ఆర్టీసీకి దసరా తాకిడి
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:33 AM
దసరా ప్రయాణికుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు శనివారం 60 స్పెషల్ సర్వీసులు నడిపారు.
రీజియన్‌లో 60 స్పెషల్ సర్వీస్‌లు నడిపిన అధికారలు
శ్రీకాకుళం జిల్లాకు 25, విజయనగరం జిల్లాకు 20...
ద్వారకా బస్‌స్టేషన్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి):
దసరా ప్రయాణికుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు శనివారం 60 స్పెషల్ సర్వీసులు నడిపారు. రీజియన్‌లోని ద్వారకా బస్‌స్టేషన్, మద్దిలపాలెం, సింహాచలం, స్టీల్ సిటీ కాంప్లెక్స్‌ల నుంచి ఈ బస్సులను ఆపరేట్ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన అనేకమంది విద్య, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. వారంతా స్వస్థలాల్లో దసరా జరుపుకునేందుకు వివిధ రవాణా సాధనాలను ఆశ్రయించి విశాఖ వరకూ వస్తున్నారు. ఇక్కడ నుంచి తమ ప్రాంతాలకు వెళ్లేందుకు ఎక్కువగా ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటున్నారు. దీంతో రీజియన్‌లోని ఆర్టీసీ బస్సులకు డిమాండ్ పెరిగింది. షెడ్యూల్ సర్వీసుల కెపాసిటీకి మించి ప్రయాణికులు ఉండడంతో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపారు. శనివారం విశాఖ నుంచి రాజమండ్రి 8, కాకినాడ 7, శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం, సోంపేట, టెక్కలి, పాతపట్నం ప్రాంతాలకు 25, విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, తదితర ప్రాంతాలకు 20 ప్రత్యేక సర్వీసులు ఆపరేట్ చేశారు.
త్రిసభ్య కమిటీ విచారణ షురూ
ఏయూలో ఆరోగ్య కేంద్రాలు, అంబులెన్స్ పరిశీలన
వైద్యులు, సిబ్బంది తగినంతమంది లేరని, మందుల కొరత ఉందని గుర్తింపు?
మరోసారి పరిశీలించే అవకాశం
విశాఖపట్నం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం హాస్టల్ విద్యార్థి మణికంఠ మృతి నేపథ్యంలో నియామకమైన త్రిసభ్య కమిటీ శనివారం విచారణ ప్రారం భించింది. వర్సిటీలోని ఆరోగ్య కేంద్రంలో తగినంతమంది వైద్యులు, సిబ్బంది, అంబు లెన్స్‌లో ఆక్సిజన్, ఇతర అత్యవసర చికిత్స పరికరాలు లేకపోవడం వల్లనే మణికంఠ మృతిచెందాడని విద్యార్థులు రెండు రోజుల పాటు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సంధ్యాదేవి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు, కేజీహెచ్ సూప రింటెండెంట్ డాక్టర్ వాణితో జిల్లా కలెక్టర్ త్రిసభ్య కమిటీని నియమించారు. ప్రధానంగా మూడు అంశాలపై విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు డాక్టర్ సంధ్యాదేవి, డాక్టర్ పి.జగదీశ్వర రావు, డాక్టర్ రాధాకృష్ణ (కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్. సూపరింటెండెంట్ వాణి అందుబాటులో లేరు) శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఏయూ హెల్త్ సెంటర్స్‌తో పాటు అంబులెన్స్‌ను పరిశీలించారు. నార్త్ క్యాంపస్ ఆవరణలో ఉన్న డిస్పెన్సరీకి కూడా వెళ్లారు. వైద్యులు, సిబ్బంది తగినంతమంది లేరని, అదేవిధంగా మందులు కొరత ఉందని కమిటీ గుర్తించినట్టు తెలిసింది. అయితే మీడియాతో మాట్లాడేందుకు మాత్రం నిరాకరించారు. తాము గుర్తించిన అంశాలను నివేదికలో పొందుపరిచి కలెక్టర్‌కు అందిస్తామని సభ్యులు స్పష్టం చేశారు. కమిటీ మరోసారి ఏయూకు రానుంది.
డీఎస్సీ తుది జాబితాపై అభ్యంతరాల స్వీకరణ
వచ్చే నెల 25వ తేదీ వరకూ అవకాశం
పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ
విశాఖపట్నం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి):
మెగా డీఎస్సీ తుది జాబితాపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే వచ్చే నెల 25వ తేదీలోగా తెలియజేయాలని పాఠశాల విద్యా శాఖ ప్రాంతీయ సంచాలకులు బి.విజయభాస్కర్ కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. డీఎస్సీ తుది జాబితాను ఈనెల 15వ తేదీన అధికారిక వెబ్‌సైట్‌లలో ఉంచామని, అభ్యంతరాలను జోనల్ స్థాయిలో ఆర్జేడీ, అదే జోన్‌లో ఇద్దరు డీఈవోలతో కూడిన కమిటీ 15 రోజుల్లో పరిష్కరిస్తుందన్నారు. ఒకవేళ సంతృప్తి చెందకపోతే రాష్ట్ర కమిటీకి ఫిర్యాదు చేయవచ్చునన్నారు. రాష్ట్రస్థాయి కమిటీ ఇచ్చే నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే అప్పిలేట్ అథారిటీకి వెళ్లవచ్చునన్నారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను కమిటీకి పంపి, అదే కాపీని ఈ-మెయిల్ చేయాలన్నారు. జోన్-1లో అభ్యర్థులు mdscgrievances.z1@apschooledu.inకు మెయిల్ చేయాలన్నారు.