Share News

బావిలో ఆర్టీసీ కండక్టర్‌ మృతదేహం లభ్యం

ABN , Publish Date - Sep 14 , 2025 | 10:43 PM

పాడేరులోని పీఎంఆర్సీ భవనానికి సమీపంలోని రేకుల కాలనీలో గల తాగునీటి బావిలో ఆర్టీసీ కండక్టర్‌ మృతదేహాన్ని ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించారు.

బావిలో ఆర్టీసీ కండక్టర్‌ మృతదేహం లభ్యం
మృతుడు లక్ష్మీనారాయణమూర్తి (ఫైల్‌ ఫొటో)

మతిస్థిమితం లేకపోవడంతో స్నానానికి దిగి మృతి చెంది ఉండవచ్చని అనుమానం

పాడేరురూరల్‌, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): పాడేరులోని పీఎంఆర్సీ భవనానికి సమీపంలోని రేకుల కాలనీలో గల తాగునీటి బావిలో ఆర్టీసీ కండక్టర్‌ మృతదేహాన్ని ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించారు. దీనికి సంబంధించి స్థానికులు, ఎస్‌ఐ ఎల్‌.సురేశ్‌ అందించిన వివరాలు ఇలా వున్నాయి. విశాఖపట్నం మల్కాపురానికి చెందిన లక్ష్మీనారాయణమూర్తి(43) ఐదేళ్ల క్రితం వరకు పాడేరు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా చేసేవాడు. అప్పట్లో మానసిక స్థితి బాగోకపోవడంతో విశాఖ మానసిక వైద్యశాలలో చికిత్స పొందాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మందులు వాడుతున్నాడు. విధులకు గైర్హాజరవుతుండడంతో అధికారులు అతనిని సస్పెండ్‌ చేశారు. ఆ తరువాత అతనిని గాజువాక డిపోనకు బదిలీ చేశారు. అక్కడ కూడా విధులు సక్రమంగా నిర్వహించకుండా సిక్‌ లీవ్‌లో ఉన్నాడు. ఇటీవల అతనిని వాల్తేరు ఆర్టీసీ డిపోనకు బదిలీ చేశారు. కాగా పాడేరులో విధులు నిర్వహించే సమయంలో రేకులకాలనీకి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తరచూ అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఆ మహిళ ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను తిరిగి రాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అన్ని చోట్లా గాలించారు. అతని మృతదేహం రేకుల కాలనీలోని బావిలో తేలి ఉండడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ సురేశ్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించి విశాఖపట్నంలో ఉంటున్న మృతుని భార్య మారెడ్ల గాయత్రికి సమాచారం అందించారు. కుటుంబ సభ్యులతో ఆమె పాడేరు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా లక్ష్మీనారాయణమూర్తికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో బావిలో స్నానానికి దిగి మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు.

Updated Date - Sep 14 , 2025 | 10:43 PM