అమరావతికి ఆర్టీసీ బస్సులు
ABN , Publish Date - May 02 , 2025 | 12:10 AM
రాష్ట్ర రాజధాని అమరావతిలో శుక్రవారం జరిగే ప్రధాని నరేంద్ర మోదీ సభకు ప్రజలను తరలించేందుకు జిల్లాలోని రెండు ఆర్టీసీ డిపోల నుంచి 60 బస్సులను అధికారులు పంపారు. అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ శుక్రవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న విషయం తెలిసిందే.
నేటి ప్రధాని సభకు ప్రజల తరలింపు కోసం పంపిన జిల్లా అధికారులు
అనకాపల్లి నుంచి 25, నర్సీపట్నం నుంచి 35..
బస్సుల కొరతతో ఇబ్బంది పడిన ప్రయాణికులు
అనకాపల్లి టౌన్, మే 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని అమరావతిలో శుక్రవారం జరిగే ప్రధాని నరేంద్ర మోదీ సభకు ప్రజలను తరలించేందుకు జిల్లాలోని రెండు ఆర్టీసీ డిపోల నుంచి 60 బస్సులను అధికారులు పంపారు. అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ శుక్రవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న విషయం తెలిసిందే. చుట్టుపక్కల జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో మోదీ సభకు హాజరయ్యేలా ప్రభుత్వం రవాణా సదుపాయాలు కల్పిస్తున్నది. ఇందుకోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని అనకాపల్లి డిపో నుంచి 25, నర్సీపట్నం డిపో నుంచి 35.. మొత్తం 60 బస్సులను గురువారం ఉదయమే ఇక్కడి నుంచి రాజధాని ప్రాంత జిల్లాలకు పంపారు. దీంతో అనకాపల్లి నుంచి పలాస, విశాఖపట్నం, పాయకరావుపేట, విజయనగరం, జోలాపుట్టుతోపాటు ఇతర గ్రామీణ సర్వీసుల్లో కోత విధించారు. రాజధానికి పంపిన బస్సులు శనివారం మధ్యాహ్నం తరువాత తిరిగి వస్తాయని అధికారులు చెబుతున్నారు. బస్సుల కొరత కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సుల కోసం ప్రయాణికులు ఎక్కువసేపు వేచి వుండాల్సి వస్తున్నది. బస్సు వచ్చిన వెంటనే ఎక్కడానికి ప్రయాణికులు ఎగబడుతున్నారు. చిన్నపిల్లలు, లగేజీతో బస్సు ఎక్కడానికి మహిళలు, వృద్ధులు ఇబ్బంది పడ్డారు. పలు మార్గాల్లో నడిచిన బస్సుల్లో సీట్లు నిండిపోయి ప్రయాణికులు నిలబడి వెళ్లాల్సి వచ్చింది. అమరావతిలో మోదీ సభకు ప్రజలను తరలించడానికి ఆ ప్రాంతంలో వున్న ఆర్టీసీ బస్సులతోపాటు విద్యాసంస్థల బస్సులు తీసుకుంటే సరిపోయేదని, అనకాపల్లి జిల్లా నుంచి బస్సులు పంపడం వల్ల రెండు రోజులపాటు స్థానిక ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వస్తున్నదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.