ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్ల సమ్మె
ABN , Publish Date - May 03 , 2025 | 12:49 AM
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజా రవాణా శాఖ (పీటీడీ) అనకాపల్లి డిపో నుంచి బస్సులను ఆపరేట్ చేస్తున్న ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు శుక్రవారం సమ్మెకు దిగారు.
నిలిచిపోయిన 40 బస్సులు
ప్రయాణికుల ఇక్కట్లు
అనకాపల్లి టౌన్, మే 2 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజా రవాణా శాఖ (పీటీడీ) అనకాపల్లి డిపో నుంచి బస్సులను ఆపరేట్ చేస్తున్న ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు శుక్రవారం సమ్మెకు దిగారు. దీంతో 40 బస్సులు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనకాపల్లి డిపోలో అద్దె వాటితోకలిపి మొత్తం 95 బస్సులు వున్నాయి. వీటిలో 25 బస్సులను అమరావతిలో ప్రధాని సభకు ప్రజలను తరలించేందుకు గురువారమే పంపారు. శుక్రవారం అద్దె బస్సుల డ్రైవర్ల సమ్మెతో 40 బస్సులు రోడ్డెక్కలేదు. ఇక మిగిలింది 35 బస్సులే. దీంతో విశాఖపట్నం, విజయనగరం, పాయకరావుపేట, మాడుగుల, చోడవరం, దేవరాపల్లి, నర్సీపట్నం ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం కాంప్లెక్స్‌లో గంటల తరబడి వేచివుండాల్సి వచ్చింది. బస్సు వచ్చిందే తడవుగా ప్రయాణికులు ఒక్కసారిగా ఎగబడుతున్నారు. గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలన్న ఉద్దేశంతో పలువురు నిల్చుని ప్రయాణించారు. కాగా బస్సుల కొరతతో ప్రయాణికుల ఇక్కట్లపై ఆర్టీసీ ఏడీఎం రవిచంద్రను వివరణ కోరగా.. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు నర్సీపట్నం, విశాఖపట్నం, విజయనగరం డిపోల నుంచి 15 బస్సులను రప్పించినట్టు చెప్పారు.
అద్దె బస్సుల డ్రైవర్ల డిమాండ్లు..
సమ్మె సందర్భంగా పలువురు డ్రైవర్లు మాట్లాడుతూ, ఒప్పంద కాలపరిమితి ముగిసి ఏడు నెలలు కావస్తున్నా వేతనాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ.26 వేలు, ఏటా బోనస్ కింద రూ.10 వేలు ఇవ్వాలని, 1/2019 సర్క్యులర్‌ను అమలు చేయాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్ అమలు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఫుట్‌బోర్డు వద్ద నిలబడి ప్రయాణిస్తున్న వారు పొరపాటున జారిపడి మరణిస్తే డ్రైవర్లను బాధ్యులను చేసి ఉద్యోగంలో నుంచి తొలగించడం సరికాదని అన్నారు. చర్చల పేరుతో ఇటు బస్సుల ఆపరేటర్లు, అటు పీటీడీ యాజమాన్యం తమ సమస్యల పరిష్కారంలో కాలయాపన చేస్తున్నారని, విధి లేని పరిస్థితిలో సమ్మెకు దిగాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అద్దె బస్సుల వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలకా సత్యనారాయణ, నాయకులు జి.శ్రీనివాసరావు, ఆర్.నాగేశ్వరరావు, సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి ఆర్.శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
సమ్మె విరమణ
కాగా డ్రైవర్లకు వేతనం పెంపు, బోనస్ ఇవ్వడానికి బస్సుల యజమానులు అంగీకరించడంతో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు చేపట్టిన సమ్మెను శుక్రవారం రాత్రి విరమించినట్టు ఆర్టీసీ ఏడీఎం రవిచంద్ర తెలిపారు. శనివారం నుంచి అద్దె బస్సులు యఽథావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు.