మట్టిలో మాణిక్యం
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:31 PM
మండలంలోని సోముదేవుపల్లి గ్రామానికి చెందిన అన్నం గణేశ్ అనే దివ్యాంగుడు పారా వాలీబాల్ పోటీల్లో సత్తా చాటుతున్నాడు. క్రీడలపై ఆసక్తి వున్న ఇతను తొలుత వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు.
పారా వాలీబాల్ క్రీడలో రాణిస్తున్న గణేశ్
ఇంతవరకు ఎనిమిది జాతీయ, 12 రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన దివ్యాంగుడు
గత ఏడాది ప్రపంచ కప్ పోటీల్లో భారత్‌కు రజత పతకం రావడంలో కీలక భూమిక
వచ్చే నెల అమెరికాలో జరిగే వరల్డ్ కప్ పోటీలకు భారత్ జట్టులో స్థానం
హరియాణాలోని హిస్సార్‌లో శిక్షణకు పయనం
2028 పారా ఒలింపిక్స్‌లో ఆడాలన్నదే లక్ష్యమంటున్న సోముదేవుపల్లి యువకుడు
ఎస్.రాయవరం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సోముదేవుపల్లి గ్రామానికి చెందిన అన్నం గణేశ్ అనే దివ్యాంగుడు పారా వాలీబాల్ పోటీల్లో సత్తా చాటుతున్నాడు. క్రీడలపై ఆసక్తి వున్న ఇతను తొలుత వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. తరువాత వాలీబాల్ అంటే మక్కువ పెంచుకుని క్రమంగా పట్టుసాధించాడు. ఈ ఏడాది అక్టోబరు 12 నుంచి 18వ తేదీ వరకు అమెరికాలో జరగనున్న పారా వాలీబాల్ ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొనే భారత జట్టులో స్థానం సంపాదించాడు.
సోముదేవుపల్లి గ్రామానికి చెందిన అన్నం గణేశ్ పుట్టుకతోనే పోలియో బాధితుడు. తండ్రి అర్జునరావు ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండగా, తల్లి మణి పశువులు మేపుతుంటారు. ఆర్థిక ఇబ్బందులు వున్నప్పటికీ దివ్యాంగుడైన కుమారుడు గణేశ్‌ను చదువులో ప్రోత్సహించారు. ఇటీవల పీజీ పూర్తి చేశాడు. కాగా గణేశ్‌కు పదేళ్ల వయసులోనే క్రీడలపై మక్కువ ఏర్పడింది. పాఠశాలలో చదువుతున్నప్పుడు వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ వంటి క్రీడలు ఆడేవాడు. కొంతకాలం తరువాత వాలీబాల్‌పై ఆసక్తి పెరిగింది. దివ్యాంగుడు కావడంతో పదేళ్ల నుంచి వివిధ స్థాయిలో పారా వాలీబాల్ పోటీల్లో పాల్గొంటున్నాడు. 2016 నుంచి ఇప్పటి వరకు ఎనిమిది జాతీయ, 12 రాష్ట్రస్థాయి పారా వాలీబాల్ పోటీల్లో పాల్గొని జట్టుకు పతకాలు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. నక్కపల్లి, ఎలమంచిలి ప్రాంతాల్లో వున్న దివ్యాంగ క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆటలో ప్రాక్టీస్ చేస్తూ నైపుణ్యాన్ని పెంచుకున్నారు. రాష్ట్ర పారా వాలీబాల్ అసోసియేషన్ సహకారంతో పలుచోట్ల శిక్షణ శిబిరాలకు హాజరై మెలకువలు నేర్చుకున్నాడు.
2023లో తమిళనాడు రాష్ట్రం తంజావూరులో జరిగిన 11వ జాతీయ స్థాయి పారా పారా వాలీబాల్ పోలటీలు, 2024లో రాజస్థాన్ రాజధాని జైపూర్ జరిగిన 12వ జాతీయ స్థాయి పారా వాలీబాల్ పోటీలు, ఈ ఏడాది బెంగళూరులో జరిగిన 13వ సీనియర్ నేషనల్ సిటీ యూనివర్సిటీ పారా వాలీబాల్ ఛాంపియన్ పోటీల్లో గణేశ్ ఆడాడు. గత ఏడాది చైనాలోని యుగాంగ్‌లో జరిగిన పారా బీచ్ వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భారత జట్టు తరపున ఆడిన గణేశ్, తోటి ఆటగాళ్లతో కలిసి చక్కని ప్రతిభకనబరిచి రజత పతకం సొంతం చేసుకున్నారు. గణేశ్ వాలీబాల్ పోటీలే కాకుండా అథ్లెటిక్స్ పోటీల్లో జావెలిన్ త్రో, లాంగ్‌జంప్‌లో బంగారు పతకాలు సాధించాడు.
వచ్చే నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అమెరికాలోని ఇండియానా రాష్ట్రం పోర్ట్ వేనేలో జరగనున్న సిట్టింగ్ పారా వాలీబాల్ వరల్డ్ కప్ పోటీల్లో పాల్గొనే భారత జట్టులో స్థానం సంపాదించాడు. హరియాణా రాష్ట్రం హిస్సార్‌లో జరిగి శిక్షణ శిబిరానికి హాజరయ్యేందుకు ఒకటో తేదీన ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లాడు.