Share News

ఆర్టీసీ అధికారుల ఉక్కిరిబిక్కిరి

ABN , Publish Date - Sep 16 , 2025 | 12:56 AM

‘స్త్రీశక్తి’ పథకం ప్రారంభమైన తరువాత విశాఖ రీజియన్‌లో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది.

ఆర్టీసీ అధికారుల ఉక్కిరిబిక్కిరి

  • ‘స్ర్తీశక్తి’ అమలు తరువాత విపరీతంగా పెరిగిన ప్రయాణికులు

  • రీజియన్‌లో గతంలో సగటున రోజుకు 3.1 లక్షల మంది ప్రయాణం

  • ప్రస్తుతం 4.1 లక్షల మంది...

  • పెరిగిన ఆ లక్ష మంది మహిళలే

  • డిమాండ్‌కు తగ్గట్టు బస్సులు ఏర్పాటుచేయలేక సతమతం

  • తక్షణం 170 బస్సులు కేటాయించాల్సిందిగా ప్రధాన కార్యాలయానికి ఆర్‌ఎం లేఖ

ద్వారకా బస్‌స్టేషన్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):

‘స్త్రీశక్తి’ పథకం ప్రారంభమైన తరువాత విశాఖ రీజియన్‌లో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. వారి అవసరాలకు అనుగుణంగా బస్సుల నడపడం అధికారులకు సవాల్‌ మారింది. ఏరోజు, ఏ సమయంలో, ఏ రూట్‌లో ఎంత డిమాండ్‌ ఉంటుందో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది.

సాధారణ రోజుల ఉంటే వారాంతాలు, పర్వదినాల్లోను, మంచి ముహూర్తాలు ఉన్న రోజుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. స్త్రీశక్తి పథకం అమలుకు ముందు రీజియన్‌లో గల ఆర్టీసీ బస్సుల్లో సగటున రోజుకు 3.1 లక్షల మంది ప్రయాణించేవారు. పథకం అమలు తరువాత ప్రస్తుతం రోజుకు 4.1 లక్షల మంది ప్రయాణిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. పెరిగిన ఆ లక్ష మందీ కూడా మహిళలేనని అంటున్నారు. స్త్రీశక్తి పథకం అమలుకు ముందు రీజియన్‌లో 780 బస్సులు ఉండేవి. అయితే జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద గతంలో కొనుగోలు చేసిన బస్సు రెండు వారాల కిందట జాతీయ రహదారిపై దగ్ధం కావడంతో...ఆ కేటగిరీకి చెందిన మొత్తం 18 బస్సులను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో బస్సుల సంఖ్య తగ్గింది. ఇదే సమయంలో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దీంతో ట్రాఫిక్‌ నియంత్రణ ఆర్టీసీ అధికారులకు కత్తిమీద సాములా తయారయ్యింది. ఈ నేపథ్యంలో ప్రయాణ సమయం మార్చుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. మరోవైపు విశాఖ రీజియన్‌కు కనీసం 170 బస్సులు సత్వరమే పంపాలని ప్రధాన కార్యాలయానికి రీజనల్‌ మేనేజర్‌ లేఖ రాశారు.

ప్రతిరోజూ ఉదయం 7.00 నుంచి 10.00 గంటలు, సాయంత్రం 4.00 నుంచి రాత్రి 7.00 మధ్య 1.6 లక్షల మంది విద్యార్థులు (పాస్‌లు తీసుకున్న సంఖ్య) ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఇదే సమయంలో ఉద్యోగాలకు, వ్యాపారాలకు, ఇతర వ్యవహారాలకు సంబంధించి పురుషులు, మహిళలు మరో లక్షన్నర మంది ప్రయాణిస్తున్నారు. స్త్రీశక్తి పథకం అమలు తరువాత పెరిగిన లక్ష మంది ప్రయాణికుల్లో ఎక్కువ మంది అవే సమయాల్లో ప్రయాణాలు చేస్తున్నారు. ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టుగా బస్సులు సమకూర్చడం అధికారులకు అసాధ్యమవుతున్నది. ద్వారకా బస్‌స్టేషన్‌, మద్దిలపాలెం, సింహాచలం, ఎంవీపీ కాలనీ బస్‌ స్టేషన్‌ల్లో ప్రయాణికులు బస్సుల కోసం గంటల సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

అధికారులపై పెరుగుతున్న ఒత్తిడి

కాంప్లెక్స్‌లో గంట నుంచి ఉంటున్నా బస్సులు రాలేదని, ఎప్పుడో వచ్చిన బస్సు ఎక్కేందుకు ఒకరినొకరు నెట్టుకోవలసి వస్తోందని ఆర్టీసీ అధికారులను మహిళలు ఫిర్యాదులు చేస్తున్నారు. వేరే రూట్‌ల నుంచి బస్సులు రప్పించాలని యత్నించినా అక్కడా ఇదే పరిస్థితి. బస్సుల కోసం ఆర్టీసీ అధికారులపై ఒత్తిడి పెరుగుతున్నది.

Updated Date - Sep 16 , 2025 | 12:56 AM