సంక్రాంతికి ఆర్టీసీ స్పెషల్స్
ABN , Publish Date - Dec 23 , 2025 | 01:26 AM
సంక్రాంతి ప్రయాణికుల సౌకర్యార్థం 1,400 స్పెషల్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ విశాఖ రీజియన్ యాజమాన్యం ప్రణాళిక తయారుచేసింది.
1,400 బస్సులు సిద్ధం చేసిన అధికారులు
జోన్ పరిధిలో 1,100, దూర ప్రాంతాలకు 300, జనవరి 8 నుంచి ప్రారంభం
రెగ్యులర్ చార్జీలే వసూలు
ద్వారకా బస్‌స్టేషన్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి):
సంక్రాంతి ప్రయాణికుల సౌకర్యార్థం 1,400 స్పెషల్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ విశాఖ రీజియన్ యాజమాన్యం ప్రణాళిక తయారుచేసింది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, కడప, చిత్తూరు, శ్రీకాళహస్తి, భీమవరం వంటి దూర ప్రాంతాలకు 300, జోనల్ పరిధిలోని శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం, సోంపేట, మందస, విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, రాజాం, కాకినాడ, రాజమండి వంటి ప్రాంతాలకు 1,100 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు నిర్ణయించింది. గరుడ, గరుడ ప్లస్, నైట్ రైడర్, డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి, సూపర్ లగ్జరీ, ఆలా్ట్ర డీలక్స్ వంటి సర్వీసులను దూరప్రాంతాలకు, ఆర్డినరీ, పల్లెవెలుగు, ఆలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, డీలక్స్, ఆలా్ట్ర డీలక్స్ సూపర్ లగ్జరీ వంటి సర్వీసులు జోనల్ పరిధిలోని ప్రాంతాలకు నడపనున్నది. జనవరి 8 నుంచి 21వ తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసులు ఆపరేట్ చేస్తామని రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు వెల్లడించారు.
రీజియన్‌లోని అన్ని డిపోల నుంచి స్పెషల్స్ ఆపరే షన్
రీజియన్‌లోని మధురవాడ, వాల్తేరు, మద్దిలపాలెం, విశాఖపట్నం, గాజువాక, స్టీల్‌సిటీ, సింహాచలం డిపోలతో పాటు ద్వారకా బస్‌స్టేషన్ నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. ద్వారకా కాంప్లెక్సుకు ప్రయాణికుల రద్దీ పెరగకుండా ఉండేందుకు జిల్లా పరిధిలో ఉన్న అన్ని డిపోల నుంచి స్పెషల్స్ ఆపరేషన్ చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. సంక్రాంతి ప్రయాణికుల రవాణాకు వినియోగించే స్పెషల్ సర్వీసుల్లో ప్రయాణికుల నుంచి షెడ్యూల్స్ సర్వీసుల చార్జీలే వసూలు చేయనున్న ఆర్‌ఎం ప్రకటించారు.
స్పెషల్స్‌లో కూడా స్త్రీశక్తి పథకం వర్తింపు
సంక్రాంతి స్పెషల్స్‌లో కూడా స్త్రీశక్తి పథకం వర్తిస్తుందని ఆర్‌ఎం ప్రకటించారు. స్త్రీశక్తి పథకానికి నిర్దేశించిన ఆర్డినరీ, పల్లెవెలుగు, ఆలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చునని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు. ఈ పథకం ద్వారా ఉచిత ప్రయాణం చేయాలనుకునే మహిళలు ఆధార్ కార్డు తప్పనిసరిగా తమతో పాటు ఉంచుకోవాలని, కండక్టర్ కోరినప్పుడు కార్డు చూపించాలని పేర్కొన్నారు
రాత్రి కూడా స్పెషల్స్ ఆపరేషన్
సంక్రాంతి స్పెషల్స్ ఉదయం 6.00 నుంచి రాత్రి 10.00 గంటల వరకు నడపడం జరుతుందని, ప్రయాణికుల డిమాండ్ ఉంటే రాత్రి పది గంటల తరువాత కూడా నడుపుతామని ఆర్‌ఎం ప్రకటించారు. సంక్రాంతి ప్రయాణికులు రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగినన్ని బస్సులు సమకూర్చుకోవడం జరిగిందని వెల్లడించారు. అన్ని డిపోల నుంచి మంచి కండిషన్‌లో ఉన్న బస్సులను ఎంపిక చేసి వాటినే ప్రత్యేక సర్వీసులుగా వినియోగిస్తామన్నారు.