఆర్‌ఏ ఇవ్వరు.

స్టీల్‌ ప్లాంటుకు ఎనిమిది కి.మీ. దాటి ఉన్నవారికే క్వార్టర్లు ఇస్తారు. అంతకంటే తక్కువ దూరంలో ఉన్న వారికి ఇవ్వరు. గతంలో తప్పుడు సమాచారం ఇచ్చి క్వార్టర్‌లో చేరారని ఆరోపిస్తూ చాలామందిని బయటకు పంపించేశారు. ఇప్పుడు అలాంటి వారందరినీ క్వార్టర్లలోకి రమ్మంటున్నారు. కనీసం మరమ్మతులు కూడా చేపట్టకుండా వాటిని కేటాయిస్తున్నారు. టౌన్‌షిప్‌ నిర్వహణకు కూడా సరిగ్గా నిధులు ఇవ్వడం లేదు. వాస్తవానికి వాటిని కూల్చివేసి కొత్తవి నిర్మించాలి. వాటి పుస్తక విలువ కూడా జీరో అయిపోయి చాలా కాలమైంది. భారీవర్షాలు కురిసి ఏదైనా క్వార్టర్‌ కూలిపోతే కుటుంబం పరిస్థితి ఏమిటో యాజమాన్యమే చెప్పాలి. ఇటీవల ఓ ఉద్యోగి క్వార్టర్‌లో పాము కరిచి మరణించారు. దీంతో క్వార్టర్లలో ఉండడానికి అంతా భయపడుతున్నారు.

తప్పనిసరై ఆశ్రయించాం

కేవీడీ ప్రసాద్‌, సెక్రటరీ, స్టీల్‌ ఎగ్జిక్యూటివ్స్‌ అసోసియేషన్‌

న్యాయం కోరుతూ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసిన మాట వాస్తవమే. స్టే ఆర్డర్‌ ఇవ్వాలని కోరాము. అయితే ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ఇంతకు మించి మాట్లాడలేము.

Updated Date - Jul 26 , 2025 | 12:48 AM