మొరాయించిన ఆర్టీసీ బస్సు
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:40 AM
విశాఖపట్నం డిపోనకు చెందిన విశాఖపట్నం- భద్రాచలం ఆల్ర్టా డీలక్స్ ఆర్టీసీ బస్సు ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తి బుధవారం ఉదయం సప్పర్ల ఘాట్ రోడ్డులో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
సాంకేతిక లోపంతో సప్పర్ల ఘాట్ రోడ్డులో నిలిచిపోయిన విశాఖపట్నం- భద్రాచలం బస్సు
5 గంటల పాటు ప్రయాణికుల అవస్థలు
సీలేరు, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : విశాఖపట్నం డిపోనకు చెందిన విశాఖపట్నం- భద్రాచలం ఆల్ర్టా డీలక్స్ ఆర్టీసీ బస్సు ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తి బుధవారం ఉదయం సప్పర్ల ఘాట్ రోడ్డులో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దట్టమైన అటవీ ప్రాంతంలో 5 గంటల పాటు యాతన పడ్డారు. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు విశాఖపట్నం- భద్రాచలం బస్సు బయలుదేరింది. జీకేవీధి మండలం సప్పర్ల ఘాట్ రోడ్డు వద్దకు ఉదయం 11 గంటలకు వచ్చే సరికి ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తి పొగలు రావడంతో డ్రైవర్ బస్సును నిలిపివేశారు. ఆ సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో ధారకొండ ప్రాంతానికి చెందిన వారు కొంత మంది ద్విచక్ర వాహనాలపై వెళ్లిపోగా, సీలేరుకు చెందిన ప్రయాణికులను నర్సీపట్నం డిపోనకు చెందిన నర్సీపట్నం- సీలేరు బస్సులో తరలించారు. అయితే డొంకరాయి, మోతుగూడేనికి చెందిన ప్రయాణికులు 5 గంటల పాటు దట్టమైన అటవీ ప్రాంతంలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. వీరిని ఆ తరువాత పాడేరు డిపోనకు చెందిన పాడేరు- డొంకరాయి బస్సులో పంపించారు. విశాఖ డిపో బస్సులు ఈ ప్రాంతంలో ఎన్నిసార్లు మొరాయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, కండీషన్‌లో లేని బస్సులను ఇక్కడికి పంపుతున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు.