సరకు రవాణాలో ఆర్టీసీ దూకుడు
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:34 AM
సరకు రవాణాలో ఆర్టీసీ దూసుకుపోతోంది. ఆదాయం పెంచుకునేందుకు 2016లో ప్రారంభించిన లాజిస్టిక్స్ సేవలను విస్తృత పరుచుకుంటూ ముందుకువెళుతోంది.
లాజిస్టిక్ సేవలు విస్తృతం...అదే స్థాయిలో ఆదాయం
ఏటా వృద్ధి నమోదు
డోర్ డెలివరీ సేవలు కూడా ప్రారంభం
ద్వారకా బస్‌స్టేషన్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి):
సరకు రవాణాలో ఆర్టీసీ దూసుకుపోతోంది. ఆదాయం పెంచుకునేందుకు 2016లో ప్రారంభించిన లాజిస్టిక్స్ సేవలను విస్తృత పరుచుకుంటూ ముందుకువెళుతోంది. అదే స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. ప్రయాణికుల రవాణా ద్వారా వచ్చే ఆదాయం సంస్థ నిర్వహణకు సరిపోకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఈ లాజిస్టిక్స్ విభాగాన్ని ప్రారంభించింది. అవే బస్సులు, అదే సిబ్బందిని వినియోగించుకుంటూ అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తోంది.
ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి లాజిస్టిక్స్ విభాగంలో2016-17లో రూ.2.2 కోట్లు, 2017-18లో రూ.4.83 కోట్లు, 2018-19లో రూ.6.77 కోట్లు, 2019-20లో రూ.6.28 కోట్లు, 2020-21లో రూ.7.76 కోట్లు 2021-22లో రూ.7.9 కోట్లు 2022-23లో రూ.7.8 కోట్లు ఆదాయం సాధించింది. 2023-24లో 6,45,000 పార్శిల్స్ రవాణా చేసి రూ.12.71 కోట్లు, 2024-25లో 7,34,636 పార్శిల్స్ రవాణా చేసి రూ.14.48 కోట్లు ఆర్జించింది. 2025-26లో ఇప్పటివరకూ 8,24,482 పార్శిల్స్ రవాణా చేసి రూ.16.18 కోట్లు ఆదాయం వచ్చింది.
లాజిస్టిక్స్ అనుబంధంగా డోర్ డెలివరీ
పాక్షికంగా అమలులో ఉన్న ఆర్టీసీ లాజిస్టిక్స్ డోర్ డెలివరీ సేవలను వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు ఆర్టీసీ ఉమ్మడి విశాఖ రీజియన్ యాజమాన్యం యాక్షన్ ప్లాన్ రూపొందించింది. రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న లాజిస్టిక్స్ కేంద్రాల ద్వారా గరిష్ఠంగా 48 గంటల్లోనే పార్శిల్ డోర్ డెలివరీ చేసేందుకు సంసిద్ధులమవ్వాలని, ప్రతి ఉద్యోగిని ఇందులో భాగస్వామి కావాలని రీజనల్ మేనేజర్ ఇప్పటికే అన్ని డిపోల అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
పార్శిల్ బుకింగ్ అండ్ డెలివరీ కేంద్రాలు
కర్నూలు, అదోని, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్, నంద్యాల, గుంటూరు, నరసరావుపేట, పిడుగురాళ్ల, చీరాల, పొన్నూరు, రేపల్లె, తెనాలి, వినుకొండ, బాపట్ల, చిలకలూరిపేట, అనంతపురం, ధర్మవరం, గుత్తి, గుంతకల్, హిందూపూర్, కదిరి, రాయదుర్గం, తాడిపర్తి, విజయవాడ, ఆటోనగర్, అవనిగడ్డ, గుడివాడ, జగ్గయ్యపేట, మచిలీపట్నం, నూజివీడు, హనుమాన్‌జంక్షన్, ఏలూరు, భీమవరం, కడప, బద్వేల్, జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రాజంపేట, రాయచోటి, బంగారెడ్డిగూడెం, కొవ్వూరు, పాలకొల్లు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, రామచంద్రపూరం, చిత్తూరు, మదనపల్లె, పుత్తూరు, తిరుపతి, కుప్పం, పలమనేరు, సీలేరు, శ్రీకాళహస్తి, రావులపాలెం, రాజోలు, తుని, అన్నవరం, విశాఖపట్నం, అనకాపల్లి, మద్దిలపాలెం, నర్సీపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఒంగోలు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, గిద్దలూరు, కనిగిరి, పొదిలి, నెల్లూరు, కావలి, వెంకటగిరి, పలాస, నరసన్నపేట, పాలకొండ, సాలూరు కేంద్రాలుగా పార్శిల్ బుకింగ్, డెలివరీ, డోర్ డెలివరీ సేవలందిస్తున్నారు.
డోర్ డెలివరీ కౌంటర్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు
ఉమ్మడి విశాఖ జిల్లాలో పార్శిల్స్ డోర్ డెలివరీకి సంబంధించి మరిన్ని కౌంటర్‌లు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఆర్టీసీ లాజిస్టిక్స్ కార్యాలయాల ద్వారానే డోర్ డెలివరీ జరుగుతుంది. ఉమ్మడి విశాఖలో ఉన్న 32 ఆథరైజ్డు ఏజెన్సీల ద్వారా డోర్ డెలివరీ చేసేందుకు గల అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
డోర్ డెలివరీ టారిఫ్ (10 కి.మీ.లోపు)
బరువు కిలోల్లో చార్జీ రూపాయల్లో
0-1 12
1-6 20
6-10 25
10-25 32
25-50 40