సీలేరు మీదుగా తిరిగే ఆర్టీసీ నైట్ సర్వీసులు రద్దు
ABN , Publish Date - May 23 , 2025 | 12:48 AM
నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో సీలేరు మీదుగా తిరిగే విశాఖపట్నం- భద్రాచలం, అలాగే భద్రాచలం- విశాఖపట్నం నైట్ సర్వీస్‌లతో పాటు విశాఖపట్నం నుంచి సీలేరు వచ్చే నైట్ హాల్ట్ బస్సులను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు విశాఖపట్నం ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు మరో 28 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.
- నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో వారం రోజుల పాటు నిలిపివేయాలని నిర్ణయం
- పోలీసుల విస్తృత తనిఖీలు
సీలేరు, మే 22 (ఆంధ్రజ్యోతి): నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో సీలేరు మీదుగా తిరిగే విశాఖపట్నం- భద్రాచలం, అలాగే భద్రాచలం- విశాఖపట్నం నైట్ సర్వీస్‌లతో పాటు విశాఖపట్నం నుంచి సీలేరు వచ్చే నైట్ హాల్ట్ బస్సులను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు విశాఖపట్నం ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు మరో 28 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏవోబీలో మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడవచ్చని నిఘా వర్గాల హెచ్చరికలతో ముందస్తు చర్యల్లో భాగంగా సీలేరు మీదుగా తిరిగే నైట్ సర్వీసులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. కాగా గురువారం ఉదయం నుంచి స్థానిక ఎస్‌ఐ రవీంద్ర ఆధ్వర్యంలో పోలీసులు ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చీపోయే వాహనాలను తనిఖీ చేశారు. అలాగే పోలీస్ స్టేషన్‌తో పాటు ముఖ్య ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.