Share News

ఆర్టీసీ ఆదాయం అదుర్స్‌

ABN , Publish Date - Dec 09 , 2025 | 01:57 AM

స్త్రీ శక్తి పథకం అమలు తరువాత ఆర్టీసీకి ఆదాయం భారీగా పెరిగింది.

ఆర్టీసీ ఆదాయం అదుర్స్‌

‘స్ర్తీ శక్తి’ పథకంతో గణనీయంగా పెరిగిన రాబడి

అనకాపల్లి, నర్సీపట్నం డిపోలకు గత నాలుగు నెలల్లో రూ.33.07 కోట్ల ఆదాయం

ఇందులో ‘స్త్రీ శక్తి’ ఆదాయం రూ.20.62 కోట్లు

క్రమేపీ పెరుగుతున్న ఓఆర్‌

ఉచిత ప్రయాణానికి ముందు 65 శాతం

ఇప్పుడు 110 శాతం ఓఆర్‌

నర్సీపట్నం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి):

స్త్రీ శక్తి పథకం అమలు తరువాత ఆర్టీసీకి ఆదాయం భారీగా పెరిగింది. ఆర్టీసీ బస్సుల్లో ఓఆర్‌ గణనీయంగా శాతం పెరిగింది. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించకముందు 65 శాతం ఓఆర్‌ వచ్చేది. ఇప్పుడు 110 శాతం ఓఆర్‌ వస్తున్నది. స్ర్తీ శక్తి పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి గత నెల 25వ తేదీ వరకు జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం డిపోలకు వచ్చిన మొత్తం ఆదాయంలో ఆరవై శాతానికిపైగా మహిళల ప్రయాణం ద్వారా రావడం విశేషం.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేస్తున్న విషయం తెలిసింది. పల్లెవెలుగు, అలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తీర్థాలకు, పండుగలకు, వివాహాది శుభ కార్యాలయాలకు, తీర్థయాత్రలకు మహిళలు మూకుమ్మడిగా ప్రయాణం అవుతున్నారు. స్త్రీ శక్తి పథకం అమల్లోకి రాకముందు ఓఆర్‌ 65 శాతం వుండగా, ఆ తరువాత నుంచి క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 110 శాతానికి చేరింది.

క్రమంగా పెరుగుతున్న ఓఆర్‌

జిల్లాలో నర్సీపట్నం, అనకాపల్లి డిపోల నుంచి ఆపరేట్‌ చేసే బస్సుల్లో జూలై 26వ తేదీ నుంచి ఆగస్టు 25 తేదీ వరకు సగటు ఓఆర్‌ 82 శాతం వుంది. తరువత ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 25 వరకు 98 శాతం, సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 25 వరకు 110 శాతం, అక్టోబరు 26 నుంచి నవంబరు 26 వరకు 110 శాతం ఓఆర్‌ నమోదైంది. స్త్రీ శక్తి పథకానికి ముందు సాధారణ రోజుల్లో ఓఆర్‌ 60 నుంచి 65 శాతం ఉండేది. సంక్రాతి, దసరా పండగల సమయంలో మరో 10 శాతం పెరిగేది. అటువంటిది ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వచ్చిన తరువాత గత రెండు నెలల్లో 110 శాతం ఓఆర్‌ నమోదు కావడం విశేషం.

మూడింట రెండు వంతులు మహిళలే!

స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చిన తరువాత ఉచిత ఆర్టీసీ సర్వీసుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. జూలై 26 నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు ఆయా బస్సుల్లో 11,87,749 మంది ప్రయాణించగా, వీరిలో టికెట్టు తీసుకొని ప్రయాణించిన వారు 5,17,304 మంది, ఉచితంగా ప్రయాణించిన వారు 6,70,445 మంది ఉన్నారు. ఈ నెల రోజుల్లో పది రోజులు మాత్రమే ఉచిత ప్రయాణం అమల్లో వుంది. ఇక ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 25 వరకు 25,40,555 మంది ప్రయాణించగా వీరిలో స్త్రీశక్తి పథకం లబ్ధిదారులు 16,99,298 మంది వుండగా, టికెట్‌ కొనుగోలు చేసిన వారు 8,41,257 మంది మాత్రమే ఉన్నారు. సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 25 వరకు ఇంచుమించు ఇంతే సంఖ్యలో ప్రయాణం చేశారు. అక్టోబరు 26 నుంచి నవంబరు 25 వరకు 27,54,184 మంది ప్రయాణించగా వీరిలో స్తీశక్తి పథకం లబ్ధిదారులు 19,38,669 మంది, టికెట్టు తీసుకొని ప్రయాణం చేసిన వారు 8,15,515 మంది ఉన్నారు. మొత్తం నాలుగు నెలల వ్యవధిలో నర్సీపట్నం, అనకాపల్లి డిపోలకు చెందిన బస్సుల్లో 90,37,044 మంది ప్రయాణించగా వీరిలో స్త్రీ శక్తి లబ్ధిదారులు 60,17,533 మంది వున్నారు.

పెరిగిన ఆదాయం

స్త్రీ శక్తి పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పెరిగింది. జూలై 26 నుంచి నవంబరు 25వ తేదీ వరకు రెండో డిపోలకు రూ.33.07 కోట్ల ఆదాయం రాగా, ఇందులో స్త్రీ శక్తి పథకం జీరో టికెట్ల ఆదాయం రూ.20.62 కోట్లు, ఇతర ప్రయాణికుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.12.44 కోట్లు ఉంది. మహిళల ప్రయాణానికి సంబంధించిన టికెట్‌ డబ్బులను ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్‌ చేసే సంస్థ కచ్చితంగా లభాలబాటలో నడుస్తుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 09 , 2025 | 01:57 AM