లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:14 AM
ముందు వెళుతున్న లారీని ఎడమ వైపు నుంచి అధిగమించే క్రమంలో రోడ్డు పక్కన ఆగివున్న మరో లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటన మంగళవారం ఉదయం బయ్యవరం వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బస్సు డ్రైవర్లకు తీవ్ర గాయాలుకాగా, మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు.
ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలు
కశింకోట, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ముందు వెళుతున్న లారీని ఎడమ వైపు నుంచి అధిగమించే క్రమంలో రోడ్డు పక్కన ఆగివున్న మరో లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటన మంగళవారం ఉదయం బయ్యవరం వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బస్సు డ్రైవర్లకు తీవ్ర గాయాలుకాగా, మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ కె.లక్ష్మణరావు తెలిపిన వివరాలు..
బాపట్ల డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు విజయనగరం వెళ్లడానికి సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు బాపట్లలో బయలుదేరింది. మంగళవారం ఉదయం ఆరు గంటల సమయానికి కశింకోట మండలం బయ్యవరం వద్దకు చేరింది. డివైడర్ పక్కగా ముందు వెళుతున్న లారీని ఎడమ వైపు నుంచి ఓవర్ టేక్ చేయడానికి బస్సు డ్రైవర్ ప్రయత్నించాడు. అయితే ఇక్కడ ఎడమవైపున రోడ్డుపై ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిలిపివుంచిన లారీని డ్రైవర్ గమనించలేదు. దీంతో ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ షేక్ ఖాశీం, ఆప్షనల్ డ్రైవర్ డి.సుధాకరరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో వున్న 16 మంది ప్రయాణికుల్లో తెనాలి నుంచి వస్తున్న అమ్మిరెడ్డి చౌడేశ్వరరావు, ఎం.శ్రీనివాసరావులకు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ ఖాశీంకు ప్రథమ చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైనలారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.